Sachin's Aunt Anabel Mehta: కాబోయే అల్లుడు ఆరడుగులు ఉంటాడనుకున్నా!
ABN, Publish Date - Aug 12 , 2024 | 04:33 AM
పాలబుగ్గల పసివాడిగా క్రీజులో అడుగుపెట్టి.. మొనగాళ్లలాంటి బౌలర్ల పనిపట్టి.. రికార్డులను కొల్లగొట్టి.. చరిత్రలో తనకెవరూ సాటిలేరని చాటిన మేటి క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గురించి క్రికెట్ అభిమానులందరికీ తెలిసిందే.
5.55 అడుగుల సచిన్‌ను చూసి ఆశ్చర్యపోయా
మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు
అప్పటికి అతడికి 19 ఏళ్లే.. రెండేళ్లు ఆగమన్నాం..
ఈ వ్యవధిలో మా ఇంటికి తరచూ వచ్చేవాడు
మీడియా అంతా అంజలి ఫొటో కోసం వెతికింది
క్రికెట్ దిగ్గజం సచిన్ అత్త అనాబెల్ మెహతా!
(సెంట్రల్ డెస్క్)
పాలబుగ్గల పసివాడిగా క్రీజులో అడుగుపెట్టి.. మొనగాళ్లలాంటి బౌలర్ల పనిపట్టి.. రికార్డులను కొల్లగొట్టి.. చరిత్రలో తనకెవరూ సాటిలేరని చాటిన మేటి క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గురించి క్రికెట్ అభిమానులందరికీ తెలిసిందే. అయితే, అతడి ప్రేమకు సంబంధించిన అత్యంత వ్యక్తిగత విషయం ఒకదాన్ని బయటపెట్టారు టెండూల్కర్ అత్త అనాబెల్ మెహతా.
తన కుమార్తె డాక్టర్ అంజలి-సచిన్ ప్రేమ వివాహానికి ముందు జరిగిన ఈ ఘటనను ‘‘మై పాసేజ్ టు ఇండియా: ఎ మెమోయిర్’’ పుస్తకంలో ఆమె వివరించారు. అప్పట్లో ఏం జరిగిందో అనాబెల్ మాటల్లోనే.. అంజలి ఓ కుర్రాడితో ప్రేమలో ఉందని తెలిసి అతడిని చూడాలనుకున్నా. నా సోదరుడు రిచర్డ్ ఇంట్లో కలిసేందుకు ఏర్పాటు చేశాం. వచ్చే కుర్రాడు ఆరడుగుల ఎత్తుతో, అందంగా ఉంటాడని ఊహించుకున్నా. కానీ, వచ్చింది 19 ఏళ్ల సచిన్ టెండూల్కర్.
దీంతో ఆశ్చర్యపోయా. అతడు పిల్లాడిలా కనిపించాడు. మృదు స్వభావి, తక్కువగా మాట్లాడుతూ సిగ్గు పడుతున్నాడు. సచిన్‌తో ఒంటరిగా మాట్లాడేందుకు.. అంజలి, రిచర్డ్‌ను వెళ్లిపొమ్మన్నా. నా భర్త ఆనంద్ మెహతాకు సచిన్ గురించి తెలుసు కాబట్టి ఆయన నుంచి అభ్యంతరం లేదు. సచిన్ అప్పటికే సూపర్ స్టార్. ఇలా పేరువచ్చిన చాలామంది తర్వాత దారి తప్పడంతో నా మనసులో భయాందోళన నెలకొంది. ఇంతలో అసలు సంగతి గుర్తొచ్చింది.
‘అంజలి గురించి నీ ఉద్దేశం ఏమిటి?’ అని సచిన్ కళ్లలోకి చూస్తూ ప్రశ్నించా. ‘‘మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం’’ అని చెప్పాడు. దీంతో కొంత ఆశ్చర్యపోయా. 5.5 అడుగులకు కొంచెం ఎక్కువగా సచిన్ మా అమ్మాయి కంటే కాస్త ఎత్తు అంతే. బహుశా అతడి రింగుల జుట్టు అంగుళం ఎత్తు ఎక్కువ కనిపించేలా చేస్తుందేమో? అంజలి హీల్స్ వేసుకుంటే మాత్రం సచిన్ కంటే ఎత్తుగా కనిపించడం ఖాయం.
