Share News

PM Modi: అమర జవాన్లకు ప్రధాని మోదీ ఘన నివాళి.. పాకిస్థాన్‌కి గట్టి హెచ్చరిక

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:08 AM

కార్గిల్ 25వ విజయ్ దివస్ (Kargil Vijay Diwas) సందర్భంగా కార్గిల్‌లోని ద్రాస్‌లో యుద్ధవీరుల స్మారకాన్ని ప్రధాని మోదీ శుక్రవారం సందర్శించారు. యుద్ధంలో ప్రాణాలర్పించిన సైనికులకు నివాళి అర్పించారు. వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు. అమర జవాన్ల కుటుంబ సభ్యులతో మాట్లాడారు.

PM Modi: అమర జవాన్లకు ప్రధాని మోదీ ఘన నివాళి.. పాకిస్థాన్‌కి గట్టి హెచ్చరిక

ఢిల్లీ: కార్గిల్ 25వ విజయ్ దివస్ (Kargil Vijay Diwas) సందర్భంగా కార్గిల్‌లోని ద్రాస్‌లో యుద్ధవీరుల స్మారకాన్ని ప్రధాని మోదీ శుక్రవారం సందర్శించారు. యుద్ధంలో ప్రాణాలర్పించిన సైనికులకు నివాళి అర్పించారు. వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు.

అమర జవాన్ల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మోదీ చివరిసారిగా 2022లో కార్గిల్‌లో సైనికులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, ద్రాస్‌లోని కార్గిల్‌ యుద్ధ స్మారకం వద్ద చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (CDS) జనరల్‌ అనిల్ చౌహాన్‌ నివాళి అర్పించారు.

మోదీ మాట్లాడుతూ..

‘‘దాయాది పాకిస్థాన్‌ గతంలో పాల్పడిన వికృత ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి. అయినా, చరిత్ర నుంచి ఆ దేశం ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదు. పైగా ఉగ్రవాదం, ప్రాక్సీ వార్‌ పేరుతో కవ్వింపులకు పాల్పడుతూనే ఉంది. ఇవాళ నా మాటలు ఉగ్రవాదులను తయారుచేస్తున్న వారికి (పాక్‌ సైన్యం) నేరుగా వినిపిస్తాయి. వారిని పెంచి పోషిస్తున్న దుర్మార్గపు కుట్రలు ఎన్నటికీ ఫలించవు. మా సైన్యం ఉగ్రవాదాన్ని నలిపివేసి, శత్రువులకు తగిన జవాబిస్తుంది. కార్గిల్‌ యుద్ధానికి లద్దాఖ్‌ సాక్షిగా నిలుస్తుంది. అమరుల త్యాగాలకు గుర్తుగా విజయ్‌ దివస్‌ జరుపుకుంటున్నాం.

మన బలానికి, సహనానికి, వాస్తవాలకు ఈ విజయగాథ నిదర్శనం. దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టిన సైనికులు చిరకాలం గుర్తుండిపోతారు. కార్గిల్‌ యుద్ధ సమయంలో సామాన్యుడిగా సైనికుల మధ్య ఉండే అదృష్టం నాకు దక్కింది. దేశం కోసం వారు చేసిన పోరాటం నా మనసులో నిలిచిపోయింది. లద్దాఖ్‌, జమ్మూకశ్మీర్‌ అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాం. ఆర్టికల్‌ 370ని రద్దు చేసి త్వరలో 5 ఏళ్లు పూర్తవుతుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు సరికొత్త భవిష్యత్తు కోసం ఎదురుచూస్తున్నారు. కశ్మీర్‌లో శాంతిని నెలకొంటోంది’’ అని మోదీ తెలిపారు.


ఈ కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ 'షహీద్ మార్గ్' (వాల్ ఆఫ్ ఫేమ్)ను సందర్శిస్తున్నారు. సందర్శకుల పుస్తకంపై సంతకం చేసి కార్గిల్ యుద్ధ కళాఖండాల మ్యూజియాన్ని పరిశీలించారు. వీటన్నింటి తరువాత వీర్ భూమిని కూడా సందర్శించి.. షింకున్ లా టన్నెల్ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తారు. కార్గిల్ విజయ్ దివస్ రజతోత్సవ వేడుకల్లో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పాల్గొన్నారు.

ఆయనతో పాటు కార్గిల్ యుద్ధ సమయంలో ఆర్మీ చీఫ్‌గా పనిచేసిన జనరల్ వీపీ మాలిక్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జనరల్ మాలిక్ ద్రాస్‌లోని లామోచెన్ వ్యూ పాయింట్‌లో 1999 యుద్ధ అనుభవజ్ఞులను, వారి కుటుంబాలను కూడా కలిశారు. అంతకుముందు ఆర్మీ చీఫ్ చినార్ కార్ప్స్, ఎల్‌ఓసీ వద్ద భద్రతా పరిస్థితిని సమీక్షించారు.


మీ త్యాగం మరువలేనిది: ముర్ము

కార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu) అమరవీరుల త్యాగాలను గుర్తుచేసుకున్నారు. ‘‘భారత దేశ సాయుధ దళాల ధైర్యం, పరాక్రమానికి ప్రతీక, విజయగాథ ఈ కార్గిల్ దివస్. 1999 నాటి కార్గిల్‌ యుద్ధంలో మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించిన జవాన్లందరికీ నివాళులర్పిస్తున్నా. వారి త్యాగం, శౌర్యం నుంచి దేశ ప్రజలు స్ఫూర్తి పొందుతారు’’ అని ముర్ము ఎక్స్‌లో చేసిన పోస్ట్‌లో పేర్కొన్నారు.


కార్గిల్ డే ప్రాముఖ్యత..

మే 5, 1999న పాకిస్తాన్ చొరబాటు తర్వాత, మే నుంచి జులై వరకు కార్గిల్ పర్వత శ్రేణులలో భారతదేశం, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. దాదాపు 84 రోజుల పాటు యుద్ధం జరగ్గా, జులై 26, 1999న భారతదేశం విజయం సాధించింది. అప్పటి నుంచి ఈ రోజును కార్గిల్ విజయ్ దివస్‌గా జరుపుకుంటున్నాం. భారత సైనికుల త్యాగం, ధైర్యాన్ని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం జులై 26న కార్గిల్ విజయ్ దివస్ వేడుకలు నిర్వహిస్తున్నాం.

For Latest News and National News click here

Updated Date - Jul 26 , 2024 | 12:31 PM