Delhi: రాజ్యసభలో గందరగోళం.. అదానీ వ్యవహారంపై చర్చకు పట్టుపట్టిన విపక్షాలు..
ABN, Publish Date - Nov 25 , 2024 | 12:25 PM
పార్లమెంట్ సమావేశాలు గందరగోళానికి దారి తీశాయి. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ లంచం వ్యవహారంపై రాజ్యసభలో ఎంపీ మల్లికార్జున ఖర్గే ప్రస్తావించారు. అదానీ అవినీతి అంశంపై చర్చించాలని ఆయన పట్టుపట్టారు.
ఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు గందరగోళానికి దారి తీశాయి. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ లంచం వ్యవహారంపై రాజ్యసభలో ఎంపీ మల్లికార్జున ఖర్గే ప్రస్తావించారు. అదానీ అవినీతి అంశంపై చర్చించాలని ఆయన పట్టుపట్టారు. దీంతో రాజ్యసభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అదానీ అవినీతి అంశం దేశాన్ని ప్రభావితం చేస్తోందని ఖర్గే అన్నారు. అదానీకి ప్రధాని నరేంద్ర మోదీ మద్దతుగా నిలుస్తున్నారని ఖర్గే ఆరోపించారు. దీంతో అదానీపై అంశంపై విపక్షాలు సైతం చర్చకు పట్టుపట్టాయి. అనంతరం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సభలో విపక్ష పార్టీల నేతలు నినాదాలు చేశారు. దీంతో రాజ్యసభ సమావేశాలను ఛైర్మన్ ఎల్లుండికి వాయిదా వేశారు. మరోవైపు లోక్ సభ సమావేశాలను సైతం స్పీకర్ ఎల్లుండికి వాయిదా వేశారు. కాగా, డిసెంబర్ 20వ తేదీ వరకూ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి.
అదానీ వివాదం ఏంటి..
భారతీయ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ అమెరికాలో రూ.21 బిలియన్లకు పైగా లంచం, మోసానికి ప్లాన్ చేసినట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా(యూఎస్) డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ (DOJ) గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీ, మరో ఏడుగురు సీనియర్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌లపై ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. సోలార్ ప్లాంట్లకు సంబంధించిన కాంట్రాక్టులు పొందేందుకు భారత ప్రభుత్వ అధికారులకు రూ.21 బిలియన్లకు పైగా లంచం ఇస్తానని అదానీ వాగ్దానం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై అమెరికా కోర్టులో అభియోగాలు నమోదు అయ్యాయి. అయితే ఈ ఆరోపణలను గౌతమ్ అదానీ కొట్టిపారేశారు. దీనిపై న్యాయపరంగా ముందుకు వెళ్తామని ఆయన చెప్పారు. కాగా ఈ వివాదం అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది. భారత్ పరువు పోతోందంటూ విపక్షాలు మండిపడుతున్నాయి.
Updated Date - Nov 25 , 2024 | 12:42 PM