హత్యాచారానికి మరణశిక్ష
ABN , Publish Date - Sep 04 , 2024 | 04:02 AM
అత్యాచారం, హత్య కేసుల్లో నిందితులకు మరణ శిక్ష విధించేలా రూపొందించిన బిల్లును పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఆమోదించింది.
బెంగాల్ అసెంబ్లీలో బిల్లు ఆమోదం
ప్రధాని ఇలాంటి చట్టాన్ని తీసుకురాకపోవడం సిగ్గు పడాల్సిన అంశం: మమత
కోల్‌కతా, సెప్టెంబరు 3: అత్యాచారం, హత్య కేసుల్లో నిందితులకు మరణ శిక్ష విధించేలా రూపొందించిన బిల్లును పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఆమోదించింది. అపరాజిత మహిళ, శిశు(పశ్చిమబెంగాల్ క్రిమినల్ చట్టాల సవరణ) పేరుతో ప్రవేశపెట్టిన ఈ బిల్లును సభ మూజువాణి ఓటుతో ఆమోదించగా.. ముందుగా హామీ ఇచ్చినట్లు బీజేపీ సభ్యులు ఓటింగ్ కోసం పట్టుబట్టలేదు. కేంద్ర చట్టాలు-- భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎ్‌స), భారతీయ నాగరిక్ సురక్ష సంహిత(బీఎన్‌ఎ్‌సఎ్‌స), చిన్నారులపై అత్యాచారాల నిరోధక చట్టం(పోక్సో)లో తగు సవరణలు చేయాల్సిందిగా ఈ బిల్లు సూచిస్తోంది. ముఖ్యంగా.. హత్యాచారాలు, అత్యాచారాలతో బాధితురాలి మానసిక స్థితి దెబ్బతినేలా చేసే నిందితులకు మరణ శిక్ష విధించాలని అపరాజిత బిల్లు స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి. కాగా, సభలో బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మమతాబెనర్జీ బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు. ‘‘మా ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లు తరహాలో.. ప్రధాని మోదీ చట్టాన్ని తీసుకురాకపోవడం సిగ్గుపడాల్సిన అంశం. ఈ బిల్లును హుందాగా ఆమోదించాల్సిందిగా గవర్నర్‌ను కోరుతున్నాను. సభలో విపక్ష నేత(బీజేపీ) కూడా గవర్నర్ ఈ బిల్లును పెండింగ్‌లో పెట్టకుండా, వీలైనంత త్వరగా ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని ఆమె వ్యాఖ్యానించారు. ఆర్‌జీ కర్ ఘటనలో సీబీఐ న్యాయం చేయాలని ఆమె కోరారు. ‘‘ఆర్‌జీ కర్ హత్యాచారం ఘటనపై వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ సభ్యులు, నేతలు.. ఉన్నావ్(ఉత్తరప్రదేశ్) ఉదంతంపై ఎందుకు నోరు మెదపలేదు?’’ అని ఆమె నిలదీశారు. ఉన్నావ్ కేసులో నిందిత చట్ట సభ్యుడిని పూలమాలలతో సత్కరించడం సిగ్గుపడే విషయమంటూ మండిపడ్డారు.