Maharashtra: మహా రసవత్తరం..
ABN , Publish Date - May 01 , 2024 | 05:16 AM
మహారాష్ట్ర అంటే మహామహుల రాజకీయ క్షేత్రం. వర్గ పోరుకు, వారసత్వ రాజకీయాలకు పెట్టింది పేరు. దేశంలో ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధిక లోక్ సభ సీట్లున్న రాష్ట్రం ఇదే.
దశాబ్దాలుగా పోట్లాడుకున్న వర్గాలు ఒకే శిబిరంలో..!
పవార్‌లు, శిందే, ఉద్ధవ్‌ల రాజకీయ జీవితానికి పరీక్ష
మహారాష్ట్ర అంటే మహామహుల రాజకీయ క్షేత్రం. వర్గ పోరుకు, వారసత్వ రాజకీయాలకు పెట్టింది పేరు. దేశంలో ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధిక లోక్ సభ సీట్లున్న రాష్ట్రం ఇదే. ఐదేళ్లలో ఇక్కడ పరిణామాలు ఎంతలా మారాయో అందరూ చూశారు. ఎవరూ హించని రీతిలో రెండు ప్రాంతీయ పార్టీలు నాలుగు అయ్యాయి. తమతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసి సీఎం కుర్చీ దగ్గర పంచాయితీతో.. కాంగ్రెస్, ఎన్సీపీ పంచన చేరిన శివసేనను ఏక్‌నాథ్ శిందే ద్వారా చీల్చేసింది బీజేపీ. తద్వారా ఉద్ధవ్ థాక్రేకు ఝలక్ ఇచ్చింది.
అనంతరం అజిత్ పవార్‌నూ ఆకర్షించి ఎన్సీపీనీ విడగొట్టి.. శరద్ పవార్‌కు షాకిచ్చింది. ఇప్పుడు బీజేపీ ఆధ్వర్యంలోని మహాయుతి కూటమిలో శివసేన (శిందే), ఎన్సీపీ (అజిత్), కాంగ్రెస్ సారథ్యంలోని మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ)లో ఎన్సీపీ (శరద్ పవార్), శివసేన (ఉద్ధవ్) ఎన్నికల సమరంలో తలపడుతున్నాయి. మహారాష్ట్రలో తొలి దశలో 5, మలి విడతలో 8 సీట్లకు పోలింగ్ ముగిసింది. మూడో దశలో 11 స్థానాలకు మే 7న ఓటింగ్ జరగనుంది. నాలుగో దశలో మే 13న మరో 11 సీట్లకు, మే 20న 13 స్థానాలకు పోలింగ్ ఉంది.
దశాబ్దాల విభేదాలు.. ఓట్లు మళ్లుతాయా?
రెండు పార్టీలు నాలుగుగా మారి, మరో రెండు పార్టీలతో కలిసి వస్తుండడంతో మహారాష్ట్ర ప్రజల నాడి ఏమిటో రాజకీయ పరిశీలకులకు అంతుబట్టడం లేదు. రెండున్నర దశాబ్దాలు బీజేపీ-శివసేన కేడర్‌తో కాంగ్రె్‌స-ఎన్సీపీ శ్రేణులు ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడ్డాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రె్‌స-ఎన్సీపీతో కలిసి శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
2022లో శిందే తిరుగుబాటు చేసి బీజేపీతో కలిశారు. ఇక ఎన్సీపీని చీల్చిన అజిత్ పవార్ బీజేపీ-శిందే సేన సర్కారులో చేరారు. శిందే, అజిత్‌కు వర్గాలకు పార్టీ ఎన్నికల గుర్తులు దక్కాయి. మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వీరి వెంటే ఉన్నా.. ఎన్సీపీ, శివసేన సంప్రదాయ అభిమానులు, మద్దతుదారులు ఓటు వేస్తారా? అంటే కష్టమేనని పరిశీలకులు చెబుతున్నారు. కాగా, 2014, 2019లో బీజేపీ-అవిభాజ్య శివసేన కూటమి 51.34 శాతం ఓట్లతో 41 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్- అవిభాజ్య ఎన్సీపీలు 35 శాతంపైగా ఓట్లతో వరుసగా 5, 6 సీట్లతో సరిపెట్టుకున్నాయి. నిరుడు మార్చిలో కస్బాపేఠ్ ఉప ఎన్నికలో 3 దశాబ్దాల తర్వాత బీజేపీని కాంగ్రెస్ ఓడించింది. చించ్వాడ్‌ను బీజేపీ నిలబెట్టుకుంది.
ఇరు సేనల పోరు..
