ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi : ఆహార ధర దడ

ABN, Publish Date - Jul 23 , 2024 | 04:18 AM

ఎన్ని సవాళ్లు ఎదురైనా దేశ ఆర్థిక వృద్ధి బాగానే ఉంటుందని ఆర్థిక సర్వే వెల్లడించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.5 శాతం నుంచి 7 శాతం వరకు ఉంటుందని తెలిపింది.

  • రెండేళ్లలో రేట్లు రెట్టింపు!.. వాతావరణ మార్పులు, అకాల వర్షాలే కారణం

  • సవాళ్లు ఉన్నా 2024-25లో ఆర్థిక వృద్ధి 6.5-7 శాతం

  • మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.. 2050కల్లా దేశంలో వృద్ధుల సంఖ్య రెట్టింపు

  • వారి సంరక్షణకు ప్రాధాన్యమివ్వాలి.. 18 ఏళ్లు దాటిన వారిలో మూడింతలు పెరిగిన స్థూలకాయం

  • కేంద్రం, రాష్ట్రాలు కలిసి విద్యా నాణ్యత పెంచాలి.. యువతలో సగం మందికే ఉద్యోగ నైపుణ్యాలు!

  • దేశంలో ఏటా 78 లక్షల కొలువులు కల్పించాలి

  • 2023-24 ఆర్థిక సర్వేలో వెల్లడి

  • లోక్‌సభలో నేడు కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నిర్మల

న్యూఢిల్లీ, జూలై 22: ఎన్ని సవాళ్లు ఎదురైనా దేశ ఆర్థిక వృద్ధి బాగానే ఉంటుందని ఆర్థిక సర్వే వెల్లడించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.5 శాతం నుంచి 7 శాతం వరకు ఉంటుందని తెలిపింది. దేశంలో ఆహార ద్రవ్యోల్బణం భారీగా పెరిగిందని పేర్కొంది. 2022లో ఇది 3.8 శాతం ఉండగా.. 2023లో 6.6 శాతానికి, 2024లో 7.5 శాతానికి పెరిగిందని వివరించింది. అంటే గడిచిన రెండేళ్లలో 97 శాతం పెరిగిపోయినట్లు పేర్కొంది. వాతావరణ మార్పులు, వడగాడ్పులు, రుతుపవనాల విస్తరణలో వ్యత్యాసాలు, అకాల వర్షాలు వంటి కారణాలతో ఆహార ధరలు రెట్టింపు అయ్యాయని తెలిపింది.

2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను మంగళవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో సోమవారం ఆమె 2023-24 ఆర్థిక సర్వేను విడుదల చేశారు. విద్య, ఆరోగ్యం, ఉద్యోగావకాశాలు, ఆహార ధరల పెరుగుదల, వృద్ధుల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు వంటి వివిధ అంశాలపై ఆర్థిక సర్వే సమగ్ర సూచనలు చేసింది. దేశంలో నాణ్యమైన విద్యను అందించాలని..

అందుకు కేంద్రం, రాష్ట్రాలు, స్థానిక సంస్థలు కలిసి పనిచేయాలని స్పష్టం చేసింది. మానసిక ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించింది. 2050 నాటికి వృద్ధుల సంఖ్య రెట్టింపు కానుందని.. ఈ క్రమంలో వారి సంరక్షణకు ప్రాధాన్యమివ్వాలని పేర్కొంది. దేశంలో పెరిగిపోతున్న స్థూలకాయం సమస్యపై ఆందోళన వ్యక్తం చేసింది. దేశ ఆర్థికాభివృద్ధి కోసం వ్యవసాయేతర రంగంలో ఏటా సుమారు 78 లక్షల ఉద్యోగాలు కల్పించాలని సూచించింది. కృత్రిమ మేధ(ఏఐ) కారణంగా సేవల రంగంలో భారతదేశ ఎగుమతులు ఏటా తగ్గనున్నాయని పేర్కొంది.


సైకియాట్రిస్ట్‌ల సంఖ్య పెంచాలి

మానసిక ఆరోగ్యం విషయంలో మన పంథా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆర్థిక సర్వే పేర్కొంది. వ్యక్తిగత, దేశ అభివృద్ధిలో మానసిక ఆరోగ్యానిది కీలక పాత్ర అని తెలిపింది. సైకియాట్రి్‌స్టల సంఖ్య పెంచాలని, పాఠశాలల్లో మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచాలని స్పష్టం చేసింది. జాతీయ మానసిక ఆరోగ్య సర్వే (ఎన్‌ఎంహెచ్‌ఎ్‌స) 2015-16 ప్రకారం దేశంలో 18 ఏళ్లు పైబడిన వారిలో 10.6 శాతం మంది మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారని తెలిపింది.

