National: నీట్-యూజీ కీ విడుదల
ABN, Publish Date - May 31 , 2024 | 05:13 AM
వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ యూజీ-2024 పరీక్ష ‘ప్రాథమిక కీ’ని జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ(ఎన్‌టీఏ) గురువారం విడుదల చేసింది.
నేటి రాత్రి 11.50 వరకు అభ్యంతరాల స్వీకరణ
ప్రశ్నకు రూ.200 ఫీజు.. వెల్లడించిన ఎన్‌టీఏ
న్యూఢిల్లీ, మే 30: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ యూజీ-2024 పరీక్ష ‘ప్రాథమిక కీ’ని జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ(ఎన్‌టీఏ) గురువారం విడుదల చేసింది. ప్రాథమిక కీలో అభ్యంతరాలుంటే.. విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా సవాల్ చేయవచ్చని ఎన్‌టీఏ (NTA)పేర్కొంది.
అభ్యంతరాలకు సంబంధించి ఒక్కో ప్రశ్నకు రూ.200 చొప్పున నాన్-రిఫండబుల్ ఫీజును చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇందుకు శుక్రవారం రాత్రి 11.50 గంటల వరకు గడువు విధించింది. అభ్యంరాలను పరిశీలించేందుకు విషయ నిపుణుల కమిటీని నియమిస్తామని పేర్కొంది.
ఒకవేళ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటే.. ఫైనల్ కీలో మార్పులు ఉంటాయని, ఆ వివరాలను అభ్యర్థులకు వ్యక్తిగతంగా చెప్పబోమని తెలిపింది. జూన్ 14న ఫలితాలతోపాటే ఫైనల్ కీ విడుదల ఉంటుందని వివరించింది. కాగా.. నీట్ యూజీ పరీక్ష కోసం 23,81,833 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. దేశవ్యాప్తంగా ఈ నెల 5న 571 నగరాల్లో 4,750 కేంద్రాల్లో పరీక్షను నిర్వహించారు. విదేశాల్లో కూడా 14 నగరాల్లో కూడా ఈ పరీక్ష జరిగింది.
Updated Date - May 31 , 2024 | 06:24 AM