Share News

Independence Day: వరుసగా 11వ సారి ప్రధానిగా మోదీ..

ABN , Publish Date - Aug 12 , 2024 | 04:34 PM

ఇప్పటి వరకు వరుసగా 11 సార్లు ఎర్రకోటపై నుంచి ప్రసంగించిన ప్రధానుల్లో జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ ఉన్నారు. గురువారం జరగనున్న భారత స్వాతంత్ర్య వేడుకలకు దేశ రాజధానిలోని ఎర్రకోట ముస్తాబవుతుంది. ఆ రోజు ప్రధాని నరేంద్ర మోదీ.. ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. దీంతో వారి సరసన ప్రధానిగా మోదీ చేరనున్నారు.

Independence Day: వరుసగా 11వ సారి ప్రధానిగా మోదీ..
PM Modi

న్యూఢిల్లీ, ఆగస్ట్ 12: భారత ప్రధానిగా ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ ఇటీవల బాధ్యతలు చేపట్టారు. దీంతో వరుసగా మూడు సార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పండిట్ జవహర్ లాల్ నెహ్రూ రికార్డును ప్రధాని మోదీ సమం చేశారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా 11 సార్లు ఎర్రకోటపై నుంచి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ.. జాతినుద్దేశించి ప్రసంగించిన మూడో ప్రధానిగా చరిత్రలో నిలిచిపోనున్నారు.


ఆ ఇద్దరి తర్వాత మోదీ..

ఇప్పటి వరకు వరుసగా 11 సార్లు ఎర్రకోటపై నుంచి ప్రసంగించిన ప్రధానుల్లో జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ ఉన్నారు. గురువారం జరగనున్న భారత స్వాతంత్ర్య వేడుకలకు దేశ రాజధానిలోని ఎర్రకోట ముస్తాబవుతుంది. ఆ రోజు ప్రధాని నరేంద్ర మోదీ.. ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. దీంతో వారి సరసన ప్రధానిగా మోదీ చేరనున్నారు. భారత తొలి ప్రధానిగా జవహర్‌లాల్ నెహ్రూ వరుసగా 17 సార్లు ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి ప్రసంగించారు.

అలాగే ఆయన కుమార్తె, ఇందిరాగాంధీ మొత్తం 16 సార్లు ఎర్రకోటపై నుంచి ప్రధానిగా జాతినుద్దేశించి మాట్లాడారు. 1966 జనవరి నుంచి 1977 మార్చి వరకు వరుసగా 11 సార్లు ఆమె ఎర్రకోటపై నుంచి ప్రధానిగా ప్రసంగించారు. అలాగే 1980 జనవరి నుంచి 1984 అక్టోబర్ వరకు ప్రధానిగా మరోమారు అదే ఎర్రకోటపై నుంచి ఆమె జాతినుద్దేశించి ప్రసంగించారు.

Also Read: Kolkata Trainee Doctor Case: ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రాజీనామా


ప్రధానిగా మన్మోహన్ సింగ్..

ఇక యూపీఏ హయాంలో ప్రధానిగా మనోహ్మన్ సింగ్ పని చేశారు. ఆయన సైతం వరుసగా 10 సార్లు మాత్రమే ఆగస్ట్ 15వ తేదీన ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి ప్రసంగించారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే ఘన విజయం సాధించింది. దీంతో ప్రధానిగా తొలిసారి నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టారు. అదే ఏడాది ఆగస్ట్ 15వ తేదీన ఎర్రకోటపై నుంచి ప్రధానిగా ఆయన జాతినుద్దేశించి తొలిసారిగా ప్రసంగించారు. ఈ ప్రసంగంలోనే స్వచ్ఛ్ భారత్‌తోపాటు జనధన్ యోజన ఖాతాలను ప్రారంభిస్తున్నట్లు ప్రధాని మోదీ కీలక ప్రకటన చేసిన విషయం విధితమే.


సరాసరి 82 నిమిషాలు ప్రసంగం

ప్రతి ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ.. ప్రధాని మోదీ ప్రసంగ పాఠం సరాసరి 82 నిమిషాలుగా ఉంది. 2017లో ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం కేవలం 55 నిమిషాలు మాత్రమే ఉండగా.. 2016లో ఆయన ప్రసంగ పాఠం మొత్తం 94 నిమిషాలుగా ఉంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన వేళ.. అంటే 1947లో ప్రధానిగా నెహ్రూ కేవలం 24 నిమిషాలు మాత్రమే మాట్లాడారు. ఇక 1972లో ప్రధాని ఇందిరా గాంధీ 54 నిమిషాలు ప్రసంగించారు.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 12 , 2024 | 04:34 PM