Supreme Court: ఇంత మోసం జరిగితే వ్యవస్థలపై నమ్మకం ఉండదు
ABN, Publish Date - May 08 , 2024 | 09:10 AM
ఉపాధ్యాయుల భర్తీ కుంభకోణంపై సుప్రీంకోర్టు మంగళవారం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించింది. ఇలాంటి మోసాలు జరిగితే ప్రజలు వ్యవస్థలపై విశ్వాసాన్ని కోల్పోతారని వ్యాఖ్యానించింది.
పశ్చిమ బెంగాల్‌లో టీచరు పోస్టుల భర్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు వ్యాఖ్య
న్యూఢిల్లీ, మే 7: ఉపాధ్యాయుల భర్తీ కుంభకోణంపై సుప్రీంకోర్టు మంగళవారం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించింది. ఇలాంటి మోసాలు జరిగితే ప్రజలు వ్యవస్థలపై విశ్వాసాన్ని కోల్పోతారని వ్యాఖ్యానించింది. స్కూల్ సర్వీస్ కమిషన్ నియమించిన సుమారు 25వేల టీచరు పోస్టులను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు తీర్పుపై దాఖలైన అప్పీలును సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం చేపట్టింది.
జస్టిస్ చంద్రచూడ్ విచారణ ప్రారంభిస్తూ.. తొలి ప్రశ్న కింద ‘ఎంపిక ప్రక్రియను సవాలు చేస్తూ కోర్టులో వ్యాజ్యం వేసిన సమయంలోనే అదనంగా సూపర్‌న్యూమరరీ పోస్టులను సృష్టించి, వెయిట్ లిస్ట్‌లో ఉన్న అభ్యర్థులతో ఎందుకు భర్తీ చేశార’ని ప్రశ్నించారు. ఓఎంఆర్ షీట్లు, జవాబు పత్రాల స్కాన్డ్ కాపీలు ఉన్నాయా? ధ్వంసం చేశారా? అని అడిగారు. వాటిని ధ్వంసం చేసినట్టు బెంగాల్ ప్రభుత్వం తరఫు న్యాయవాది నీరజ్ సమాధానం ఇచ్చారు.
వీటిని భద్ర పరచడం ఎస్‌ఎస్‌సీ బాధ్యత కదా? ఎందుకు పాటించలేదని సీజేఐ మళ్లీ ప్రశ్నించారు. వాటి కాపీలు పేపర్లు దిద్దిన అవుట్ సోర్సింగ్ సంస్థ వద్ద ఉన్నాయని న్యాయవాది జావాబిచ్చారు. దీనిపై జస్టిస్ చంద్రచూడ్ స్పందిస్తూ.. ‘‘ఓఎంఆర్ షీట్ల స్కానింగ్ కోసం వారిని కిరాయికి తీసుకున్నారు.
ఇంతకన్నా భద్రత ఉల్లంఘన ఇంకేమైనా ఉంటుందా’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు, ఉద్యోగాల భర్తీని రద్దు చేసే అఽధికారం హైకోర్టుకు లేదని నీరజ్ వాదించారు. దీనిపై జస్టిస్ చంద్రచూడ్ స్పందిస్తూ.. ‘‘ఇది ఒక పద్ధతి ప్రకారం జరిగిన మోసం. ఇలా మోసాలు జరిగితే వ్యవస్థపై ప్రజలు విశ్వాసం కోల్పోతారు’’ అని అన్నారు. హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూ తదుపరి విచారణను జులై నెలకు వాయిదా వేశారు.
తప్పుడు ప్రకటనలకు సెలబ్రిటీలూ బాధ్యులే
న్యూఢిల్లీ, మే7: తప్పుదోవ పట్టించే ప్రకటనల విషయమై సుప్రీంకోర్టు కఠిన వైఖరి తీసుకొంది. ప్రజలకు నష్టం జరగకుండా తొలుత ఈ ప్రకటనల్లో పాల్గొనే ప్రముఖులే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని మంగళవారం స్పష్టం చేసింది. సంబంధిత వస్తువు/సేవపై పూర్తి అవగాహన ఉందని, అందుకే దాన్ని సిఫార్సు చేస్తున్నామంటూ స్వీయ ధ్రువీకరణ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది.
పతంజలి సంస్థ తప్పుదోవపట్టించే ప్రకటనలు ఇచ్చిందంటూ దాఖలైన వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం ఈ సూచనలు చేసింది. ఒకవేళ ఆ వస్తువు/సేవ మోసపూరితమని తేలితే సంబంధిత సంస్థతో పాటు, ప్రకటనలో పాల్గొన్న ప్రముఖులు కూడా బాధ్యులవుతారని హెచ్చరించింది. ఈ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని ఆదేశించింది.
ఇది కూడా చదవండి:
West Bengal: నియామకాల రద్దుపై స్టే.. కానీ సీబీఐ విచారణ జరపండి
IRCTC: 8 రోజులు, 7 రాత్రుల స్పెషల్ టూర్ ప్యాకేజీ.. శ్రీకృష్ణుడి ద్వారకా నగరం సహా ఇవి కూడా
Read Latest National News and Telugu News
Updated Date - May 08 , 2024 | 09:10 AM