Rahul Gandhi: భారీ స్టాక్ మార్కెట్ స్కామ్
ABN, Publish Date - Jun 07 , 2024 | 03:20 AM
ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌షా, వారి కోసం పనిచేసే ఎగ్జిట్‌పోల్స్ సంస్థలు కలిసి దేశంలోనే భారీ స్టాక్ మార్కెట్ కుంభకోణానికి పాల్పడ్డారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల రోజున స్టాక్‌మార్కెట్ పతనమవ్వడంతో 5 కోట్ల మంది మదుపరులు భారీగా నష్టపోయారని, రూ.30 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద ఆవిరైందని చెప్పారు.
ఎన్నికల ఫలితాల రోజు రూ.30 లక్షల కోట్ల సంపద ఆవిరి
ఈ పతనం వెనక మోదీ, షా కుట్ర
సెబీ దర్యాప్తు జరుగుతున్న కంపెనీ న్యూస్ చానల్‌కే ఇంటర్వ్యూలు
అదానీ కుంభకోణం కంటే అతి పెద్దది
పార్లమెంటరీ కమిటీ విచారణ జరిపించాలి: రాహుల్
అన్నీ నిరాధార ఆరోపణలే: గోయెల్
5 కోట్ల మదుపరులకు భారీ నష్టం
మోదీ, అమిత్‌షా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలని ఎందుకు సలహా ఇచ్చారు? వారి
వృత్తి స్టాక్ ఇన్వెస్ట్‌మెంట్ సలహాలివ్వడమేనా?
- రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌షా, వారి కోసం పనిచేసే ఎగ్జిట్‌పోల్స్ సంస్థలు కలిసి దేశంలోనే భారీ స్టాక్ మార్కెట్ కుంభకోణానికి పాల్పడ్డారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల రోజున స్టాక్‌మార్కెట్ పతనమవ్వడంతో 5 కోట్ల మంది మదుపరులు భారీగా నష్టపోయారని, రూ.30 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద ఆవిరైందని చెప్పారు. ఈ కుట్రపై మోదీ, అమిత్‌షా, ఎగ్జిట్‌పోల్ సంస్థలు, విదేశీ ఇన్వెస్టర్లపై విచారణకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.గురువారం ఆయన కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నేతలు జైరాం రమేశ్, పవన్ ఖేరా, సుప్రియా శ్రీనాథేతో కలిసి మాట్లాడారు.
ఒక క్రమపద్ధతిలో ఈ కుంభకోణం జరిగిందని రాహుల్‌గాంధీ ఆరోపించారు. సెక్యూరిటీ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) దర్యాప్తు జరుగుతున్న ఓ కంపెనీ(అదానీని ఉద్దేశించి)కి చెందిన న్యూస్‌చానల్‌కు మోదీ, అమిత్‌షా ఇంటర్వ్యూలిస్తూ.. జూన్ 4లోపు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలని, ఆ తర్వాత షేర్ల రేట్లను అందుకోలేరన్నట్లుగా మదుపరులకు సలహాలిచ్చారన్నారు.
‘‘మే 13న అమిత్ ఆ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జూన్ 4లోపు షేర్లు కొనాలన్నారు. అదే నెల 19న మోదీ ఇంటర్వ్యూ ఇస్తూ అదే మాట చెప్పారు. జూన్ 4న స్టాక్ మార్కెట్ రికార్డులు బద్ధలవుతాయన్నారు. జూన్ 1న ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. జూన్ 3న స్టాక్ మార్కెట్ సూచీలు ఆల్‌టైమ్ గరిష్ఠానికి చేరుకున్నాయి. ఎన్నికల ఫలితాల రోజు(జూన్ 4న) స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయింది’’ అని రాహుల్ గుర్తుచేశారు.
స్టాక్ మార్కెట్ల గురించి గతంలో ఏ ప్రధాని కూడా మాట్లాడలేదని, మోదీ, షా మదుపరులకు ఎందుకు పిలుపునిచ్చారని నిలదీశారు. స్టాక్స్‌పై సలహాలివ్వడమే వారి పనా? అని ప్రశ్నించారు. వారిద్దరూ ఇంటర్వ్యూ ఇచ్చిన న్యూస్ చానల్‌కు కూడా ఈ కుంభకోణంతో సంబంధం ఉందా? అని అనుమానం వ్యక్తం చేశారు. స్టాక్ మార్కెట్ పతనానికి, అదానీ కుంభకోణానికి ముడిపడి ఉందా? అని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘స్టాక్ మార్కెట్ కుంభకోణం అదానీ స్కామ్ కంటే చాలా పెద్దది’’ అని రాహుల్ సమాధానమిచ్చారు.
ఆరోపణలను కొట్టిపారేసిన బీజేపీ
రాహుల్‌గాంధీ ఆరోపణలపై బీజేపీ నేత పీయూ్‌షగోయల్ తీవ్రంగా స్పందించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాహుల్‌గాంధీవి నిరాధారమైన ఆరోపణలు అని కొట్టిపారేశారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిని జీర్ణించుకోలేకే ఇలా ఆరోపణలు చేస్తున్నారన్నారు. ప్రధాని మోదీ భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే దిశలో అడుగులు వేస్తున్నారని చెప్పారు. ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించేందుకు రాహుల్ చేస్తున్న కుట్రలో భాగమే ఈ ఆరోపణలు అని ఆయన పేర్కొన్నారు.
Updated Date - Jun 07 , 2024 | 03:21 AM