Lok Sabha Elections 2024: తొలిదశ పోలింగ్ 62.37 శాతం
ABN, Publish Date - Apr 20 , 2024 | 07:52 AM
ప్రచండ భానుడు నడినెత్తిన నిప్పులు చెరుగుతున్నా.. వడగాడ్పులు వీస్తున్నా.. శుక్రవారం దేశవ్యాప్తంగా 16.63 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. కొన్నిచోట్ల వర్షం కురుస్తున్నా కూడా.. ఓటర్లు ఓపిగ్గా లైన్‌లో నిలబడి ప్రజాస్వామ్యంలో తమ పవిత్ర కర్తవ్యాన్ని నిర్వర్తించారు. శుక్రవారం రాత్రి 9 గంటల సమయం వరకూ ..
త్రిపురలో అత్యధికంగా 80.1%.. బిహార్‌లో కేవలం 48.5%
21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 చోట్ల ఎన్నికలు
ఓటు హక్కు వినియోగించుకున్న 16.63 కోట్ల మంది ఓటర్లు
అండమాన్‌లో తొలిసారి ఓటు వేసిన షోంపెన్ ఆదివాసులు
తమిళనాడు పోలింగ్ కేంద్రాల్లో ముగ్గురు వృద్ధుల మృతి
ఈఎన్‌పీవో బంద్.. నాగాలాండ్‌లోని 6 జిల్లాల్లో ఓటింగ్ జీరో
ఆ పరిధిలోని 20 మంది ఎమ్మెల్యేలూ ఓటుహక్కుకు దూరమే!
న్యూఢిల్లీ, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): ప్రచండ భానుడు నడినెత్తిన నిప్పులు చెరుగుతున్నా.. వడగాడ్పులు వీస్తున్నా.. శుక్రవారం దేశవ్యాప్తంగా 16.63 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. కొన్నిచోట్ల వర్షం కురుస్తున్నా కూడా.. ఓటర్లు ఓపిగ్గా లైన్‌లో నిలబడి ప్రజాస్వామ్యంలో తమ పవిత్ర కర్తవ్యాన్ని నిర్వర్తించారు. శుక్రవారం రాత్రి 9 గంటల సమయం వరకూ అందిన వివరాల ప్రకారం.. సార్వత్రిక ఎన్నికల సమరం తొలి దశలో భాగంగా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 62.37% ఓటింగ్ నమోదైంది. కొన్నిచోట్ల నుంచి ఇంకా పూర్తిగా వివరాలు అందనందున.. పోలింగ్ శాతాలు ఇంకా పెరిగే అవకాశం ఉందని ఈసీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
కాగా.. ఎన్నికల తొలిదశలో భాగంగా ఏడు రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం అన్ని స్థానాలకూ (తమిళనాడు–39, ఉత్తరాఖండ్–5, అరుణాచల్ ప్రదేశ్–2, మేఘాలయ–2, అండమాన్ నికోబార్ దీవులు–1, మిజోరాం–1, నాగాలాండ్–1, పుదుచ్చేరి–1, సిక్కిం–1, లక్షద్వీప్–1) పోలింగ్ ముగిసింది. అలాగే.. రాజస్థాన్ లో 12 స్థానాలు, ఉత్తర ప్రదేశ్‌లో 8 స్థానాలు, మధ్యప్రదేశ్‌లో 6 స్థానాలు, అసోం, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌లో ఐదేసి స్థానాలు, బిహార్‌లో 4 స్థానాలు, పశ్చిమబెంగాల్‌లో 3 స్థానాలు, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయలలో చెరి రెండు స్థానాలు, అండమాన్, ఛత్తీస్ గఢ్, జమ్ముకశ్మీర్, లక్షద్వీప్, మిజోరం, నాగాలాండ్, పుదుచ్చేరి, సిక్కిం, త్రిపురలో చెరి ఒక స్థానాలకు పోలింగ్ ముగిసింది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో లోక్‌సభ స్థానాలతోపాటు అసెంబ్లీ స్థానాలకూ ఎన్నికలు జరిగాయి. అక్కడక్కడా చెదురుమదురు హింసాత్మక ఘటనలు మినహా.. శుక్రవారం పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈసీ తెలిపిన వివరాల ప్రకారం.. త్రిపురలో అత్యధికంగా 80.17 శాతం ఓటింగ్ నమోదు కాగా.. 77.57% ఓటింగ్‌తో పశ్చిమబెంగాల్ రెండో స్థానంలో నిలిచింది.
మణిపూర్‌లో 69.13% ఓటింగ్..
