PM Modi : ప్రజల మనిషి వెంకయ్య
ABN, Publish Date - Jul 01 , 2024 | 04:33 AM
‘‘వెంకయ్యనాయుడు.. రాజనీతిజ్ఞుడు. ఎలాంటి ఆటుపోట్లనైనా అవలీలగా అధిగమించగల సమర్థుడు’’ అని ప్రధాని నరేంద్రమోదీ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుణ్ని కొనియాడారు.
భరతమాత సేవలో ఆయన జీవన ప్రస్థానం
ప్రజాసేవ పట్ల తిరుగులేని నిబద్ధత గల నేత
ఆటుపోట్లను తేలిగ్గా అధిగమించే సమర్థుడు
మాజీ ఉపరాష్ట్రపతిపై ప్రధాని మోదీ వ్యాసం
వెంకయ్యనాయుడి వాక్పటిమ.. సాటిలేనిది
జన్మదిన వేడుకల సందర్భంగా ప్రధాని ప్రశంస
వెంకయ్యపై 3 పుస్తకాల ఆవిష్కరణ
ప్రజాసేవ పట్ల తిరుగులేని నిబద్ధత గల నాయకుడు.. మాజీ ఉప రాష్ట్రపతిపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యాసం
‘‘వెంకయ్యనాయుడు.. రాజనీతిజ్ఞుడు. ఎలాంటి ఆటుపోట్లనైనా అవలీలగా అధిగమించగల సమర్థుడు’’ అని ప్రధాని నరేంద్రమోదీ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుణ్ని కొనియాడారు. వెంకయ్యతో తనది దశాబ్దాల అనుబంధమని.. తామిద్దరం కలిసి పనిచేసినప్పుడు ఆయన్నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని మోదీ పేర్కొన్నారు. సోమవారం (జూలై 1) వెంకయ్య నాయుడి పుట్టినరోజు సందర్భంగా.. ‘భరతమాత సేవలో వెంకయ్య జీవితం’ పేరిట ప్రధాని మోదీ ఒక వ్యాసం రాశారు. అందులోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
దేశ మాజీ ఉపరాష్ట్రపతి, రాజనీతిజ్ఞుడు వెంకయ్య నాయుడుకు ఇవాళ్టితో 75 ఏళ్లు పూర్తవుతాయి. ఈ సందర్భంగా ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను. అలాగే ఆయన శ్రేయోభిలాషులు, అనుయాయులందరికీ నా శుభాకాంక్షలు. అంకితభావం, ఒదిగిపోయే తత్వం, ప్రజాసేవ పట్ల తిరుగులేని నిబద్ధత కలిగిన ఒక నాయకుడిని గౌరవించుకునే తరుణమిది.
రాజకీయ రంగ ప్రవేశం నుంచి ఉపరాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు నిర్వర్తించే దాకా సాగిన వెంకయ్యనాయుడు కెరీర్.. భారత రాజకీయాల్లోని సంక్లిష్టతలను హుందాగా, సులువుగా అధిగమించడంలో ఆయనకుగల అరుదైన సామర్థ్యాన్ని మన ముందుంచుతుంది. వెంకయ్యనాయుడి వాగ్ధాటి, చతురత, ప్రగతి సంబంధిత అంశాలపై దృఢ వైఖరి వంటి సుగుణాలు.. పార్టీలకు అతీతంగాఆయనకు ఎనలేని గౌరవం తెచ్చిపెట్టాయి. ఆయన జీవితంలో అప్పటికీ ఇప్పటికీ మారనిది ఒక్కటే. అది.. ప్రజలపై ప్రేమ. ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థి రాజకీయాల్లో విద్యార్థి నాయకుడిగా ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది.
