Cinema : వివాదంలో బాలీవుడ్ తొలి సూపర్‌స్టార్.. కోర్టుకెక్కిన లివింగ్ పార్ట్‌నర్..
ABN, Publish Date - Dec 30 , 2024 | 02:22 PM
హిందీ చిత్రపరిశ్రమలో మొట్టమొదటి సూపర్‌స్టార్‌గా ఓ వెలుగు వెలిగారు రాజేష్‌ఖన్నా. ఆకర్షించే అందం, అద్భుత అభినయంతో పాటు వ్యక్తిగత వివాదాలతోనూ ఎప్పుడూ లైమ్‌లైట్‌లో ఉండేవాడు. చనిపోయి 12 ఏళ్లు గడుస్తున్నా.. వ్యక్తిగత జీవితం, ఆస్తి తగాదాలతో మళ్లీ బీటౌన్‌లో చర్చనీయాంశంగా మారింది రాజేష్‌ఖన్నా పేరు. పుష్కర కాలం గడిచాక రాజేష్‌ఖన్నా లివింగ్ పార్ట్‌నర్, నటి అనితా అద్వానీ..
హిందీ చిత్రపరిశ్రమలో మొట్టమొదటి సూపర్‌స్టార్‌గా ఓ వెలుగు వెలిగారు రాజేష్‌ఖన్నా. ఆకర్షించే అందం, అద్భుత అభినయంతో పాటు వ్యక్తిగత వివాదాలతోనూ ఎప్పుడూ లైమ్‌లైట్‌లో ఉండేవాడు. చనిపోయి 12 ఏళ్లు గడుస్తున్నా.. వ్యక్తిగత జీవితం, ఆస్తి తగాదాలతో మళ్లీ బీటౌన్‌లో చర్చనీయాంశంగా మారింది రాజేష్‌ఖన్నా పేరు. 2012లో చనిపోయే ముందు వీలునామాలో తన ఆస్తి మొత్తాన్ని భార్య డింపుల్ కపాడియాను మినహాయించి కుమార్తెలు ట్వింకిల్, రింకేలకు పంచిపెట్టడంపై.. పుష్కర కాలం గడిచాక రాజేష్‌ఖన్నా లివింగ్ పార్ట్‌నర్, నటి అనితా అద్వానీ కోర్టుమెట్లెక్కింది. 10 ఏళ్లకు పైగా రాజేష్ ఖన్నా బాగోగులు చూసుకున్నందుకు చట్టపరమైన పరిహారం అందించాలని ఇప్పుడు కోరడం వివాదానికి దారి తీసింది.
1969-71 మధ్య వరసగా 15 బ్లాక్‌బస్టర్‌లతో భారతీయ సినిమాపై చెరగని ముద్ర వేశారు రాజేష్‌ఖన్నా. సన్నిహితులు ఆయనని ప్రేమగా కాకా అని పిలుస్తుంటారు. విపరీతమైన ఫ్యాన్‌ఫాలోయింగ్‌తో బాలీవుడ్ తొలి సూపర్‌స్టార్‌గా ఖ్యాతికెక్కిన ఖన్నా.. వృత్తిపరంగా, వ్యక్తిగత వివాదాలతోనూ సంచలనం సృష్టించాడు. తర్వాత 15ఏళ్ల వయసున్న డింపుల్ కపాడియాను పెళ్లి చేసుకోవడం అప్పట్లో ఓ సంచలనం. పరిశ్రమలో అడుగుపెట్టిన తొలినాళ్లలోనే స్టార్‌డమ్ అందుకున్న ఈ బాలీవుడ్ సూపర్‌స్టార్.. తర్వాత వరస ఫ్లాపులు, వ్యక్తిగత వివాదాలతో పతనమవడం అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. చివరిదశలో నటి అనితా అద్వానీతో సహజీవనం చేయడం చాలామందికి తెలిసిందే.
2012లో మరణానికి ఒక నెల ముందు తన ఐకానిక్ బంగ్లా, ఇతర ఆస్తులను కుమార్తెలు ట్వింకిల్, రింకేలకు పేరిట వీలునామాలో రాశారు రాజేష్‌ఖన్న. ఇందులో భార్య డింపుల్ కపాడియా, లివింగ్ పార్ట్‌నర్ అనితా అద్వానీల పేరు చేర్చలేదు. అయినా, అప్పట్లో ఈ విషయంపై ఎక్కడా మాట్లడలేదు అనితా. కానీ, దాదాపు 12 ఏళ్లు గడిచాక తన హక్కులను క్లెయిమ్ చేస్తూ అతడి కుటుంబానికి లీగల్ నోటీసులు అందించడం బీటౌన్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనితా అద్వానీ ఇలా చెప్పారు. 'రాజేష్‌ఖన్నాపై ప్రేమతో ఒంటరిగా జీవిస్తున్న ఆయనకు చివరిరోజుల వరకూ తోడుగా ఉండి బాగోగులు చూసుకున్నాను. అంత్యక్రియల సమయంలో రాజేష్ కుటుంబం దూరంగా పెట్టినా, డబ్బు పరంగా ఎలాంటి సాయం అందకపోయినా అప్పట్లో పట్టించుకోలేదు. ఆశీర్వాద్ బంగ్లాను మ్యూజియంగా మార్చాలనేది ఆయన కల. ఈ విషయం విస్మరించినందుకే ఆయన కుటుంబానికి 12 ఏళ్ల తర్వాత ఎస్టేట్ హక్కుల కోసం లీగల్ నోటీసులు పంపాను'.
భారతీయ చలనచిత్ర చరిత్రలో గొప్ప నటులలో ఒకరిగా పరిగణించబడుతున్న రాజేష్ ఖన్నా 'ఆరాధన', 'ఆనంద్', 'అమర్ ప్రేమ్' 'ఇన్సాఫ్ మెయిన్ కరూంగా', 'అగర్ తుమ్ నా హోతే', 'అవతార్', 'డిస్కో డాన్సర్', 'దర్ద్' వంటి చిత్రాలలో అనేక చిరస్మరణీయ పాత్రలకు ప్రాణం పోశారు. భారతీయ సినిమాకు నటుడిగా ఎనలేని కృషి అభిమానుల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయారు.
Updated Date - Dec 30 , 2024 | 02:36 PM