Delhi : పార్లమెంట్ పైకప్పు లీకేజీ
ABN, Publish Date - Aug 02 , 2024 | 02:49 AM
ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాలకు కొత్త పార్లమెంటు భవనం పైకప్పు లీకవుతోంది. రూ.1,000 కోట్లకు పైగా ఖర్చు చేసి నిర్మించిన ఈ భవనం లాబీలోని గాజు పైకప్పు నుంచి కింద ఉచిన బకెట్‌లోకి నీరు ధారగా పడుతున్న వీడియోను సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్...
బయట పేపర్ లీక్.. లోపల వాటర్ లీక్: కాంగ్రెస్
నిర్మాణానికి 1,200 కోట్లు
ఇప్పుడు రూ.120 బకెట్‌పై ఆధారపడాల్సొచ్చింది: ఆప్
బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాల మండిపాటు
లీకేజీ స్వల్పమే.. పరిష్కరించాం: కేంద్రం
న్యూఢిల్లీ, ఆగస్టు 1: ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాలకు కొత్త పార్లమెంటు భవనం పైకప్పు లీకవుతోంది. రూ.1,000 కోట్లకు పైగా ఖర్చు చేసి నిర్మించిన ఈ భవనం లాబీలోని గాజు పైకప్పు నుంచి కింద ఉచిన బకెట్‌లోకి నీరు ధారగా పడుతున్న వీడియోను సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ‘‘కొత్త భవనం కంటే పాత భవనం చాలా మెరుగ్గా ఉంది. వర్షాకాల సమావేశాలను పాతదానిలో ఎందుకు నిర్వహించకూడదు.
కనీసం కొత్తదానిలో నీరు కారడం ఆగిపోయే వరకైనా..’ అంటూ వ్యంగాస్త్రాలు సంధించారు. ఈ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రతి కొత్త భవనం పైకప్పు నుంచి నీరు లీకవడం.. బాగా ఆలోచించి రూపొందించిన డిజైన్‌లో భాగమా అని ప్రజలు అడుగుతున్నారని ఆయన బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
ఈ వీడియోపై కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ స్పందించారు. ‘‘బయట పేపర్ లీక్.. లోపల వాటర్ లీక్.. నిర్మించిన ఏడాది పూర్తి కాకుండానే పార్లమెంట్ లాబీలో నీరు లీక్ కావడం కొత్త భవనంలో అత్యవసర పునరుద్ధరణ సమస్యలను ఎత్తి చూపుతోంది’’ అని ఎద్దేవా చేశారు.
ఈ అంశంపై చర్చించడానికి ప్రస్తుత లోక్‌సభ సమావేశాల్లో ఆయన వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. ‘రూ.1,200 కోట్ల వ్యయంతో నిర్మించిన పార్లమెంట్ ఇప్పుడు రూ.120 బకెట్‌పై ఆధారపడి ఉంది’ అని ఆమ్ ఆద్మీ పార్టీ ఎద్దేవా చేసింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా కొత్త పార్లమెంట్ భవనాన్ని 2023 మే 28న ప్రధాని మోదీ ప్రారంభించారు.
కాగా, పైకప్పు గ్లాస్ డోమ్‌లకు ఏర్పాటుచేసిన పట్టీలు వదులుగా ఉండటంతో కొత్త పార్లమెంటు భవనం మకర ద్వారం వద్ద స్పల్పంగా నీరు లీకైందని లోక్‌సభ సెక్రటేరియట్ తెలిపింది. సకాలంలో సమస్యను గుర్తించి, వెంటనే మరమ్మతులు చేపట్టామని, అంతటితో నీరు కారడం ఆగిపోయిందని కేందర ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
Updated Date - Aug 02 , 2024 | 02:49 AM