Heavy Raind: చెన్నై నగరాన్ని ముంచెత్తిన ‘ఫెంగల్’..
ABN, Publish Date - Dec 01 , 2024 | 12:25 PM
ఫెంగల్’ తుఫాను నగరాన్ని ముంచెత్తింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో చెన్నై నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. శనివారం అంతా వర్షం కురుస్తూనే వుండడంతో వాణిజ్య కేంద్రాలుండే టి.నగర్, పురుషవాక్కం, ప్యారీస్(T. Nagar, Purushavakkam, Paris) వంటి ప్రాంతాలు సైతం నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి.
- జలదిగ్బంధంతో స్తంభించిన జనజీవనం
- నిలిచిపోయిన రోడ్డు రవాణా
- సబర్బన్ రైళ్లూ బంద్
- విమానాశ్రయం మూసివేత
- భారీ వర్షంతో తీరప్రాంత జిల్లాలు అతలాకుతలం
- అర్ధరాత్రి పుదువై సమీపంలో తీరం దాటిన తుఫాన్
చెన్నై: ‘ఫెంగల్’ తుఫాను నగరాన్ని ముంచెత్తింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో చెన్నై నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. శనివారం అంతా వర్షం కురుస్తూనే వుండడంతో వాణిజ్య కేంద్రాలుండే టి.నగర్, పురుషవాక్కం, ప్యారీస్(T. Nagar, Purushavakkam, Paris) వంటి ప్రాంతాలు సైతం నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. పెనుగాలుల కారణంగా శివారు ప్రాంతాల్లో కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు స్తంభించాయి.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఒడిశా టూ హైదరాబాద్.. డ్రగ్స్ విక్రయిస్తూ దొరికిపోయారు..
పట్టాభిరాం మెయిన్‌రోడ్డు, తెండ్రల్ నగర్, ఆవడి వసంతం నగర్, రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ క్వార్టర్స్ ప్రాంతం, సరస్వతి నగర్, ప్రకాష్ నగర్ తదితర ప్రాంతాలు నీటిలో మునిగాయి. మనలి ఎక్స్‌ప్రె్‌స రోడ్డులో వర్షపునీరు వరదలా ప్రవహిస్తుండటంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కార్గిల్ నగర్, రాజాజీ నగర్, సత్యమూర్తినగర్ తదితర ప్రాంతాల్లోని రెసిడెన్షియల్ క్వార్టర్స్ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇదిలా ఉండగా శుక్రవారం రాత్రి పది గంటల సమయంలో పుదుచ్చేరి వద్ద తీరాన్ని తాకిన తుఫాన్ అర్ధరాత్రి దాటిన తరువాత తీరం దాటింది.
8 సబ్‌వేల మూత...
నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 8 సబ్‌వేలను మూసివేసినట్లు కార్పొరేషన్ అధికారులు ప్రకటించారు. నగరమంతటా 21 సబ్‌వేలు ఉన్నాయి. కొంగురెడ్డి, రంగరాజపురం -వీలర్, పళవంతాంగళ్, ఆర్‌బీఐ సబ్‌వే, పెరంబూరు అజాక్స్ తదితర 8 సబ్‌వేలలో వర్షపునీరు అధికంగా ప్రవహిస్తుండటంతో మూసివేశారు. ఇదే విధంగా తాంబరం రైల్వే సబ్‌వేలో వర్షపునీరు ప్రవహించడంతో అది కూడా మూసి వేశారు.
విమానాశ్రయ రన్‌వే పైకి నీరు
చెన్నై జాతీయ, అంతర్జాతీయ విమానాశ్రయాల్లో రన్‌వేలపైకి వరదనీరు చేరింది. దీంతో విమానాల రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. అంతే కాకుండా శనివారం మధ్యాహ్నం నుంచి ఆదివారం ఉదయం వరకు విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. తుఫాను కారణంగా చెన్నై నుంచి మదురై, తూత్తుకుడి తదితర ప్రాంతాలకు వెళ్లే 55 విమాన సర్వీసులను రద్దు చేశారు. చెన్నై నుంచి బయలుదేరేవి, ఇతర ప్రాంతాల నుండి వచ్చే విమాన సర్వీసులను సమీపంలోని విమానాశ్రయాలకు మళ్లించారు.
రాయపురంలో..
రాయపురం మాదా చర్చి ప్రాంతంలో ఇళ్లలోకి వరదనీరు జొరబడింది. దీంతో ఆ ఇళ్లలో నివసిస్తున్నవారంతా రాత్రంతా కంటిమీద కునుకులేకుండా గడిపారు. వాషర్‌మెన్‌పేట, భోజరాజ నగర్, రాయపురం, ఆట్టుదొడ్డి, మింట్ స్ట్రీట్, వాల్‌టాక్స్ రోడ్డు తదితర రహదారుల్లోనూ అడుగు లోతు పైగా వర్షపునీరు ప్రవహించింది. కొడుంగయూరు తెండ్రల్ నగర్ ఒకటి నుంచి ఐదు వరకు వీథుల్లో రెండడగుల మేర వర్షపునీరు ప్రవహిస్తోంది. పూందమల్లి రోడ్డు రిథడ్రన్ రోడ్డులో వాహనాలు వెళ్లలేనంతగా వరదనీరు ప్రవహిస్తోంది. కోయంబేడు మెట్రో వంతెన మీదుగా మార్కెట్‌కు వెళ్లే రహదారిలోనూ వరద దృశ్యాలే కొనసాగుతున్నాయి. అయ్యప్పన్ తాంగళ్ నుండి కాట్టుపాక్కం వరకు ప్రధాన రహదారి పూర్తిగా వర్షపునీటిలో మునిగింది. చేపాక్ వాలాజారోడ్డులో రెండడగులు లోతున వరదనీరు పొంగి ప్రవహించింది.
