Share News

Free Bus Scheme: దీపావళి వేళ మహిళలకు బిగ్ షాక్.. ఫ్రీ బస్ పథకం రద్దు

ABN , Publish Date - Oct 31 , 2024 | 10:31 AM

కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో అట్టహసంగా ప్రారంభించిన మహిళలకు ఉచిత ప్రయాణ పథకం రద్దు కాబోతోందా. ఉచిత ప్రయాణ భారం ఆర్టీసీ మోయలేకపోతోందా.

Free Bus Scheme: దీపావళి వేళ మహిళలకు బిగ్ షాక్.. ఫ్రీ బస్ పథకం రద్దు
Karnataka Shakti Scheme

బెంగళూరు: కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో అట్టహసంగా ప్రారంభించిన మహిళలకు ఉచిత ప్రయాణ పథకం రద్దు కాబోతోందా. ఉచిత ప్రయాణ భారం ఆర్టీసీ మోయలేకపోతోందా. కర్ణాటక డిప్యూటీ సీఎం తాజాగా చేసిన కామెంట్స్ ఈ వాదనలకు బలం చేకూరుస్తున్నాయి. కర్ణాటక మహిళలకు కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని సమీక్షిస్తామని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ వెల్లడించారు. టికెట్లు కొనుక్కొని ప్రయాణించేందుకు పలువురు మహిళలు ముందుకు వస్తున్నందున ఈ పథకాన్ని సమీక్షిస్తామని చెప్పారు. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఐరావత క్లబ్‌ క్లాస్‌ 2.0 బస్సులను బుధవారం ప్రవేశపెట్టారు.


అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘సోషల్‌ మీడియా, ఈ–మెయిళ్ల ద్వారా చాలా మంది మహిళలు టికెట్లకు డబ్బులు చెల్లించి ప్రయాణిస్తామని మమ్మల్ని సంప్రదించారు. ఈ అంశంపై కేబినెట్‌లో చర్చిస్తాం’ అని శివకుమార్‌ తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పించే శక్తి పథకం కాంగ్రెస్‌ ప్రభుత్వం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఐదు ప్రధాన హామీల్లో ఒకటి. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే 2023 జూన్‌ 11న ఈ పథకాన్ని ప్రారంభించింది.


అక్టోబర్ 18 నాటికి 311 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 7 వేల 507 కోట్లను ఖర్చు చేసింది. అయితే.. కొందరు మహిళలు టికెట్లకు డబ్బు చెల్లించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నా.. కండక్టర్లు తీసుకోవడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని డిప్యూటీ సీఎం అన్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డితో ఈ అంశంపై చర్చించి ఉచిత బస్సు ప్రయాణంపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇటు తెలంగాణాలోనూ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేసింది.

Diwali 2024: రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు: రేవంత్, కేసీఆర్

Devotional: మెట్టినింటికి వెళ్లిన సోదరి కోసం ఓ పండుగ..

Updated Date - Oct 31 , 2024 | 01:12 PM