Delhi : భారత పరీక్షా వ్యవస్థ ఒక మోసం
ABN, Publish Date - Jul 23 , 2024 | 04:05 AM
భారత పరీక్షా వ్యవస్థ ఒక మోసమని.. డబ్బుంటే దాన్ని కొనేయవచ్చని చాలామంది నమ్ముతున్నారని లోక్‌సభలో విపక్ష నేత, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
డబ్బుంటే దానిని కొనవచ్చని చాలామంది నమ్ముతున్నారు
ప్రతిపక్షం భావన కూడా అదే.. లోక్‌సభలో రాహుల్‌గాంధీ
విద్యా మంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజీనామా చేయాలి: అఖిలేశ్
ప్రతిపక్ష నేతలది మొసలి కన్నీరు.. యూపీఏ హయాం నాటి
లీకేజీ గణాంకాలు బయటకు వస్తే వారే ఇబ్బందిపడతారు: ప్రధాన్
న్యూఢిల్లీ, జూలై 22: భారత పరీక్షా వ్యవస్థ ఒక మోసమని.. డబ్బుంటే దాన్ని కొనేయవచ్చని చాలామంది నమ్ముతున్నారని లోక్‌సభలో విపక్ష నేత, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షం భావన కూడా అదేనని ఆయన స్పష్టం చేశారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు తాము నీట్ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతూనే ఉంటామని తేల్చిచెప్పారు. ‘‘మన పరీక్షా వ్యవస్థలో తీవ్ర సమస్య ఉందని దేశం మొత్తానికీ తెలుసు. కానీ, మంత్రి (కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్రప్రధాన్) తనను తప్ప అందరినీ నిందిస్తున్నారు.
ఇక్కడ జరుగుతున్నదానికి సంబంధించి మౌలిక విషయాలు కూడా ఆయనకు తెలుసని నేను అనుకోను. జరుగుతున్న పరిణామాల పట్ల లక్షలాది మంది విద్యార్థులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. భారత పరీక్షా వ్యవస్థ ఒక మోసమని వారు విశ్వసిస్తున్నారు. బాగా డబ్బు ఉంటే.. భారత పరీక్షా వ్యవస్థను కొనేయవచ్చని నమ్ముతున్నారు. ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నవారి భావన కూడా అదే’’ అని రాహుల్ సోమవారం లోక్‌సభలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నీట్ అక్రమాల గురించి అడుగుతుంటే ధర్మేంద్రప్రధాన్ సుప్రీంకోర్టు గురించి, ప్రధాని గురించి మాట్లాడుతున్నారే తప్ప.. ఈ సమస్యను పరిష్కరించడానికి తాము తీసుకుంటున్న చర్యల గురించి చెప్పలేకపోయారన్నారు. ఒక్క నీట్ పరీక్ష అనే కాక, అన్ని పెద్ద పరీక్షల పరిస్థితీ అలాగే ఉందని ధ్వజమెత్తారు.
ఇక, నీట్ నిర్వహణలో అవకతవకలను దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా అభివర్ణించిన కాంగ్రెస్ ఎంపీ (ఎర్నాకుళం నియోజకవర్గం) హిబి ఈడెన్.. పేపర్ లీకేజీపై విచారణకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్‌చేశారు. ‘‘ప్రభుత్వ గణాంకాల ప్రకారమే గడిచిన ఏడేళ్లలో 15 రాష్ట్రాల్లో 70 పరీక్షల ప్రశ్నపత్రాలు లీకయ్యాయి’’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అఖిలేశ్ కూడా ఽధర్మేంద్ర ప్రధాన్‌పై మండిపడ్డారు.
ఆయన విద్యా మంత్రిగా ఉన్నంతవరకూ విద్యార్థులకు న్యాయం జరగదని దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వం పేపర్ లీకేజీల్లో రికార్డులు సృష్టిస్తోందని వ్యంగ్యంగా అన్నారు. రాహుల్, అఖిలేశ్ వ్యాఖ్యలపై ధర్మేంద్ర ప్రధాన్ ఘాటుగా స్పందించారు. గట్టిగా అరిచినంతమాత్రాన అబద్ధం నిజమైపోదని.. దేశంలో పరీక్షల వ్యవస్థను పనికిమాలిన వ్యవస్థగా విపక్ష నేత పేర్కొనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన వ్యాఖ్యనించారు. ‘‘లోక్‌సభలో విపక్ష నేత (రాహుల్), ఆయన దుష్టకూటమి మొసలికన్నీరు కారుస్తున్నారు. యూపీఏ హయాంలోను, ఉత్తరప్రదేశ్‌లో అఖిలేశ్ అధికారంలో ఉన్నప్పటి పేపర్ లీక్స్‌కు సంబంధించి క్షేత్రస్థాయి వాస్తవాలు బయటికొస్తే వారే ఇబ్బందిపడే పరిస్థితి నెలకొంటుంద’’ని ప్రధాన్ ట్వీట్ చేశారు.
16 పరీక్షలే వాయిదా..
సాంకేతిక, న్యాయ, పాలనా కారణాల వల్లగానీ, కొవిడ్ కారణంగా గానీ.. 2018 నుంచి ఇప్పటిదాకా ఎన్‌టీఏ 16 పరీక్షలను వాయిదా వేసిందని కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి సుకాంత మజుందార్ సోమవారం లోక్‌సభలో తెలిపారు. డీఎంకే ఎంపీ కనిమొళి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘2018లో ఏర్పాటైనప్పటి నుంచీ ఎన్‌టీఏ 5.4 కోట్ల మంది విద్యార్థులకు.. 240 పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది’’ అని ఆయన పేర్కొన్నారు. ఇక.. ఎన్‌టీఏ పనితీరుపై సమీక్ష, సంస్కరణలపైౖ ఏర్పాటు చేసిన ఏడుగురు సభ్యుల ప్యానెల్ తాజాగా.. ఐఐటీ కాన్పూర్‌కు చెందిన ఇద్దరు విద్యావేత్తలను సభ్యులుగా చేర్చుకుంది.
Updated Date - Jul 23 , 2024 | 04:05 AM