Delhi CM Kejriwal : ఒక్కో దశకు విజయం మరింత చేరువ
ABN, Publish Date - May 22 , 2024 | 04:31 AM
ఒక్కో దశ పోలింగ్ ముగిసేకొద్దీ ఇండియా కూటమి విజయానికి మరింత చేరువ అవుతోందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. ‘‘మోదీ పతనం ఖాయం. ఈ విషయం జూన్ 4వ తేదీన తేలిపోతుంది.
జూన్ 4న ఇండియా కూటమి ప్రభుత్వం : కేజ్రీవాల్
న్యూఢిల్లీ, మే 21 : ఒక్కో దశ పోలింగ్ ముగిసేకొద్దీ ఇండియా కూటమి విజయానికి మరింత చేరువ అవుతోందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. ‘‘మోదీ పతనం ఖాయం. ఈ విషయం జూన్ 4వ తేదీన తేలిపోతుంది. ఇండియా కూటమి సుస్థిరమైన, పూర్తి కాలపు ప్రభుత్వాన్ని అందిస్తుంది’’ అని కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేవారు. ఢిల్లీ వాసులను పాకిస్థానీయులుగా పేర్కొంటే సహించేది లేదని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను ఉద్దేశించి కేజ్రీవాల్ హెచ్చరించారు. రాహుల్, కేజ్రీవాల్‌లకు ఇండియాలో మద్దతు లేదని, వారి మద్దతుదారులు పాకిస్థాన్‌లో ఉన్నారని అమిత్‌షా అనడాన్ని కేజ్రీవాల్ ఆక్షేపించారు. ‘‘62 సీట్లు, 56 శాతం ఓట్లు ఆప్‌కు ఇచ్చి ఢిల్లీ ప్రజలు అందించారు. 117 సీట్లకు 92 సీట్లు ఆప్‌కు పంజాబీలు అందించారు. గోవా ప్రజలు ఆప్ పట్ల ప్రేమను, విశ్వాసాన్ని ప్రకటించారు.
గుజరాతీలు ఆప్‌కు 14 శాతం ఓట్లు అందించారు. మరి.. ఢిల్లీ వాసులు, పంజాబీలు, గోవావాసులు, గుజరాతీలు అంతా పాకిస్థానీయులేనా?’’ అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. కాగా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా మరోసారి అరవింద్ కేజ్రీవాల్‌పై విరుచుకుపడ్డారు. ఆప్ ఎంపీ స్వాతీ మాలివాల్ వంటి మహిళల పట్ల ఆయన వైఖరి ఏమిటనేది కేజ్రీవాల్ మౌనమే చెప్తోందని సక్సేనా విమర్శించారు. కాగా, స్వాతీ మాలివాల్ బీజేపీ కోసం పని చేస్తున్నారన్న తమ వాదనను సక్సేనా విమర్శలు బలపరుస్తున్నాయని ఆప్ ఆరోపించింది.
Updated Date - May 22 , 2024 | 04:31 AM