ఆయన అపూర్వ ప్రతిభ, వాక్పటిమ, నిర్వహణ నైపుణ్యాల కారణంగా.. ఏ రాజకీయ పార్టీ అయినా ఆయనకు స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉంటుంది. అయితే ‘దేశమే ముందు (నేషన్ ఫస్ట్)’ అనే దార్శనికత నుంచి స్ఫూర్తిపొందిన ఆయన సంఘ్ పరివార్‌తో కలిసి పనిచేయడానికి మొగ్గుచూపారు. ఆ విధంగా ‘ఆర్‌ఎ్‌సఎస్’, ‘ఏబీవీపీ’తో ఆయనకు గల అనుబంధం.. తర్వాతి కాలంలో జనసంఘ్, బీజేపీ బలోపేతానికి ఎంతగానో దోహదం చేసింది. దేశంలో దాదాపు 50 ఏళ్ల కిందట ఎమర్జెన్సీ విధించిన వేళ, దాన్ని వ్యతిరేకిస్తూ మొదలైన ఉద్యమంలో.. చురుకైన పాతికేళ్ల యువకుడుగా వెంకయ్య ముందుకు దూకారు.
ఆ క్రమంలో.. కేవలం లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్‌ను ఆంధ్రప్రదేశ్‌కి ఆహ్వానించినందుకేప్రభుత్వం ఆయనను జైల్లో పెట్టింది. 1980ల మధ్యలో.. మహానేత ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కేంద్రంలోని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అమర్యాదపూర్వకంగా బర్తరఫ్ చేసిన సందర్భంలోనూ ప్రజాస్వామ్య సిద్ధాంత పరిరక్షణ ఉద్యమంలో ఆయన మరోసారి ముందువరుసలో నిలిచారు. వెంకయ్యనాయుడు ఎలాంటి ఆటుపోట్లనైనా అవలీలగా అధిగమించగల సమర్థుడు. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు 1978లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు కాంగ్రె్‌సకు అఖండ విజయం కట్టబెట్టినా.. కాంగ్రెస్ జోరును తట్టుకుని యువ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఐదేళ్లకు జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్ సునామీ రాష్ట్రాన్ని చుట్టబెట్టినప్పుడు కూడా బీజేపీ ఎమ్మెల్యేగా వెంకయ్యనాయుడు ఎన్నికై, ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ (బీజేపీ) ఎదుగుదలకు బాటలు వేశారు.
కేంద్ర మంత్రిగా..
2000 సంవత్సరంలో.. నాటి ప్రధాని వాజపేయి వెంకయ్యను కేంద్ర మంత్రిమండలిలోకి తీసుకునేందుకు ఆసక్తి చూపారు. అప్పుడు వెంకయ్య వెంటనే.. గ్రామీణాభివృద్ధి శాఖ పట్ల తన ఆసక్తి గురించి ఆయనకు తెలియజేశారు. దీంతో అటల్జీ సహా అగ్ర నాయకులందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఆ విషయంలో వెంకయ్యనాయుడు చాలా స్పష్టంగా ఉన్నారు.
తానొక రైతు బిడ్డనని, తన బాల్యమంతా గ్రామాల్లోనే గడిచింది కాబట్టి మంత్రిగా తాను కోరుకునేది ఏదైనా ఉందంటే అది గ్రామీణాభివృద్ధేనని వివరించారు. ఆ శాఖ మంత్రిగా ఆయన.. ‘ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన’ వంటి పథకానికి రూపకర్తగా ప్రధాన పాత్ర పోషించారు.
కొన్నేళ్ల తర్వాత 2014లో ఎన్డీయే అధికారంలోకి వచ్చినప్పుడు.. ఆ ప్రభుత్వంలో ఆయన పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం, పట్టణ పేదరిక నిర్మూలన సంబంధిత కీలకశాఖల బాధ్యతలు నిర్వహించారు. ఆయనహయాంలోనే మేము కీలకమైన ‘స్వచ్ఛభారత్ మిషన్’, పట్టణాభివృద్ధి సంబంధిత ప్రధాన పథకాలకు శ్రీకారం చుట్టాం.