ముహూర్తాల సీజన్ కావడంతో.. చాలా మంది నవదంపతులు పెళ్లిదుస్తుల్లోనే పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేశారు. చాలామంది దివ్యాంగులు, వృద్ధులు, వీల్‌చెయిర్లలో, స్ట్రెచర్లపై వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. తమిళనాడు, అరుణాచల్‌ప్రదేశ్, అండమాన్ నికోబార్, అసోంలో కొన్ని బూత్‌లలో ఈవీఎంలలో చిన్నపాటి సమస్యలు వచ్చాయి. పశ్చిమబెంగాల్‌లో 3 లోక్‌సభ నియోజకవర్గాలకు శుక్రవారం పోలింగ్ జరగ్గా.. వాటిలో కూచ్‌బేహార్ నియోజకవర్గంలో హింస చెలరేగింది. మణిపూర్‌లో 69.13% ఓటింగ్ నమోదైంది. నాగాలు, కుకీలు అత్యధిక సంఖ్యలో ఉండే చండేల్‌లో అత్యధికంగా 85.54శాతం మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన బస్తర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో 63.41 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తమిళనాడులో 72.09 శాతం ఓటింగ్ నమోదైంది. సేలం, తిరువళ్లూరు జిల్లాల్లో ముగ్గురు వృద్ధులు పోలింగ్ కేంద్రాలకు వచ్చి.. ఓటేయకుండానే తుదిశ్వాస విడిచారు. అండమాన్ దీవుల్లో 56.87% ఓటింగ్ నమోదైంది. అక్కడ.. షోంపెన్ తెగకు చెందిన ఏడుగురు ఆదివాసులు తొలిసారి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బిహార్‌లో అత్యల్పంగా 48.5% ఓటింగ్ నమోదైంది.
తమిళనాడులో బీజేపీ బోణీ?
తమిళనాడులో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనైనా బోణీ కొట్టాలనే లక్ష్యంతో విస్తృతంగా ప్రచారం చేసిన బీజేపీ.. తన ఓటుశాతాన్ని గణనీయంగా పెంచుకున్నట్టు తెలుస్తోంది. ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై పోటీచేసిన కోయంబత్తూర్‌లో ఈసారి 71.17% పోలింగ్ నమోదైంది. ఇది 20 ఏళ్ల అత్యధికం. గత ఎన్నికల్లో 37 స్థానాలు గెలుచుకున్న డీఎంకే కూటమి ఈసారి 30 స్థానాలు దాటకపోవచ్చునని అంచనా. ఈసారి బీజేపీ ఓట్లు 15–20% పెరగవచ్చని ప్రముఖ తమిళ రచయిత మాలన్ అభిప్రాయపడ్డారు.
తమిళనాడులో బీజేపీ బోణీ?
తమిళనాడులో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనైనా బోణీ కొట్టాలనే లక్ష్యంతో విస్తృతంగా ప్రచారం చేసిన బీజేపీ.. తన ఓటుశాతాన్ని గణనీయంగా పెంచుకున్నట్టు తెలుస్తోంది. ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై పోటీచేసిన కోయంబత్తూర్‌లో ఈసారి 71.17% పోలింగ్ నమోదైంది. ఇది 20 ఏళ్ల అత్యధికం. గత ఎన్నికల్లో 37 స్థానాలు గెలుచుకున్న డీఎంకే కూటమి ఈసారి 30 స్థానాలు దాటకపోవచ్చునని అంచనా. ఈసారి బీజేపీ ఓట్లు 15–20% పెరగవచ్చని ప్రముఖ తమిళ రచయిత మాలన్ అభిప్రాయపడ్డారు.
నాగాలాండ్‌లో ఆరు జిల్లాల్లో సున్నా శాతం ఓటింగ్..
‘ఫ్రాంటియర్ నాగాలాండ్ టెరిటరీ’ డిమాండ్‌తో.. ఈస్ట్రన్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ (ఈఎన్‌పీవో) ఇచ్చిన నిరవధిక బంద్ పిలుపు కారణంగా నాగాలాండ్‌లోని ఆరుజిల్లాల్లో సున్నా శాతం ఓటింగ్ నమోదైంది. పోలింగ్ సిబ్బంది దాదాపు 9 గంటలపాటు 738 బూత్‌ల్లో ఓపిగ్గా వేచి చూసినా.. 4 లక్షల మంది ఓటర్లలో ఒక్కరు కూడా వచ్చి ఓటేయలేదు. 20 శాసనసభ స్థానాల పరిధిలోని 20 మంది ఎమ్మెల్యేలు సైతం ఓటింగ్‌లో పాల్గొనలేదంటే అక్కడ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..
Updated Date - Apr 20 , 2024 | 07:52 AM