Kolkata Doctor Case: న్యాయం కోసం రక్షాబంధన్ సందర్భంగా వినూత్న నిరసన..
ABN, Publish Date - Aug 19 , 2024 | 07:14 AM
కోల్‌కతాలోని ఆర్‌జి కర్ వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తమకు న్యాయం చేయాలని, భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ వైద్యులు ఆందోళన చేస్తున్నారు.
కోల్‌కతాలోని ఆర్‌జి కర్ వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తమకు న్యాయం చేయాలని, భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ వైద్యులు ఆందోళన చేస్తున్నారు. బాధితురాలికి న్యాయం చేయాలని రెండు రోజుల క్రితం కోల్‌కతా, ఢిల్లీ, ముంబై సహా పలు నగరాల్లో రీక్లైమ్ ది నైట్‌కు పిలుపునిచ్చారు. అర్ధరాత్రి మహిళలు టార్చ్‌లు పట్టుకుని రోడ్డుపైకి వచ్చారు. మహిళలకు భద్రత కల్పించాలని, బాధితురాలికి న్యాయం చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ప్రస్తుతం రక్షా బంధన్ వేడుకను నిరసనలకు వేదికగా చేసుకోవాలని విద్యార్థి సంఘాలు, వైద్య విద్యార్థులు నిర్ణయించారు. కోల్‌కతాలోని జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం, కలకత్తా విశ్వవిద్యాలయానికి చెందిన వామపక్ష విద్యార్థి సంఘాలు తిలోతమ రాఖీ బంధన్ కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. కోల్ కతాతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో రక్షాబంధన్ వేడుక సందర్భంగా నిందితులను కఠినంగా శిక్షించి.. బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ నిరసన తెలియజేయనున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు రాఖీ రూపంలో నల్ల దారం కట్టి నిరసన తెలుపనున్నారు.
భారీ మానవహారం..
ఆర్‌జి కర్ వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం కేసులో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ బెంగాల్‌లోని జాయింట్ ఫోరమ్ ఆఫ్ డాక్టర్స్ పిలుపు మేరకు సోమవారం ఉదయం 11 గంటలకు రక్షా బంధన్‌ను నిరసిస్తూ.. భారీ ఎత్తున మానవహారం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలంతా సామూహికంగా మానవహారం కార్యక్రమం నిర్వహించి అభయ హంతకులను శిక్షించాలని డిమాండ్ చేయాలని డాక్టర్స్ జాయింట్ ఫోరమ్ ప్రజలకు పిలుపునిచ్చింది.
బీజేపీ ఆధ్వర్యంలో..
పశ్చిమబెంగాల్ వ్యాప్తంగా రక్షా బంధన్‌ను నిర్వహించాలని బెంగాల్ బీజేపీ మహిళా మోర్చా నిర్ణయించింది. మహిళల భద్రత కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. మరోవైపు పశ్చిమబెంగాల్‌లో నిరసనలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ బీజేపీ రాష్ట్రశాఖ కోర్టును ఆశ్రయించనుంది. మహిళలపై అఘాయిత్యాలకు నిరసనగా ఆగస్టు 20 నుంచి 23వ తేదీ వరకు బీజేపీ ఆధ్వర్యంలో నిరంతర ధర్నా కార్యక్రమం ఉంటుందని ఆ పార్టీ నాయకులు ప్రకటించారు. ఆగస్టు 20న రాష్ట్ర నాయకత్వంతో పాటు ప్రతిపక్ష నేత సువేందు అధికారి, ఇతర బీజేపీ ఎమ్మెల్యేలు ధర్నాలో పాల్గొంటారు. రాష్ట్ర బీజేపీ నేతలు, ఎంపీలు ఆగస్టు 21న నిరసన దీక్షలు చేపట్టనున్నారు. ఆగస్టు 22వ తేదీన జరిగే నిరసనలో బిజెపికి చెందిన అన్ని విభాగాలకు చెందిన కార్యకర్తలు పాల్గొంటారని ఆ పార్టీ నాయకులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More National News and Latest Telugu News
Updated Date - Aug 19 , 2024 | 07:14 AM