Congress MLA: పార్లమెంటు ఎన్నికల వేళ.. కాంగ్రెస్‌కు భారీషాక్.. కమలం గూటికి హస్తంపార్టీ ఎమ్మెల్యే..
ABN , Publish Date - Feb 25 , 2024 | 12:10 PM
పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, తమిళనాడు కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. ఆ పార్టీ విళవంగోడు నియోజకవర్గ మహిళా ఎమ్మెల్యే విజయతరణి(MLA Vijayatharani) శనివారం ఢిల్లీలో బీజేపీ పెద్దల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు.

- బీజేపీలో చేరిన విజయతరణి
- పార్టీ ఫిరాయింపు చట్టం కింద చర్యలు తీసుకుంటాం
- టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వపెరుందగై హెచ్చరిక
చెన్నై: పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, తమిళనాడు కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. ఆ పార్టీ విళవంగోడు నియోజకవర్గ మహిళా ఎమ్మెల్యే విజయతరణి(MLA Vijayatharani) శనివారం ఢిల్లీలో బీజేపీ పెద్దల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. కేంద్ర సహాయ మంత్రి డా.ఎల్.మురుగన్, ఆ పార్టీ కో-ఇన్‌ఛార్జి పొంగులేటి సుధాకర్‌రెడ్డి, అరవింద్ మీనన్ తదితరులు పార్టీలోకి విజయతరణిని సాదరంగా ఆహ్వానించారు. కన్నియాకుమారి జిల్లా నుంచి కాంగ్రెస్ తరఫున విజయతరణి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. స్వాతంత్య్ర సమరయోధుడు దేశీయ వినాయగం పిళ్లై ముదిమనవరాలైన ఆమె రాష్ట్ర కాంగ్రెస్ లో పలు కీలక బాధ్యతల్లో రాణించారు. బీజేపీలో చేరకముందు కాంగ్రెస్ బాధ్యతల నుంచి రాజీనామా చేస్తూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు లేఖ రాసినట్లు ఆమె మీడియాకు వివరించారు. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ పార్టీ పదవుల నుంచి ఆమె వైదొలగకముందే పార్టీ సాధారణ సభ్యత్వం నుంచి విజయతరణిని తొలగించినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అజయ్‌కుమార్ ప్రకటించారు. ఇదిలా ఉండగా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకపోవడంపై టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వపెరుందగై మాట్లాడుతూ... ఎమ్మెల్యేగా ప్రజలకు ఎలాంటి మేలు చేయకపోయినప్పటికీ, విజయతరణికి పార్టీలో గౌరవం ఉండేదని, ఆమె బీజేపీలో చేరినందువల్ల ‘ఇండియా’ కూటమికి ఎలాంటి నష్టం లేదన్నారు. ఆమెపై పార్టీ ఫిరాయింపు చట్టం కింద చర్యలు తీసుకుంటామని, దీనిపై రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అప్పావుకు పార్టీ తరఫున లేఖ అందజేశామని తెలిపారు. కాగా, కన్నియాకుమారి కాంగ్రెస్ ఎంపీ విజయ్‌వసంత్ మాట్లాడుతూ... పార్టీకి ద్రోహం తలపెట్టిన విజయతరణిని రాష్ట్రప్రజలు క్షమించబోరని, ఒకవేళ రాబోయే ఎన్నికల్లో బీజేపీ తరఫున రాష్ట్రంలో ఎక్కడ పోటీచేసినా ఆమెను ప్రజలే చిత్తుగా ఓడిస్తారని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, బీజేపీలో చేరిన విజయతరణి వైఖరి ఖండిస్తూ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కాంగ్రెస్ శ్రేణులు ఆమె దిష్టిబొమ్మ దహనం నిరసన వ్యక్తం చేశారు.