Rahul Gandhi : ఇది జాతీయ విపత్తే
ABN, Publish Date - Aug 02 , 2024 | 04:47 AM
‘‘వయనాడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ఆ దృశ్యాలు హృదయాన్ని తీవ్రంగా గాయపరుస్తున్నాయి. నాకు ఏం చెప్పాలో తెలియడం లేదు. మా నాన్న చనిపోయినప్పుడు ఎలా ఉండేదో.. ఇప్పుడు అలాంటి బాధనే ఎదుర్కొంటున్నాను.
మా నాన్నను కోల్పోయినప్పటి పరిస్థితి గుర్తుకొచ్చింది
వయనాడ్ విపత్తుపై రాహుల్
ప్రియాంకతో కలిసి పర్యటన
ఆగస్టు, సెప్టెంబరులో అధిక వర్షపాతం
వారంలో తెరుచుకోనున్న సాగర్ గేట్లు
మా నాన్నను కోల్పోయినప్పటి పరిస్థితి గుర్తుకొచ్చింది: రాహుల్‌గాంధీ
వయనాడ్, ఆగస్టు 1: ‘‘వయనాడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ఆ దృశ్యాలు హృదయాన్ని తీవ్రంగా గాయపరుస్తున్నాయి. నాకు ఏం చెప్పాలో తెలియడం లేదు. మా నాన్న చనిపోయినప్పుడు ఎలా ఉండేదో.. ఇప్పుడు అలాంటి బాధనే ఎదుర్కొంటున్నాను. నా దృష్టిలో ఇది జాతీయ విపత్తే’’ అని లోక్‌సభలో విపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్‌గాంధీ ఉద్వేగంతో అన్నారు. గురువారం ఆయన తన సోదరి ప్రియాంక గాంధీతో కలిసి వయనాడ్‌లో కొండచరియల బాధిత ప్రాంతాలు-- ముండక్కై, చురాల్‌మల, అట్టమల, మెప్పాడిలో పర్యటించారు.
ఈ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పునరావాస శిబిరాల్లో, ఆస్పత్రుల్లో బాధితులతో మాట్లాడారు. ‘‘దేశం మీ వెన్నంటే ఉంది..’’ అంటూ వారికి ధైర్యం చెప్పారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఇది బాధాకరమైన పరిస్థితి అని.. పినరయి ప్రభుత్వం బాధితులకు అన్ని విధాలా సాయం చేయడానికి కట్టుబడి ఉందని చెప్పారు. ముందే హెచ్చరించామంటూ లోక్‌సభలో హోంమంత్రి అమిత్‌షా చేసిన ప్రకటన గురించి విలేకరులు ప్రస్తావించగా.. ‘‘ఇది రాజకీయ ఘర్షణకు సమయం కాదు.
అన్ని వ్యవస్థలు కలిసికట్టుగా పనిచేయాల్సిన తరుణమిది’’ అని వ్యా ఖ్యానించారు. కరోనా కష్టకాలంలో తాను, ప్రియాంక వయనాడ్ ప్రజలకు అండగా ఉన్న విషయాన్ని గుర్తుచేస్తూ.. ఇప్పుడు కూడా సహాయక చర్యలు, పునరావాస కార్యక్రమాలను నిశితంగా పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. అనంతరం ఇదే విషయాన్ని తన ఎక్స్, ఫేస్‌బుక్ ఖాతాల్లో పోస్ట్ చేశారు. మరోవైపు కేరళ సీఎం పినరయి విజయన్ కూడా వయనాడ్‌లో పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 280కి పైగా పౌరులు చనిపోయారని, కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. జాతీయ విపత్తుగా ప్రకటించడానికి అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న సైన్యం, రెస్క్యూ వర్కర్లు, స్థానికులను ఆయన అభినందించారు.
ఆర్మీ జాగిలాలు మృతదేహాలను గుర్తిస్తున్నాయని, నదిలో కొట్టుకుపోయిన శరీర భాగాలను వెలికితీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. కాగా.. కొండచరియలు విరిగిపడ్డ ఘటనల్లో మృతుల సంఖ్య 289కి పెరిగినట్లు అధికారులు వివరించారు. గల్లంతైన వారి ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.
డార్క్ టూరిజం వద్దు
వయనాడ్‌లో డార్క్ టూరిజానికి రావొద్దంటూ కేరళ పోలీసులు సామాజిక మాధ్యమాల్లో విజ్ఞప్తి చేశారు. దీంతో.. ‘డార్క్ టూరిజం’ అనే పదం వైరల్‌గా మారింది. ‘చెర్నోబిల్ అండ్ ది డార్క్ టూరిస్ట్’ టీవీ షోతో ఈ పదం బాగా పాపులర్ అయింది. మరణం, విషాదం, హింస చోటుచేసుకుని, అసాధారణ పరిస్థితులు ఉండే ప్రదేశాలను సందర్శించడాన్ని డార్క్ టూరిజం అంటారు.
ఉదాహరణకు ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్ (అణు విద్యుత్తు కేంద్రం) ఘటన, కాంబోడియాలో కిల్లింగ్ ఫీల్డ్స్, పోలెండ్‌లోని అశ్విట్జ్ క్యాంప్ వంటివి డార్క్ టూరిజం కిందకు వస్తాయి. ఇప్పుడు వయనాడ్‌కు డార్క్ టూరిస్టులు వస్తే.. సహాయక చర్యలకు ఆటంకాలేర్పడతాయని కేరళ పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు.
Updated Date - Aug 02 , 2024 | 04:50 AM