Share News

Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. ఈడీ కస్టడీకి అనుమతించిన కోర్టు

ABN , Publish Date - Mar 22 , 2024 | 08:54 PM

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు ఈ నెల 28 వరకు కస్టడీ విధిస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు శుక్రవారం సాయంత్రం తీర్పు వెలువరించింది. దీంతో ఈ కేసులో కేజ్రీవాల్‌‌ను మరింత లోతుగా విచారించేందుకు ఈడీకి మార్గం సుగుమమైంది.

Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. ఈడీ కస్టడీకి అనుమతించిన కోర్టు

ఢిల్లీ: సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు ఈ నెల 28 వరకు కస్టడీ విధిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. దీంతో ఈ కేసులో కేజ్రీవాల్‌‌ను మరింత లోతుగా విచారించేందుకు ఈడీకి మార్గం సుగుమమైంది. 28వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు ఆయనను తిరిగి కోర్టులో హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది.

ఆయనను పూర్తిగా కస్టడీలోకి తీసుకొని ఈడీ విచారించనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో గురువారం రాత్రి సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని(Arvind Kejriwal) ఈడీ అరెస్ట్ చేసిన విషయం విధితమే. ఈ క్రమంలో ఆయనను శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టుకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. "నేను జైలులో ఉన్నా బయట ఉన్నా నా జీవితం దేశానికి అంకితం" అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆప్ చీఫ్ కేజ్రీవాల్ ఢిల్లీ మద్యం పాలసీ కేసులో "కీలక కుట్రదారు" అని ఈడీ ఆరోపించింది. ఆయనను ప్రశ్నించేందుకు 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరిన విషయం తెలిసిందే.

ఈడీ వినతి మేరకు రౌస్ ఎవెన్యూ కోర్టు తీర్పు వెలువరించింది. తనను అరెస్టు చేయకుండా మధ్యంతర రక్షణ కల్పించాలంటూ కేజ్రీ వేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించిన కొద్దిసేపటికే ఆయన్ని అరెస్టు చేశారు.


పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సౌత్ గ్రూపునకు చెందిన కొందరు నిందితుల నుంచి కేజ్రీవాల్ రూ.100 కోట్లు డిమాండ్ చేశారని ఈడీ తరఫు అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు రౌస్అవెన్యూ కోర్టుకు తెలిపారు. కాగా కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేస్తారనే ప్రచారం మొదటి నుంచీ జరిగింది.

అందరూ అనుకున్నట్లుగానే ఆయన్ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అంతకంటే ముందు.. శాంతిభద్రత సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు కేజ్రీవాల్ ఇంటి వద్ద, ఈడీ కార్యాలయం వద్ద కేంద్ర భద్రతా బలగాలను భారీగా మోహరించారు. ఇదే కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత కూడా నాలుగు రోజుల క్రితం అరెస్టయ్యారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 22 , 2024 | 09:17 PM