Lok Sabha Elections: ఇండియా బ్లాక్‌ను గెలిపిస్తే ఎంఎస్‌పీపై చట్టం.. కాంగ్రెస్ కీలక ప్రకటన
ABN, Publish Date - Feb 13 , 2024 | 05:07 PM
పండించే పంటకు కనీస మద్దతు ధర ఇవ్వాలంటూ రైతుల చిరకాల డిమాండ్‌పై కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపిస్తే రైతులు పండించే వివిధ పంటలకు కనీస మద్దతు ధర ఇచ్చేలా ఒక చట్టాన్ని తీసుకువస్తామని ప్రకటించింది.
న్యూఢిల్లీ: పండించే పంటకు కనీస మద్దతు ధర (MSP) ఇవ్వాలంటూ రైతుల చిరకాల డిమాండ్‌పై కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికల్లో (Lok sabha Elections -2024) 'ఇండియా' (I.N.D.I.A.) కూటమిని గెలిపిస్తే రైతులు పండించే వివిధ పంటలకు కనీస మద్దతు ధర ఇచ్చేలా ఒక చట్టాన్ని తీసుకువస్తామని ప్రకటించింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీనియర్ నేత రాహుల్ గాంధీ ఈ మేరకు ఒక ప్రకటన చేశారు.
దేశ ఆర్థికాభివృద్ధిలో రైతులు పాత్ర కీలకమని, అన్నదాతల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. వివిధ పంటలకు కనీసమద్దతు ధర ఇచ్చేలా చట్టం తీసుకురావలంటూ రైతులు మరోసారి పెద్ద ఎత్తున ఛలో ఢిల్లీ పేరుతో హస్తినలో ఆందోళనకు దిగిన నేపథ్యంలో ఖర్గే తాజా ప్రకటన చేశారు.
రైతు సోదరులకు చారిత్రక దినం: రాహుల్
రైతన్నలకు ఈరోజు చారిత్రక దినమని రాహుల్ గాంధీ మంగళవారం 'ఎక్స్' ఖాతాలో పేర్కొన్నారు. స్వాభిమాన్ కమిషన్ ప్రకారం ప్రతి రైతుకి కనీస మద్దతు ధరపై చట్టబద్ధమైన గ్యారెంటీ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. రైతుల అభ్యుదయానికి దోహదపడే ఈ చట్టబద్ధత వల్ల 15 కోట్ల రైతు కుటుంబాల జీవితాల్లో మార్పులు వస్తాయన్నారు. కాంగ్రెస్ న్యాయ్ (జస్టిస్) మార్గంలో ఇది తొలి గ్యారెంటీ అని ఆయన చెప్పారు.
Updated Date - Feb 13 , 2024 | 05:11 PM