Rahul Gandhi : తెలంగాణలో రుణమాఫీ.. చరిత్రాత్మక అడుగు
ABN, Publish Date - Jun 23 , 2024 | 03:18 AM
‘‘కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే రైతులు, కార్మికులతో సహా అణగారిన వర్గాల అభివృద్ధికి సంపదను ఖర్చు చేయడం గ్యారెంటీ.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ
40 లక్షల కుటుంబాలకు లబ్ధి: ఖర్గే
న్యూఢిల్లీ, జూన్ 22(ఆంధ్రజ్యోతి): ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే రైతులు, కార్మికులతో సహా అణగారిన వర్గాల అభివృద్ధికి సంపదను ఖర్చు చేయడం గ్యారెంటీ. రైతుల రుణాలను మాఫీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ఇందుకు ఉదాహరణ’’ అని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. 40లక్షలపైగా రైతు కుటుంబాలకు రూ.2లక్షల మేర రుణ మాఫీ చేయడం ద్వారా ‘కిసాన్ న్యాయ్’ సంకల్పాన్ని నెరవేర్చే దిశగా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రాత్మక అడుగు వేసిందని ‘ఎక్స్’ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. చెప్పిందే చేశామని, అదే తమ అలవాటు అని పేర్కొన్నారు. ‘కాంగ్రెస్ అధికారంలో ఉంటే దేశ సంపదను సాధారణ ప్రజల కోసమే ఖర్చుపెడుతుంది.
పెట్టుబడిదారుల కోసం కాదు. ఇది మా వాగ్దానం’ అని స్పష్టం చేశారు. తెలంగాణలో రైతులకు రుణ భారం నుంచి విముక్తి కల్పించాలన్న సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఈ నిర్ణయంతో 40 లక్షలపైగా కుటుంబాలకు లబ్ధి కలగనుందని తెలిపారు.
పదహారేళ్ల క్రితం యూపీఏ సర్కారు 3.73 కోట్ల మంది రైతులకు రూ.72వేల కోట్ల వ్యవసాయ రుణాలు, వడ్డీలను మాఫీ చేసిందని ‘ఎక్స్’ వేదికగా ఆయన గుర్తు చేశారు. కాగా, తెలంగాణలో అన్ని వాగ్దానాలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ‘ఎక్స్’ వేదికగా కాంగ్రెస్ తెలిపింది. రైతులకు రుణమాఫీ చేస్తామంటూ వరంగల్ వేదికగా రాహుల్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ట్వీట్‌ను కాంగ్రెస్ రీట్వీట్ చేసింది.
Updated Date - Jun 23 , 2024 | 03:18 AM