Haryana Assembly polls: ఎన్నికలు వాయిదా వేయాలని ఈసీని కోరిన హర్యానా బీజేపీ
ABN, Publish Date - Aug 24 , 2024 | 06:45 PM
షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 1న జరగాల్సిన హర్యానా అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని ఎన్నికల సంఘాన్ని రాష్ట్ర బీజేపీ విభాగం కోరింది. సుదీర్ఘ వారంతపు సెలవుల కారణంగా ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉన్నందున పోలింగ్ తేదీని వాయిదా వేయాలని విజ్ఞప్తి చేసింది.
చండీగఢ్: షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 1న జరగాల్సిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల (Haryana Assembly polls)ను వాయిదా వేయాలని ఎన్నికల సంఘాన్ని (Elections commission) రాష్ట్ర బీజేపీ విభాగం కోరింది. సుదీర్ఘ వారంతపు సెలవుల (లాంగ్ వీకెండ్) కారణంగా ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉన్నందున పోలింగ్ తేదీని వాయిదా వేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఈసీకి హర్యానా బీజేపీ చీఫ్ మోహన్‌లాల్ బడోలి ఈనెల 22న లేఖ రాశారు.
Mallikarjun Kharge: మైనారిటీలు లక్ష్యంగానే బుల్డోజర్ యాక్షన్.. బీజేపీపై ఖర్గే ఫైర్
''28వ తేదీ శనివారం, 29వ తేదీ ఆదివారం వచ్చాయి. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలకు ఒక వీక్లీ హాలిడే ఉంటుంది. అక్టోబర్ 1న పోలింగ్ రోజు కూడా చట్టప్రకారం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు మూతపడతాయి. 2వ తేదీ గాంధీ జయంతి సందర్భంగా నేషనల్ హాలిడే ఉంది. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 2 వరకూ హాలిడేల పొడిగింపు వల్ల ఓటింగ్ శాతం తగ్గేందుకు అవకాశం ఉంది. వీటికి తోడు, హర్యానాలో గణనీయంగా ఓటర్లున్న బిష్ణోయ్ కమ్యూనిటీ వారు రాజస్థా్న్‌లోని ముఖమ్ గ్రామంలో జరిగే వార్షిక యాత్రకు వెళ్తుంటారు. ఆ కారణంగా వారు అక్టోబర్ 1న పోలింగ్‌కు హాజరయ్యే అవకాశాలు ఉండకపోవచ్చు. ఈ కారణాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని గరిష్టంగా ఓటింగ్ శాతం జరిగేందుకు వీలుగా మరో తేదీన ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నాం. గతంలో కూడా ఓటింగ్ తేదీలను పండుగల కారణంగా వాయిదా వేసిన సందర్భాలు ఉన్నాయి'' అని ఈసీకి రాసిన లేఖలో బడోలి కోరారు. కాగా, బీజేపీ హర్యానా విభాగం శుక్రవారం పంపిన ఈ-మెయిల్ తమకు అందిందని, ఎన్నికల కమిషన్‌కు దానిని పంపామని రాష్ట్ర ఎన్నికల అధికారి పంకజ్ అగర్వాల్ ధ్రువీకరించారు.
ఓటమి భయంతోనే: కాంగ్రెస్
కాగా, ఎన్నికలు వాయిదా కోసం బీజేపీ చెప్పిన కారణాల్లో ఏమాత్రం పసలేదని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. బీజేపీకి ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుందని కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ సింగ్ హుడా తెలిపారు. ప్రభుత్వం సాధించినది, ప్రజలకు చెప్పుకునేది ఏదీ లేకపోవడం, 90 టిక్కెట్లకు అభ్యర్థులు కూడా లేకపోవడంతో బీజేపీ కుంటిసాకులు చెబుతోందని, హాలిడేస్ సాకుతో ఎన్నికల వాయిదాకు కుట్ర పన్నుతోందని ఎద్దేవా చేసారు.
Read More National News and Latest Telugu News
Updated Date - Aug 24 , 2024 | 06:48 PM