రెండు శివసేనలు, రెండు ఎన్సీపీలు బరిలో ఉన్న ఎన్నికలు మహా రసవత్తరంగా సాగుతున్నాయి. విదర్భ ప్రాంతం యావత్మాల్-వాశిం వంటి సీట్లలో శిందే, ఉద్ధవ్ సేనల అభ్యర్థులు నేరుగా తలపడ్డారు. ఇక్కడ బలమైన వర్గాలు మరాఠాలు, దేశ్‌ముఖ్‌లు, కుంబీలు, బంజారాలు 2019లో బీజేపీ-అవిభాజ్య శివసేన కూటమికి మద్దతిచ్చాయి. బంజారాలు ఉద్ధవ్ పార్టీ వైపు నిలిచారు. మిగతావారు ఎవరి పక్షం వహిస్తే వారిదే విజయం. బుల్దాణాలోనూ శివసేనల అభ్యర్థులే పరస్పరం ఢీకొన్నారు.
నలుగురు నేతలకూ సవాల్
మహారాష్ట్ర అసెంబ్లీకి అక్టోబరులో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ పార్టీల నాయకుల పరిస్థితి ఎలా ఉన్నా.. సీఎం ఏక్‌నాథ్ శిందే, ఉద్ధవ్ థాక్రే, డిప్యూటీ సీఎం అజిత్ పవార్, శరద్ పవార్‌లకు ఈ ఎన్నికలు చాలా కీలకం. తాను స్థాపించిన పార్టీని.. అన్న కుమారుడు అజిత్ చీల్చడంతో హతాశుడైన మరాఠా యోధుడు శరద్‌పవార్ (83) ఈ ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకుంటున్నారు. పార్టీ కేడర్ తనను వీడి వెళ్లకుండా ఉండాలన్నా, అసెంబ్లీ ఎన్నికల నాటికి బలీయంగా కనిపించాలన్నా.. పెద్ద పవార్ ప్రస్తుత ఎన్నికల్లో మెరుగైన సీట్లు సాధించడం ముఖ్యం. ఇక ఎన్సీపీ గుర్తు గడియారం సహా మెజారిటీ కేడర్ అజిత్ పవార్ వెంటనే ఉంది. అయితే, వీరంతా ఇకముందు కూడా చెక్కుచెదరకుండా ఉండాలంటే లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటాల్సి ఉంది. కాగా, తాను ప్రజాబలం ఉన్న నేతను అని నిరూపించుకునేందుకు సీఎం శిందేకు, తమ ఉనికి ఇంకా ఉందని చాటేందుకు ఉద్ధవ్ థాక్రేకు ఈ ఎన్నికలు కీలకం. - సెంట్రల్ డెస్క్
బరిలో మాజీ సీఎంలు.. మాజీ సీఎంల కుమార్తెలు
మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్ రాణె బీజేపీ తరఫున రత్నగిరి-సింధుదుర్గ్ నుంచి బరిలో దిగారు. ఈయనకు రెండుసార్లు ఎంపీగా గెలిచిన వినాయక్ రౌత్ గట్టి పోటీ ఇస్తున్నారు. అయితే, మరో మాజీ సీఎం అశోక్ చవాన్ బీజేపీలో చేరి నాందేడ్ నుంచి పోటీ చేశారు. మాజీ సీఎంలు శరద్ పవార్ కుమార్తె సుప్రియా బారామతిలో, సుశీల్‌కుమార్ శిందే కుమార్తె ప్రణీతి సోలాపూర్‌లో పోటీకి నిలిచారు.
కంచుకోటలో వదినా మరదళ్ల ఢీ
మహారాష్ట్రలోనే కాదు దేశవ్యాప్తంగానూ ఆసక్తి రేకెత్తిస్తున్న పోటీ బారామతిలో జరుగుతోంది. సిటింగ్ ఎంపీ సుప్రియా తన వదిన సునేత్రను ఢీకొంటున్నారు. మే 7న ఇక్కడ పోలింగ్ ఉంది. సుప్రియా ఇప్పటికే వరుసగా మూడుసార్లు ఇక్కడినుంచి గెలిచారు. ఆమె తండ్రి శరద్ పవార్ అయితే డబుల్ హ్యాట్రిక్ కొట్టారు. తమ కుటుంబానికి కంచుకోట అయిన బారామతిలో సుప్రియా ఓడితే అది శరద్‌కు పెద్ద ఇబ్బందే. బారామతి చేజారితే.. యావత్ పార్టీ చేజారినట్టే.
ఛత్రపతి శివాజీ వారసుడికి ఎంఐఎం మద్దతు
మరాఠాలకే కాదు హిందువులందరికీ ఆరాధ్యమైన ఛత్రపతి శివాజీ వారసులు వేర్వేరు పార్టీల తరఫున బరిలో దిగారు. సతారాలో శ్రీమంత్ ఛత్రపతి ఉయయన్‌రాజె భోస్లే బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఈయన రాజ్యసభ సభ్యుడు. కొల్హాపూర్‌లో శివాజీ వంశస్థుడైన శ్రీమంత్ శాహూ ఛత్రపతి మహరాజ్ కాంగ్రెస్ అభ్యర్థిగా నిలిచారు. ఈయనకు అసదుద్దీన్ ఒవైసీ సారథ్యంలోని ఎంఐఎం పార్టీ మద్దతు పలకడం గమనార్హం.