Lok Sabha Elections: కాంగ్రెస్‌కు టిక్కెట్ తిరిగి ఇచ్చేసిన పూరీ లోక్‌సభ అభ్యర్థి.. కారణం ఏమిటంటే..
ABN , Publish Date - May 04 , 2024 | 02:54 PM
ఒడిశాలోని పూరీ లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని సుచరిత మొహంతీ పోటీకి నిరాకరించారు. పార్టీ టిక్కెట్ తిరిగి ఇచ్చేశారు. ప్రచారానికి అవసరమైన నిధులు ఇచ్చేందుకు పార్టీ నిరాకరించడమే ఇందుకు కారణం.
భువనేశ్వర్: ఒడిశాలోని పూరీ (Puri) లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని సుచరిత మొహంతీ (Sucharita Mohanty) పోటీకి నిరాకరించారు. పార్టీ టిక్కెట్ తిరిగి ఇచ్చేశారు. ప్రచారానికి అవసరమైన నిధులు (funding) ఇచ్చేందుకు పార్టీ నిరాకరించడమే ఇందుకు కారణం. నిధుల లేమి తన నియోజకవర్గంలో ప్రచారంపై తీవ్రంగా పడిందని పేర్కొంటూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) కేసీ వేణుగోపాల్‌కు ఆమె ఈ-మెయిల్ చేశారు. సుచరితా మొహంతి కాంగ్రెస్ మాజీ ఎంపీ బ్రజమోహన్ మొహంతీ కుమార్తె.
Lok Sabha Polls: రాహుల్ వారసత్వాన్ని నిలబెట్టుకుంటారా..!
''నేను వృత్తిపరంగా జీతంతో బతికే జర్నిలిస్టును. పదేళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చాను. ప్రచారం కోసం నా దగ్గర ఉన్నందంతా ఇచ్చాను. ప్రచారానికి పబ్లిక్ డొనేషన్ డ్రైవ్ చేపట్టినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. దీంతో ప్రచార ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నించాను. పూరీలో విజయవంతంగా ప్రచారం సాగించడానికి నిధుల కొరత ఉందనేది మాత్రం సుస్పష్టం. నిధులు లేకుండా పూరీలో ప్రచారం సాగించడం ఎంత మాత్రం సాధ్యం కాదు. ఆ కారణంగానే పార్టీ లోక్‌సభ టిక్కెట్‌ను వెనక్కి తిరిగి ఇచ్చేస్తున్నాను'' అని ఏఐసీసీకి పంపిన ఈ-మెయిల్‌లో సుచరిత ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు విధేయ కార్యకర్తగానే తాను కొనసాగుతానని, తన నేత రాహుల్ గాంధీ అని ఆమె స్పష్టం చేశారు. పూరీ నియోజవర్గంలో సంబిత్ పాత్రను తమ అభ్యర్థిగా బీజేపీ నిలబెట్టగా, ముంబై మాజీ పోలీస్ కమిషనర్ అరూప్ పట్నాయక్ బీజేడీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..