Students: ఎక్స్‌క్యూజ్‌మీ.. అగ్గిపెట్టుందా!
ABN, Publish Date - Oct 24 , 2024 | 05:06 AM
కేరళ రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ చదువుతున్న కొందరు విద్యార్థులు చేసిన పనికి అక్కడి అబ్కారీ పోలీసులు షాక్ తిన్నారు.
గంజాయి బీడీ నిప్పుకోసం ఎక్సైజ్ ఆఫీసుకెళ్లిన విద్యార్థులు
నిర్ఘాంతపోయిన అధికారులు.. కేసు నమోదు
ఇడుక్కి, కేరళ, అక్టోబరు 23: కేరళ రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ చదువుతున్న కొందరు విద్యార్థులు చేసిన పనికి అక్కడి అబ్కారీ పోలీసులు షాక్ తిన్నారు. విద్యార్థులు తమ వద్ద ఉన్న గంజాయి బీడీలను వెలిగించుకునేందుకు ఏకంగా వారి కార్యాలయానికే వెళ్లి ‘అగ్గిపెట్టుందా!’ అని అధికారు లను అడిగారు. దాంతో ఎక్సైజ్ అధికారులు నిర్ఘాంతపోయారు. అయితే పొరపాటున దుకాణం అనుకొని ఎక్కడికైతే వెళ్లకూడదో అక్కడికి వచ్చామనుకొని గ్రహించిన విద్యార్థులు పరుగు పెట్టారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకొన్న అధికారులు ఇద్దరు మైనర్లపై కేసులు నమోదు చేశారు. ఈ ఘటన ఆదిమలై జిల్లాలో చోటుచేసుకుంది.
త్రిసూర్‌లోని ఓ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థులు విహారయాత్ర నిమిత్తం అక్కడకు రాగా, భోజనం చేసిన తర్వాత అందులో గంజాయికి అలవాటుపడిన కొంతమంది విద్యార్థులు అగ్గిపెట్టే కోసమని పొరపాటున ఎక్సైజ్ ఆఫీసుకే వెళ్లి ఇరుక్కున్నారు. మరో ఘటనలో ముంబై సమీపంలోని నల్లసూపర ప్రాంతానికి చెందిన 9 ఏళ్ల బాలిక.. ట్యూషన్ టీచర్ కొట్టిన దెబ్బలకు వెంటిలేటర్ పై చికిత్స పొందుతోంది. అల్లరి చేస్తుండటంతో టీచర్ కొట్టిన దెబ్బలకు బాలిక చెవి రింగులు దవడ భాగంలోకి చొచ్చుకుపోయాయి. అక్టోబరు 5న ఈ ఘటన జరిగింది. తొలుత బాలికకు వినికిడి లోపం తలెత్తింది. మెదడుకూ గాయమవడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.
Updated Date - Oct 24 , 2024 | 05:06 AM