నీట మునిగిన వేళచ్చేరి...
స్థానిక వేళచ్చేరిలో పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో కొట్టుమిట్టాడుతున్నాయి. పలు కాలనీల్లో నివసిస్తున్నవారంతా ఇంటి నుంచి కదల్లేని పరిస్థితి నెలకొంది. తరమణి, పెరుంగుడి, కందన్‌చావిడి ప్రాంతాల్లోనూ వరద నీరు ప్రవహిస్తోంది. కార్పొరేషన్ పారిశుధ్య కార్మికులు భారీ మోటార్ల ద్వారా నీటిని తొలగిస్తున్నా పరిస్థితి అధ్వాన్నంగానే వుంది.
203 ప్రాంతాలపై నిఘా..
నగరంలో తీవ్ర వరద పరిస్థితులు ఏర్పడే 203 ప్రాంతాలపై అగ్నిమాపక సిబ్బంది నిఘా వేస్తున్నారు. నగరంలోని 42 అగ్నిమాపక కేంద్రాల్లో వరదబాధితులకు సహాయక చర్యలు చేపట్టేందుకు 1300 మంది సిబ్బందిని సిద్ధం చేశారు. వరదబాధిత ప్రాంతాల్లో ఇళ్ల వద్ద జలదిగ్బంధంలో చిక్కుకునేవారిని కాపాడేందుకు రబ్బరు బోట్లు, మరపడవలు తదితర సామగ్రితో వర్షబాధిత ప్రాంతాలకు వెళుతున్నారు. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ ఆధ్వర్యంలో 15 జోన్‌లలో 9 హైడ్రాలిక్ రంపాలు, 216 టెలస్కోపిక్ రంపాలతో రెండు కమెండో దళాలు రంగంలోకి దిగాయి. భవన, కట్టడ శిథిలాలలో చిక్కుకునేవారిని కనుగొనే పరికారాలు, రోప్ లాన్సర్, రోప్ రైడర్, థెర్మల్ ఇమేజింగ్ కెమెరాలను కూడా సిద్ధం చేసి ఉంచారు.
రైలు పట్టాలపైకి వరదనీరు..
తుఫాను ప్రభావంతో శుక్రవారం రాత్రి నుంచి కురిసిన కుండపోత వర్షాలకు పల్లావరంలోని రైలు పట్టాలపైకి వరదనీరు చేరింది. దీంతో ఆ మార్గంలో లోకల్ విద్యుత్ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బీచ్ నుంచి తాంబరం వైపు వెళ్లే రైళ్లన్నీ పల్లావరం వరకే నడిపారు. సుమారు రెండు గంటలకు పైగా ఆ మార్గంలో లోకల్ రైళ్లు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. ఇక సుదూర ప్రాంతాల నుంచి చెన్నై రావాల్సిన కొన్ని రైళ్లను ఆవడి నుంచే వెనక్కి మళ్లించారు.
మూతబడిన విద్యాలయాలు
చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, మైలాడుదురై, రాణిపేట, కడలూరు, విల్లుపురం, కళ్ళకురిచ్చి, మైలాడుదురై జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలకు శనివారం సెలవు ప్రకటించారు. అదే విధంగా పుదుచ్చేరి, కారైక్కాల్‌లోని పాఠశాలలు, కళాశాలలకు కూడా శనివారం సెలవు ప్రకటించారు.
సినిమా ప్రదర్శనల రద్దు
ఫెంగల్ తుఫాను కారణంగా శనివారం చెన్నైలోని థియేటర్లలో సినిమా ప్రదర్శనలు రద్దు చేశారు. నగరంలో భారీ వర్షం కారణంగా వరద పరిస్థితులు నెలకొనటంతో శనివారం ఉదయం నుంచే సినిమా ప్రదర్శన నిలిపివేశారు. ఇదిలా ఉండగా భారీ వర్షాల వల్ల నగరంలోని నగల దుకాణాలనుకూడా మూసివేశారు.
నేడు ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్..
- 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
ఫెంగల్ తుఫాను ప్రభావంతో ఆదివారం ఆరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ ప్రకటించింది. దీంతో తిరువళ్లూరు, చెంగల్పట్టు, కాంచీపురం, విల్లుపురం, కళ్ళకురిచ్చి, కడలూరు జల్లాలకు ఆదివారం రెడ్ అలెర్ట్ జారీ చేశారు. చెన్నై, రాణిపేట, తిరువణ్ణామలై, వేలూరు, పెరంబలూరు, అరియలూరు, తంజావూరు, తిరువారూరు, మైలాడుదురై, నాగపట్టినం జిల్లాల్లోనూ ఆదివారం భారీ వర్షం కురిసే అవకాశముంది. దీంతో ఆ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈవార్తను కూడా చదవండి: నిశ్శబ్దాన్ని ఛేదిస్తున్నారు
ఈవార్తను కూడా చదవండి: సస్పెండైన ఏఈఈ నిఖేష్ కుమార్ బాగోతం..
ఈవార్తను కూడా చదవండి: త్వరలో హైడ్రా పోలీస్‌స్టేషన్
ఈవార్తను కూడా చదవండి: ఏడాదిలోనే ఆలయాల్లో సౌకర్యాలు మెరుగుపరిచాం
Read Latest Telangana News and National News
Updated Date - Dec 01 , 2024 | 12:25 PM