ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

PM Modi: నిలబడతాం.. బలపడతాం

ABN, Publish Date - Sep 23 , 2024 | 02:52 AM

‘‘క్వాడ్‌ కూటమి ఏ దేశానికీ వ్యతిరేకం కాదు. అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవిస్తాం. భద్రత, అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, వాతావరణ మార్పులు, సామర్థ్య నిర్మాణమే మా లక్ష్యం.

  • మా కూటమి ఏ దేశానికీ వ్యతిరేకం కాదు

  • అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవిస్తాం

  • శాంతియుతంగా సమస్యల పరిష్కారం

  • భద్రత, సాంకేతికత, వాతావరణ మార్పులు..

  • సామర్థ్య నిర్మాణమే మా లక్ష్యాలు

  • క్వాడ్‌ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ

  • ఇకపై సముద్రంలోనూ క్వాడ్‌.. కొత్తగా ‘మైత్రి’

  • ఇండో-పసిఫిక్‌ లాజిస్టిక్స్‌కు పైలట్‌ ప్రాజెక్టు

  • ‘విల్మింగ్టన్‌ డిక్లరేషన్‌’లో పాక్‌పై నిప్పులు

  • మోదీపై జో బైడెన్‌ పొగడ్తల వర్షం

వాషింగ్టన్‌, సెప్టెంబరు 22: ‘‘క్వాడ్‌ కూటమి ఏ దేశానికీ వ్యతిరేకం కాదు. అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవిస్తాం. భద్రత, అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, వాతావరణ మార్పులు, సామర్థ్య నిర్మాణమే మా లక్ష్యం. సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవడమే క్వాడ్‌ అభిమతం. మేం(క్వాడ్‌ కూటమి) నిలబడతాం.. బలపడతాం’’ అని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ స్వస్థలమైన విల్మింగ్టన్‌లో ఆదివారం జరిగిన క్వాడ్‌ దేశాధినేతల శిఖరాగ్ర సదస్సులో ఆయన మాట్లాడారు. నాలుగేళ్లక్రితం ఇండో-పసిఫిక్‌ రీజియన్‌లో స్వేచ్ఛాయుత వాణిజ్యం, భద్రత వంటి అంశాలతో అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌, భారత్‌ కలిసి క్వాడ్‌ కూటమిగా ఏర్పడ్డ విషయం తెలిసిందే..! ఈ కూటమి ఏర్పడి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన సదస్సులో మోదీ, బైడెన్‌తోపాటు.. ఆస్ట్రేలియా ప్రధాని అల్బనెస్‌, జపాన్‌ ప్రధాని కిషిదా పాల్గొన్నారు.


క్వాడ్‌కు వ్యతిరేకంగా చైనా వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో.. మోదీ ఆ దేశం పేరును ప్రస్తావించకుండా తాము అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవిస్తామని, ఎవరికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. తమ సందేశం ఒక్కటేనని, బలంగా నిలబడి, సభ్యదేశాల సహకారానికి కృషిచేస్తామని పేర్కొన్నారు. ‘‘ప్రపంచంలో ఉద్రిక్తతలు, సంఘర్షణలు చోటుచేసుకుంటున్న సమయంలో క్వాడ్‌ కూటమి ఏర్పాటైంది. మానవాళి శ్రేయస్సుకు, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు కంకణబద్ధమైంది. క్వాడ్‌ సదస్సులో ఫలవంతమైన చర్చలు జరిగాయి.


ప్రపంచానికి మేలు జరిగేలా ఇంకా సమర్థంగా పనిచేయాలని నిర్ణయించాం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇండో-పసిఫిక్‌ రీజియన్‌లో స్వేచ్ఛాయుత వాణిజ్యానికి సహకరించేందుకు భారత్‌ కట్టుబడి ఉందన్నారు. అంతకు ముందు ఆయన ‘క్వాడ్‌ క్యాన్సర్‌ మూన్‌షాట్‌ ఈవెంట్‌’లో మాట్లాడుతూ.. ఇండో-పసిఫిక్‌ రీజియన్‌ దేశాల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ పరీక్షలు, గుర్తింపు, చికిత్సకు భారత్‌ తరఫున రూ.62.61 కోట్ల(7.5 మిలియన్‌ డాలర్లు)ను అందజేస్తామని ప్రకటిస్తూ.. తమ లక్ష్యం ‘ఒక భూగోళం.. ఒక ఆరోగ్యం’ అంటూ నినదించారు. ఈ రీజియన్‌లోని దేశాలకు 4 కోట్ల డోసుల క్యాన్సర్‌ టీకాలను అందజేస్తామన్నారు.


