Share News

PM Modi: భారత్‌లో న్యాయబద్ధంగా ఎన్నికలు

ABN , Publish Date - Jun 15 , 2024 | 04:54 AM

భారత్‌లో ఇటీవలి ఎన్నికలు అత్యంత న్యాయంగా జరిగాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రతి అంచెలోనూ విస్తృత స్థాయి సాంకేతికత వినియోగంతో పూర్తి పారదర్శకతతో నిర్వహించారని తెలిపారు. తాను మరోసారి గెలవడం ప్రజాస్వామ్య ప్రపంచానికంతటికీ విజయంలాంటిదని అభివర్ణించారు.

PM Modi: భారత్‌లో న్యాయబద్ధంగా ఎన్నికలు

  • విస్తృత సాంకేతికతతో అత్యంత పారదర్శకంగా నిర్వహణ

  • నా గెలుపు ప్రపంచ ప్రజాస్వామ్య విజయం

  • టెక్నాలజీలో గుత్తాధిపత్యం పోవాలి..

  • జి-7 సదస్సులో ప్రధాని మోదీ పిలుపు

బారి, జూన్‌ 14: భారత్‌లో ఇటీవలి ఎన్నికలు అత్యంత న్యాయంగా జరిగాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రతి అంచెలోనూ విస్తృత స్థాయి సాంకేతికత వినియోగంతో పూర్తి పారదర్శకతతో నిర్వహించారని తెలిపారు. తాను మరోసారి గెలవడం ప్రజాస్వామ్య ప్రపంచానికంతటికీ విజయంలాంటిదని అభివర్ణించారు. ఇటలీలోని అపూలియాలో జరుగుతున్న జి7 దేశాల కూటమి సదస్సులో శుక్రవారం ఆయన మాట్లాడారు. ఇది జి-7 కూటమి 50వ సమావేశం. ఆహ్వానిత దేశ హోదాలో హాజరైన మోదీ మాట్లాడుతూ.. సాంకేతికతలో గుత్తాధిపత్యం పోవాలని, ఫలితాలు అందరికీ అందాలని ఆకాంక్షించారు. సమ్మిళిత సమాజానికి పునాది వేసేందుకు, అసమానతలు రూపుమాపేందుకు ఇది అవసరమని పేర్కొన్నారు. కృత్రిమ మేధను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, సురక్షితంగా అందుబాటులోకి తెచ్చేందుకు అన్ని దేశాలతో కలిసి పనిచేస్తూనే ఉంటామని ప్రకటించారు.

అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఒత్తిడి

అభివృద్ధి చెందుతున్న దేశాలు (గ్లోబల్‌ సౌత్‌) ప్రపంచంలో అనిశ్చిత పరిస్థితులు, ఉద్రిక్తతల కారణంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దేశాల ప్రాధామ్యాలు, ఆందోళనలను ప్రపంచ వేదికపై వెల్లడించడాన్ని భారత్‌ తన బాధ్యతగా స్వీకరించిందని పేర్కొన్నారు. ఆఫ్రికా యూనియన్‌ను జి20 శాశ్వత సభ్యురాలిగా చేర్చుకుని తాము అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన సంగతిని గుర్తుచేశారు. ‘‘ఏఐ అందరికీ అంటూ కృత్రిమ మేధపై జాతీయ విధానం రూపొందించిన అతి తక్కువ దేశాల్లో భారత్‌ ఒకటి. మానవ కేంద్రీకృతంగా ఉంటేనే సాంకేతికత విజయవంతం అవుతుంది. టెక్నాలజీని విధ్వంసానికి కాదు.. అభివృద్ధికి వాడాలి. ఈ ధోరణితోనే మేం ముందుకెళ్తున్నాం’’ అని ప్రధాని వివరించారు. పర్యావరణాన్ని కాపాడేందుకు అందరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.


వరుస భేటీలతో బిజీజిజీ

జి7 సదస్సులో మోదీ.. బ్రిటన్‌, ఇటలీ ప్రధానులు రిషి సునాక్‌, మెలోనీ, ఫ్రాన్స్‌, ఉక్రెయిన్‌ అధ్యక్షులు మేక్రాన్‌, జెలెన్‌ స్కీతో సంభాషించారు. క్రైస్తవ మత పెద్ద పోప్‌ ఫ్రాన్సి్‌సను హత్తుకుని, కొద్దిసేపు మాట్లాడారు. రష్యాతో యుద్ధం పరిస్థితిని జెలెన్‌స్కీ వివరించగా చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే శాంతి నెలకొనే వీలు ఉంటుందని మోదీ స్పష్టం చేశారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) చర్చల పురోగతిపై సునాక్‌తో సంభాషించారు. రక్షణ, సెమీ కండక్టర్లు, సాంకేతికత, వాణిజ్య రంగాల్లో ఇరు దేశాల సంబంధాలను మరింత విస్తృతం చేసేందుకు చాలా అవకాశాలు ఉన్నాయని ట్వీట్‌ చేశారు. మేక్రాన్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం, రక్షణ, అణు, సాంకేతికత, కృత్రిమ మేధ, సముద్ర మార్గ వాణిజ్యం, అంతరిక్ష రంగాల్లో సంబధాలను పటిష్ఠం చేసుకోవడంపై చర్చించారు. కాగా, మెలోని.. సదస్సుకు మోదీని ఆహ్వానిస్తూ భారతీయ పద్ధతుల్లో రెండు చేతులూ జోడించి ‘నమస్కారం’ చేశారు. మోదీ సైతం ఆమె ప్రతి నమస్కారం చేశారు.

ఏఐతో జాగ్రత్త: పోప్‌ ఫ్రాన్సిస్‌

చరిత్రలో తొలిసారిగా పోప్‌ ఫ్రాన్సిస్‌.. జి-7 సదస్సును ఉద్దేశించి ప్రసంగించారు. కృత్రిమ మేధ (ఏఐ)తో లాభాలు, పొంచి ఉన్న ముప్పు గురించి మాట్లాడారు. చాట్‌ జీపీటీ తదితర సాంకేతికతల అందుబాటుతో మానవ సంబంధాలను ఏఐ యాంత్రికంగా మార్చే ముప్పుందని హెచ్చరించారు. ‘‘మన నిర్ణయాలు యంత్రాలు కాకుండా మనమే తీసుకునేలా ఏఐని కట్టడి చేయండి. దీనికోసం అంతా చేతులు కలిపేందుకు ఇదో అవకాశం’’ అని పిలుపునిచ్చారు.

Updated Date - Jun 15 , 2024 | 05:19 AM