ఇంత సుదీర్ఘకాలంపాటు గ్రామీణ, పట్టణాభివృద్ధికి కృషి చేసిన ఏకైక నాయకుడు బహుశా ఆయనే కావచ్చు. దాదాపు 15 సంవత్సరాలు గుజరాత్ బాధ్యతలు చూసి.. 2014లో నేను ఢిల్లీకి వచ్చేటప్పటికి.. జాతీయ రాజధానికి నేనొక బయటి వ్యక్తిని మాత్రమే. అటువంటి సమటయంలో వెంకయ్య నాయుడి సలహాలు, సూచనలు నాకెంతో ఉపయుక్తమయ్యాయి. ఆయనొక సమర్థుడైన సభా వ్యవహారాల మంత్రి. ఏకాభిప్రాయ సాధన ప్రాముఖ్యమేమిటో చక్కగా తెలిసినవారు.
ఉపరాష్ట్రపతిగా..
2017లో మా (ఎన్డీయే) కూటమి ఆయనను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపాదించింది. అయితే, ఆయనకుగల మహోన్నత స్థానాన్ని భర్తీ చేయడం ఎలాగన్న సందిగ్ధంలో పడ్డాం. అదే సమయంలో.. ఉప రాష్ట్రపతి పదవికి ఆయనను మించిన ఉత్తమ అభ్యర్థి మరొకరు లేరన్న వాస్తవం కూడా మాకు తెలుసు.
ఈ నేపథ్యంలో ఎంపీగా, మంత్రిగా తన పదవులకు రాజీనామా చేస్తూ ఆయనిచ్చిన ఉపన్యాసాల్లో ఒక్క అక్షరం కూడా నేను మరువలేను. పార్టీతో తనకు గల అనుబంధాన్ని, దాని ఎదుగుదలకు తాను చేసిన కృషిని గుర్తుచేసుకుంటూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. పార్టీపై ఆయనకుగల లోతైన నిబద్ధత, అనురక్తిని ఆ ఉపన్యాసాలు ప్రతిబింబించాయి.
ఆయన ఉప రాష్ట్రపతి అయ్యాక.. ఆ పదవికి మరింత విలువను ఆపాదించే అనేక చర్యలు తీసుకున్నారు. యువ ఎంపీలు, మహిళా ఎంపీలు, తొలిసారి ఎంపీ అయినవారికి మాట్లాడే అవకాశం కల్పించడంలో రాజ్యసభకు అత్యుత్తమ చైర్‌పర్సన్‌గా నిలిచారు. సభకు సభ్యుల హాజరుపై ఆయన ఎక్కువగా దృష్టిసారించారు. సభా సంఘాలను మరింత ప్రభావశీలం చేయడంతోపాటు సభలో చర్చస్థాయిని కూడా పెంచారు.
జమ్ముకశ్మీర్‌కు సంబంధించి ఆర్టికల్ 370, 35(ఎ)ను రద్దుచేస్తూ రాజ్యసభలో తీర్మానం ప్రవేశపెట్టినపుడు వెంకయ్యనాయుడేసభాపతిగా ఉన్నారు. అది ఆయనకు ఎంతో ఉద్విగ్నభరిత క్షణమని నా నిశ్చితాభిప్రాయం. ఎందుకంటే.. డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ కలలుగన్న అఖండ భారతంవైపు ఆకర్షితుడైన ఒకనాటి బాలుడు వెంకయ్య.. ఆ స్వప్నం సాకారమయ్యే వేళ సాక్షాత్తూ సభాధ్యక్ష స్థానంలో ఉన్నారు.
పని, రాజకీయాలను పక్కన పెడితే.. వెంకయ్యనాయుడు విపరీతమైన పఠనాభిలాషి, రచయిత కూడా. ఉజ్వలమైన తెలుగు సంస్కృతిని దేశరాజధానికి పరిచయం చేసిన నేతగా ఢిల్లీ ప్రజల్లో ఆయనకు విశేషమైన గుర్తింపు ఉంది. ఏటా సంక్రాంతి, ఉగాది పర్వదినాల్లో ఆయన నిర్వహించే కార్యక్రమాలు ఢిల్లీలో చాలామందికి మధుర జ్ఞాపకాలు.