ఇక తనను చూసిన మొదటిసారే ప్రేమలో పడినట్లు సచిన్ చెప్పాడని అంజలి తెలిపింది. వారిద్దరూ గాఢమైన ప్రేమలో ఉన్నారని నాకర్థమైంది. కూతురు సంతోషమే కోరుకున్నా. కానీ, భారత్‌లో యువకులకు పెళ్లి వయసు 21. సచిన్‌కు అప్పటికి 19 ఏళ్లే. అంజలి మెడిసిన్ పీజీ పూర్తి చేయాల్సి ఉంది. అందుకనే మరో రెండేళ్లు ఆగాలని.. అప్పటివరకు ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని సచిన్‌ను కోరా.
దొంగచాటుగా మా ఇంటికి..
పెళ్లికి అంగీకారం తెలిపాక.. వార్డెన్ రోడ్‌లోని మా ఇంటికి సచిన్ వచ్చేవాడు. మా మరదలు తులసి ఒకసారి వాచ్‌మన్ కుమారుడు అనుకుని భ్రమపడింది. వీధిలో శనగలు అమ్మే వ్యక్తి, సమీపంలోని అమెరికన్ కాన్సులేట్ భద్రతా సిబ్బంది తప్ప టెండూల్కర్‌ను ఎవరూ గుర్తుపట్టేవారు కాదు.
కానీ, వీరెవరూ మీడియాకు చెప్పలేదు. న్యూజిలాండ్ టూర్‌లో ఉన్న సచిన్ కాల్ చేయడంతో పెళ్లి గురించి అంజలి కాస్త గట్టిగా అడిగింది. దీంతో తన తల్లిదండ్రులతో మాట్లాడమని అతడు సూచించాడు.
సచిన్ అన్నయ్య అజిత్ చొరవతో అంజలి వారి తల్లిదండ్రులను కలిసింది. మేము మాత్రం నిశ్చితార్థం ముందువరకు కలవలేదు. సమావేశమయ్యాక.. వారి కట్టుబాట్లు, మధ్య తరగతి, ప్రశాంత జీవితం చూసి మేం సంతోషించాం.
సరిగ్గా సచిన్ పుట్టిన రోజునే నిశ్చితార్థం
సచిన్-అంజలి నిశ్చితార్థం సరిగ్గా సచిన్ 21వ పుట్టిన రోజు (1994 ఏప్రిల్ 24)న జరిగింది. 25 మంది బంధువులనే పిలిచాం. తర్వాత మీడియాకు తెలియజేశాం. అంతే.. గగ్గోలు రేగింది.
ఎవరీ అంజలి? అంటూ వెదుకులాట మొదలుపెట్టారు. 16 ఏళ్ల వయసులో అంజలి కాలేజీలో చేరినపుడు ఇచ్చిన ఫొటో మాత్రమే వారికి దొరికింది. ఇక తమ కలల రాకుమారుడు సచిన్‌కు పెళ్లి కుదిరిందని తెలిసి లక్షలమంది అమ్మాయిల హృదయం ముక్కలైంది. ఇప్పుడు తలుచుకుంటే చాలా ఆనందంగా ఉంది. కోట్లాదిమంది ఆరాధించే క్రికెటర్‌కు అత్తగా గర్వపడుతూ.. కూతురు ప్రేమను అంగీకరించిన తల్లిగా ఆనందిస్తున్నా.
ఞ అనాబెల్ (84) బ్రిటన్‌కు చెందినవారు. సోషియాలజీ చదివారు. 1966లో ఆనంద్ మెహతాను పెళ్లాడాక ముంబైలో స్థిరపడ్డారు. అప్నాలయ పేరిట స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నారు.
Updated Date - Aug 12 , 2024 | 08:34 AM