  • క్వాడ్‌ దేశాధినేతల సంయుక్త ప్రకటన

ఈ సదస్సులో క్వాడ్‌ దేశాధినేతలు ఈశాన్య, దక్షిణాసియా, పసిఫిక్‌ దీవుల్లో పరస్పర సహరాన్ని అందిపుచ్చుకోవాలని నిర్ణయించారు. మారిటైమ్‌ ఇనిషియేటివ్‌ ఫర్‌ ట్రైనింగ్‌ ఇన్‌ ఇండో-పసిఫిక్‌(మైత్రి)ని క్వాడ్‌ దేశాధినేతలు సంయుక్తంగా ప్రకటించారు. ఇకపై ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలోని సముద్ర జలాల్లో భద్రత, అంతర్జాతీయ చట్టాల అమలు, చట్టవ్యతిరేక చర్యల నిర్మూలనకు చర్యలు తీసుకుంటారు. ఇందుకోసం భారత్‌, అమెరికా, జపాన్‌ కోస్ట్‌గార్డులు, ఆస్ట్రేలియా సరిహద్దు దళం సంయుక్తంగా పనిచేస్తాయి.


2025లో మైత్రి శిక్షణ కార్యక్రమాలను భారత్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. సముద్రాల్లో క్వాడ్‌ పోర్టులను ఏర్పాటు చేసి, పరస్పరం సహకరించుకోవాలని నలుగురు నేతలు సంకల్పించారు. దీనిపై ముంబైలో ‘క్వాడ్‌ ప్రాంతీయ పోర్టులు-రవాణా సదస్సు’ను నిర్వహించాలని నిర్ణయించారు. క్వాడ్‌ ఇండో-పసిఫిక్‌ లాజిస్టిక్స్‌ నెట్‌వర్క్‌ను పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించాలని నిర్ణయించారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంత నిపుణులకు ఇస్తున్న ఫెలోషి్‌పల సంఖ్యను 2,200కు పెంచాలని క్వాడ్‌ దేశాధినేతలు నిర్ణయించారు. ఇండో-పసిఫిక్‌ రీజియన్‌లో సెమీకండక్టర్ల సప్లయ్‌ చైన్‌ ఏర్పాటు తదితర అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు.


  • ‘విల్మింగ్టన్‌ డిక్లరేషన్‌’లో పాక్‌పై నిప్పులు

క్వాడ్‌ దేశాధినేతలు ‘విల్మింగ్టన్‌ డిక్లరేషన్‌’ పేరిట సీమాంతర ఉగ్రవాదాన్ని ముక్తకంఠంతో ఖండించారు. ఈ సందర్భంగా పరోక్షంగా పాకిస్థాన్‌ చర్యలపై నిప్పులు కురిపించారు. 26/11 ముంబై ఉగ్రదాడులు, పఠాన్‌కోట్‌ దాడి గురించి ప్రస్తావించారు. అదే సమయంలో చైనా, ఉత్తరకొరియాల తీరును కూడా పరోక్షంగా ఎండగట్టారు. రష్యాకు ఉత్తర కొరియా ఆయుధ సంపత్తిని అందజేస్తున్న విషయాన్ని ఆయా దేశాల పేర్లను ప్రస్తావించకుండా విమర్శించారు.


  • వచ్చే ఏడాది భారత్‌లో..

క్వాడ్‌ దేశాధినేతల తదుపరి సదస్సు వచ్చే ఏడాది భారత్‌లో జరగనుంది. నాలుగేళ్ల క్రితం ఈ సంస్థ ఆవిర్భవించగా.. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌, భారత్‌లలో సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు. నిజానికి ఈ సంవత్సరం భారత్‌ వంతు కాగా.. తన పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో తన స్వస్థలంలో సమ్మిట్‌కు అనుమతించాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ విజ్ఞప్తి చేశారు. దాంతో.. వచ్చే ఏడాది సదస్సును భారత్‌లో ఏర్పాటు చేయాలని తీర్మానించారు.


  • మోదీపై బైడెన్‌ పొగడ్తల వర్షం

విల్మింగ్టన్‌లో శనివారం బైడెన్‌-మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపిన విషయం తెలిసిందే..! ఈ చర్చల్లో భాగంగా మోదీపై బైడెన్‌ పొగడ్తల వర్షం కురిపించినట్లు విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఉక్రెయిన్‌లో మోదీ పర్యటన.. శాంతికోసం ఆయన చేస్తున్న కృషిని అభినందించినట్లు వివరించారు. కొవిడ్‌ సమయంలో ‘టీకా మైత్రి’ మొదలు.. ఇటీవలి జీ20 సమ్మిట్‌ వరకు ప్రపంచ క్షేమం కోసం భారత్‌ చేస్తున్న కృషిని కొనియాడినట్లు పేర్కొన్నారు. ఇరువురు నేతల భేటీలో.. సెమీకండక్టర్లు మొదలు.. అంతరిక్షం దాకా పలు అంశాలపై చర్చలు జరిగినట్లు తెలిపారు. భారత్‌-అమెరికా మధ్య కీలకమైన రక్షణ, క్లీన్‌ ఎనర్జీ, గ్లోబల్‌ హెల్త్‌పై ఒప్పందాలు కుదిరినట్లు వెల్లడించారు. ఐక్య రాజ్య సమితి(ఐరాస)లో భారత్‌ శాశ్వత సభ్యత్వానికి కృషిచేస్తానని బైడెన్‌ పేర్కొన్నట్లు వివరించారు.

Updated Date - Sep 23 , 2024 | 02:52 AM