ఉపరాష్ట్రపతి పదవీకాలం ముగిసిన తర్వాత కూడా వెంకయ్య ప్రజాజీవితంలో చురుగ్గా ఉంటున్నారు. తనకు ఆసక్తిగల అంశాలు లేదా దేశవ్యాప్తంగా వివిధ పరిణామాలపై ఆయన అప్పుడప్పుడూ ఫోన్ ద్వారా నన్ను వాకబు చేస్తుంటారు. మా ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఇటీవలే నేను ఆయనను కలిస్తే.. ఆయన ఎంతో సంతోషంతో నాకు, నా బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఇలాంటి తీపి జ్ఞాపకాలతో 75 ఏళ్ల మైలురాయిని చేరిన వెంకయ్యనాయుడుకు మరోసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. యువకార్యకర్తలు, ఎన్నికైన ప్రజాప్రతినిధులు, ప్రజా సేవాభిలాషులైన ప్రతి ఒక్కరూ ఆయన జీవితానుభావాల వెలుగులో విలువలను అందిపుచ్చుకోగలరని ఆశిస్తున్నాను. అలాంటి అరుదైన నాయకులే దేశాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతూ ఉత్తేజమిస్తున్నారు.
- నరేంద్ర మోదీ
మాటలే కాదు.. చేతలూ..
వెంకయ్యనాయుడు ప్రసంగం విన్నవారంతా సాధారణంగా ఆయన వాక్పటిమకు పెద్దపీట వేస్తారు. అయితే, ఆయన వాక్చతురుడు మాత్రమే కాదు... కార్యదక్షుడు కూడా! యువ ఎమ్మెల్యేగా శాసనసభకు ప్రాతినిధ్యం వహించి రోజుల నుంచీ సభావ్యవహారాలను ఔపోసన పట్టిన ఆయనలోని కచ్చితత్వం.. నియోజకవర్గ ప్రజల గళాన్ని సభలో వినిపించడంలో చూపిన అంకితభావం.. వెంకయ్యనాయుడుకు అపార గౌరవాన్ని సముపార్జించి పెట్టాయి.
ఆయన ప్రతిభను గుర్తించిన ఎన్టీఆర్ వంటి దిగ్గజనేత.. ఆయన్ను తన పార్టీలో చేర్చుకోవాలని అనుకున్నారు. కానీ, వెంకయ్యనాయుడు తన మౌలిక సిద్ధాంతాన్ని వీడబోనంటూ సున్నితంగా నిరాకరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామగ్రామానా పర్యటించి, అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతూ బీజేపీని రాష్ట్రంలో బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. సభాపక్ష నాయకుడుగా పార్టీని విజయవంతంగా నడిపిస్తూ ఆ తర్వాత బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడయ్యారు. బీజేపీ కేంద్ర నాయకత్వం 1990ల్లో ఆయన కృషిని గుర్తించింది.
1993లో ఆయన్ను పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శిగా నియమించింది. నాటి నుంచీ జాతీయ రాజకీయాల్లో ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. యుక్తవయసులో అటల్జీ (అటల్ బిహారీ వాజపేయి), ఆడ్వాణీ వంటి అగ్రనేతల పర్యటనల గురించి ప్రకటించిన ఆయన.. అనంతరం కాలంలో వారితో ప్రత్యక్షంగా కలిసి పనిచేయడం నిజంగా అసాధారణమైన గౌరవం. బీజేపీని అధికారంలోకి తేవడంతోపాటు.. దేశానికి తొలి బీజేపీ ప్రధానమంత్రి నాయకత్వం వహించేలా చేయడంపై ప్రధానకార్యదర్శి హోదాలో ఆయన నిశితంగా దృష్టిసారించారు. ఈ క్రమంలో, ఢిల్లీకి వెళ్లిన తర్వాత.. ఆయన ఏనాడూ వెనుదిరిగి చూసుకునే అవసరం లేకుండా ఎదిగి ఏకంగా పార్టీ జాతీయ అధ్యక్షుడయ్యారు.
Updated Date - Jul 01 , 2024 | 04:33 AM