Election Manifesto : హేమాహామీలు
ABN, Publish Date - Nov 11 , 2024 | 05:18 AM
పదిరోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రలో.. అధికార కూటమి మహాయుతి, విపక్ష మహా వికాస్ ఆఘాఢీ(ఎంవీఏ) ఓటర్లపై వరాల జల్లులు కురిపించాయి.
మహారాష్ట్ర ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకటించిన మహాయుతి, ఎంవీఏ
ఉచిత రేషన్, మహిళా భద్రత
రుణమాఫీలు, ఉద్యోగాల కల్పన
వృద్ధాప్య, మహిళా పింఛన్ల పెంపు
పోటాపోటీగా కూటముల హామీలు
20 లక్షల మంది విద్యార్థులకు..నెలకు 10 వేల స్టైపెండ్: అమిత్‌షా
రాయితీపై ఏటా 6 గ్యాస్ సిలిండర్లు
18 ఏళ్ల యువతులకు లక్ష సాయం
100 యూనిట్ల ఉచిత విద్యుత్తు
రూ.4 వేల నిరుద్యోగ భృతి: ఖర్గే
ముంబై, నవంబరు 10: పదిరోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రలో.. అధికార కూటమి మహాయుతి, విపక్ష మహా వికాస్ ఆఘాఢీ(ఎంవీఏ) ఓటర్లపై వరాల జల్లులు కురిపించాయి. మహాయుతి తరఫున ‘సంకల్ప్ పత్ర’ పేరుతో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఎంవీఏ తరఫున ‘మహారాష్ట్రనామ’ పేరుతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదివారం ఈ మేరకు తమ మ్యానిఫెస్టోలను ప్రకటించారు. యువత, పేదలు, రైతులు, మహిళాభివృద్ధి, ఉద్యోగాల కల్పనకు ఇరు కూటములు ప్రాధాన్యతనివ్వడం గమనార్హం..! నైపుణ్య గణన నిర్వహించి, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తామని అమిత్‌షా.. నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిరోధానికి బాలికలకు ఉచితంగా టీకాల కార్యక్రమాన్ని ఖర్గే ప్రకటించారు. మహారాష్ట్రలో మతమార్పిడులను నిరోధించేలా కఠిన చట్టాలను తెస్తామని షా.. కులగణన నిర్వహించి తీరుతామని ఖర్గే ఉద్ఘాటించారు. కాగా.. ఈ నెల 20న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. 23న ఫలితాలు విడుదలవుతాయి.
మహాయుతి హామీలివే..
వృద్ధాప్య పింఛన్లు రూ.2,100కు పెంపు
‘లడ్కీ బెహన్ స్కీమ్’ కింద ప్రతి నెల ఇస్తున్న రూ.1500ను రూ.2100కు పెంపు
2027నాటికి రాష్ట్రంలో 50లక్షల మంది మహిళలను లక్షాధికారులను చేయడం
స్కిల్ సెన్సస్ నిర్వహించి, పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా యువతకు శిక్షణ
యువతకు 25 లక్షల కొత్త ఉద్యోగాల కల్పన
20 లక్షల మంది విద్యార్థులకు నెలకు రూ.10 వేల చొప్పున స్టైపండ్
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కృత్రిమ మేధ(ఏఐ) శిక్షణ
వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు ఆర్థిక సాయం
45వేల గ్రామాలకు కొత్త రోడ్ల నిర్మాణం.. ప్రజలకు ఆరోగ్య బీమా
వ్యవసాయ రుణాల మాఫీ, ఆహార భద్రతకు హామీ, నిత్యావసర వస్తువుల ధరల స్థిరీకరణ. ఎరువులపై ఎస్‌జీఎస్టీ తిరిగి చెల్లింపు.
పునరుత్పాదక ఇంధనంపై దృష్టిసారిస్తూ విద్యుత్తు బిల్లులను 30ు మేర తగ్గించేందుకు చర్యలు
అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ‘విజన్ మహారాష్ట్ర 2028’ విడుదల
50 లక్షల మంది మహిళలను 2027లోగా లక్షాధికారులను చేయడం
మహారాష్ట్రను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం
ఎంవీఏ హామీలు..
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిరోఽధానికి 9-16 సంవత్సరాల వయసుగల బాలికలకు ఉచితంగా టీకాల పంపిణీ
రాష్ట్రంలో కులగణన
మహిళా ఉద్యోగులకు రుతుస్రావ సమయంలో రెండు ఐచ్ఛిక సెలవులు
స్వయం సహాయక బృందాల(ఎ్‌సహెచ్‌జీ) సాధికారతకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ
మహిళలకు ఏటా రూ.500కే ఆరు గ్యాస్ సిలిండర్లు
మహిళా భద్రతకు ‘నిర్భయ్ మహారాష్ట్ర’ పాలసీ
18వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న బాలికలకు రూ.లక్ష ఆర్థిక సాయం
రైతులకు రూ.3 లక్షల వరకు రుణమాఫీ. సక్రమంగా రుణాలను తిరిగి చెల్లించేవారికి రూ.50 వేల ప్రోత్సాహకం
యువజన సంక్షేమానికి యూత్ కమిషన్ ఏర్పాటు. డిప్లొమా, డిగ్రీ పూర్తిచేసిన నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి
2.5 లక్షల ప్రభుత్వ కొలువుల భర్తీ
ఎంఎ్‌సఎంఈలకు చేయూతనిచ్చేందుకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ
ప్రతినెలా 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు. నెలకు 300 లోపు యూనిట్లు వాడేవారికి వర్తింపు.
Updated Date - Nov 11 , 2024 | 05:22 AM