70 నుంచి 92 శాతం మంది సరైన చికిత్స తీసుకోవడం లేదని గుర్తుచేసింది. ప్రస్తుతం దేశంలో వృద్ధుల సంరక్షణ రంగం విలువ రూ.57,881 కోట్లని తెలిపింది. కానీ, ఈ రంగంలో అనేక లోపాలు ఉన్నాయంది. మౌలిక వసతులు, వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులపై పరిశోధన, పర్యవేక్షణ యంత్రాంగం, అత్యవసర స్పందన వ్యవస్థ వంటి అంశాల్లో చాలా లోపాలు ఉన్నాయని వివరించింది.

2022 నాటి ఐరాస గణాంకాల ప్రకారం భారత జనాభాలో 0-14 ఏళ్లలోపు వారి సంఖ్య నాలుగో వంతు (సుమారు 36 కోట్ల మంది) ఉండగా.. 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య పదో వంతు (సుమారు 14.7 కోట్ల మంది) ఉన్నట్లు తెలిపింది. 2050 నాటికి పిల్లల జనాభా 18 శాతానికి (30 కోట్ల మందికి) తగ్గిపోనుండగా.. వృద్ధుల సంఖ్య 20.8 శాతానికి (34.7 కోట్లకు) పెరుగుతుందని వెల్లడించింది.


ఊబకాయం.. ఆందోళనకరం..

పెరిగిపోతున్న స్థూలకాయం సమస్యపై ఆర్థిక సర్వేలో ఆందోళన వ్యక్తమైంది. అత్యధిక చక్కెర, కొవ్వులతో కూడిన ఆహార పదార్థాల వినియోగంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. దేశంలో 54 శాతం అనారోగ్య సమస్యలకు ఆహారపు అలవాట్లే కారణమని తెలిపింది. ఇటీవల భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) విడుదల చేసిన నివేదికను ప్రస్తావిస్తూ.. అధిక చక్కెర, కొవ్వులతో కూడిన ప్రాసెస్డ్‌ ఆహార వినియోగం విపరీతంగా పెరిగిందని సర్వే తెలిపింది.స్థూలకాయం విషయంలో వియత్నాం, నమీబియా తర్వాత స్థానంలో భారత్‌ ఉందంటూ ప్రపంచ ఒబెసిటీ సమాఖ్య నివేదికను ఉటంకించింది. ఆంధ్రప్రదేశ్‌లో పురుషుల్లో 31.1 శాతం, మహిళల్లో 36.3 శాతం ఊబకాయులేనని, తెలంగాణలో పురుషుల్లో 32.3 శాతం, స్త్రీలలో 30.1 శాతం ఊబకాయులని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే పేర్కొందని వివరించింది. విద్యా నాణ్యతను మెరుగుపర్చాలని, ప్రత్యేకించి ప్రాథమిక విద్యపై దృష్టి సారించాలని ఆర్థిక సర్వే సూచించింది.


65 శాతం మంది 35 ఏళ్లలోపు వారే..

వ్యవసాయేతర రంగంలో 2030 వరకు ఏటా సగటున 78 లక్షల ఉద్యోగాలు కల్పించాలని సర్వే స్పష్టం చేసింది. 2023లో దేశంలో మొత్తం పనిచేసేవారి వారి సంఖ్య 56.50 కోట్లు ఉండగా.. ఇందులో వ్యవసాయ రంగ కార్మికుల వాటా 45.8 శాతం ఉందని తెలిపింది. 2047 నాటికి ఇది నాలుగో వంతుకు తగ్గిపోతుందని అంచనా వేసింది. ఈ వ్యత్యాసాన్ని భర్తీ చేయడానికి వ్యవసాయేతర రంగంలో ఏటా సగటున 78 లక్షల ఉద్యోగావకాశాలు కల్పించాలని పేర్కొంది. ఇక తయారీ రంగంలో ఉపాధి కల్పన వృద్ధి రేటు తగ్గిపోతోందని తెలిపింది. దేశంలోని 65 శాతం మంది 35 ఏళ్లలోపు వారేనని.. చాలా మందికి ఆధునిక నైపుణ్యాలు లేవని తెలిపింది. ఇక దేశ యువతలో 51.25 శాతం మందికి ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు ఉన్నాయని పేర్కొంది. అయితే పదేళ్ల కిందట ఇది 34 శాతమే ఉందని.. ప్రస్తుతం మెరుగుపడిందని సర్వే వెల్లడించింది.

ఫ కృత్రిమ మేధ (ఏఐ) కారణంగా సేవల రంగంలో భారతదేశ ఎగుమతుల వృద్ధి రేటు రాబోయే పదేళ్లలో ఏటా 0.3 నుంచి 0.4 పర్సంటేజీ పాయింట్లు తగ్గిపోయే అవకాశం ఉందని ఆర్థిక సర్వే తెలిపింది.

Updated Date - Jul 23 , 2024 | 04:20 AM

Advertising
Advertising
<