Farmers Protest: కదం తొక్కిన కర్షకులు.. డిమాండ్ల సాధన కోసం హస్తినలో నిరసన
ABN, Publish Date - Feb 13 , 2024 | 12:05 PM
తమ డిమాండ్లు నెరవేర్చాలని రైతులు కదం తొక్కారు. దేశ రాజధానిలో భారీ నిరసన చేపట్టేందుకు బయల్దేరారు. ఢిల్లీ సరిహద్దుల వద్ద బారికేడ్ల ఏర్పాటు, అదనపు పోలీసు బలగాలను మొహరించారు.
ఢిల్లీ: తమ డిమాండ్లు నెరవేర్చాలని రైతులు కదం తొక్కారు. దేశ రాజధాని ఢిల్లీలో భారీ నిరసన చేపట్టేందుకు బయల్దేరారు. రైతుల నిరసన నేపథ్యంలో ఢిల్లీ (Delhi) సరిహద్దుల వద్ద పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. అదనపు పోలీసు బలగాలను మొహరించారు. రైతుల నిరసన నేపథ్యంలో ఢిల్లీలో 144 సెక్షన్ విధించారు. ఢిల్లీ సరిహద్దుల్లో 2 వేల మంది భద్రతా సిబ్బందిని మొహరించారు. పోలీసులతోపాటు సీఏపీఎఫ్, క్రైమ్ బ్రాంచ్, బెలాటియన్ సిబ్బంది భద్రతా చర్యల్లో పాల్గొంటున్నారు.
జైలుగా స్టేడియం..?
పంజాబ్, హర్యానా మధ్య గల శంబు వద్ద నుంచి రైతులు ఢిల్లీకి బయల్దేరారు. రైతులు ట్రాక్టర్లలో వస్తున్నందున.. ట్రాక్టర్ ట్రాలీలను ఢిల్లీలోకి అనుమతించడం లేదని పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు. నిరసన ప్రదర్శన కోసం వచ్చే రైతులు తమ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారని రైతు సంఘం నేత లఖ్విందర్ సింగ్ పేర్కొన్నారు. రైతుల నిరసన నేపథ్యంలో భారీగా ఢిల్లీలోకి రైతులు వచ్చే అవకాశం ఉంది. సిటీలో గల భవనా స్టేడియాన్ని తాత్కాలిక జైలుగా ఉపయోగిస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. రైతులను ఆ స్టేడియానికి తరలిస్తామని అంటోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనను ఢిల్లీ ప్రభుత్వం తోసిపుచ్చింది. మరోవైపు రైతుల నిరసన ప్రదర్శన నేపథ్యంలో ఢిల్లీ నోయిడా సరిహద్దుల్లో భారీ ట్రాఫిక్ జామ్ నెలకొంది.
కమిటీ వేస్తామని ప్రకటన..?
పంటలకు కనీస మద్దతు ధర, రుణ మాఫీ తదితర డిమాండ్లతో రైతులు ఆందోళన చేపట్టారు. డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడం లేదు. రైతు సంఘం నేతలతో కేంద్ర ప్రభుత్వం రెండుసార్లు చర్చలు జరిపింది. ఈ నెల 8వ తేదీన తొలి విడత చర్చలు జరిగాయి. సోమవారం (నిన్న) రెండో విడత 5 గంటలకు పైగా చర్చలు జరిగాయి. డిమాండ్లు తీర్చడంపై కేంద్ర మంత్రుల బృందం రైతు సంఘం నేతలకు స్పష్టత ఇవ్వలేదు. కొన్నింటిని మాత్రమే అమలు చేస్తామని స్పష్టంచేసింది. మరికొన్ని డిమాండ్లపై కమిటీ వేస్తామని కేంద్ర మంత్రులు ప్రతిపాదించారు. అందుకు రైతు సంఘం నేతలు అంగీకరించలేదు. దీంతో మంగళవారం ఢిల్లీలో నిరసన ప్రదర్శన కార్యక్రమం కొనసాగుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Feb 13 , 2024 | 12:06 PM