మహారాష్ట్ర ఎన్నికలకు బీజేపీ మూడో జాబితా
ABN, Publish Date - Oct 29 , 2024 | 03:52 AM
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ సోమవారం 25 మంది అభ్యర్థులతో మూడో జాబితాను ప్రకటించింది.
ముంబై, అక్టోబరు 28: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ సోమవారం 25 మంది అభ్యర్థులతో మూడో జాబితాను ప్రకటించింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన ఇద్దరికి అలాగే మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడనవీస్ పీఏకు అవకాశం కల్పించింది. 2021 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన జితేశ్ అంతపుర్కార్ ఇటీవల బీజేపీలో చేరగా.. ఆయన్ను దెగ్లూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ బరిలోకి దింపింది. అలాగే ఈ ఏడాది మార్చిలో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన శివరాజ్ పాటిల్ మేన కోడలు అర్చనా పాటిల్‌ను లాతూర్ సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేయిస్తోంది. బీజేపీ సోమవారం ప్రకటించిన 25 మంది అభ్యర్థులతో 146 నియోజకవర్గాలకు.. ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించినట్లయింది. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే దఫాలో నవంబరు 20న ఎన్నికలు జరగనున్నాయి.
Updated Date - Oct 29 , 2024 | 03:52 AM