రాజకీయాలకు పవార్ గుడ్‌బై!
ABN, Publish Date - Nov 06 , 2024 | 04:16 AM
ఆరు దశాబ్దాలకు పైగా మహారాష్ట్రలో, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న మరాఠా యోధుడు, ఎన్‌సీపీ (ఎస్‌పీ) అధినేత శరద్ పవార్ (84) పార్లమెంటరీ రాజకీయాలకు గుడ్‌బై చెప్పనున్నారా..? తిరిగి రాజ్యసభకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారా..? గత కొద్ది రోజులుగా ఆయన ప్రసంగాలు విన్న వారంతా ఇదే చర్చించుకుంటున్నారు.
బారామతిలో ‘రిటైర్మెంట్’ సంకేతాలు
ఇక ఏ ఎన్నికల్లో పోటీచేయను.. రాజ్యసభకు వెళ్లడంపైనా పునరాలోచిస్తానని వ్యాఖ్యలు
బారామతి, నవంబరు 5: ఆరు దశాబ్దాలకు పైగా మహారాష్ట్రలో, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న మరాఠా యోధుడు, ఎన్‌సీపీ (ఎస్‌పీ) అధినేత శరద్ పవార్ (84) పార్లమెంటరీ రాజకీయాలకు గుడ్‌బై చెప్పనున్నారా..? తిరిగి రాజ్యసభకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారా..? గత కొద్ది రోజులుగా ఆయన ప్రసంగాలు విన్న వారంతా ఇదే చర్చించుకుంటున్నారు. మంగళవారం బారామతిలో ప్రచారం సందర్భంగా స్వయంగా రిటైర్మెంట్ సంకేతాలు ఇచ్చారు. తన రాజకీయ జీవితానికి ఎక్కడో ఒక చోట ముగింపు పలకాల్సిందేనని వ్యాఖ్యానించారు. మరో ఏడాదిన్నరలో రాజ్యసభ ఎంపీగా తన పదవీకాలం ముగియనుందని.. ఆ తర్వాత మళ్లీ పెద్దల సభలో అడుగుపెట్టాలా వద్దా అనేదానిపై ఆలోచన చేయాల్సి ఉందని, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక ఆ దిశగా ఆలోచిస్తానని తెలిపారు.
‘మీరు (ప్రజలు) నన్ను ఒకసారి కాదు.. రెండు సార్లు కాదు.. నాలుగు సార్లు సీఎంను చేశారు. 1967లో తొలిసారి నన్ను ఎన్నుకున్నారు. 14 సార్లు పోటీచేశాను. మీరు ఏనాడూ నన్ను ఇంటికి పంపించలేదు. ప్రతిసారీ గెలిపించారు. ఇక నేను ఎక్కడో ఒక చోట ఆగిపోవాలి. కొత్త తరాన్ని ముందుకు తీసుకురావాలి. మహారాష్ట్ర కోసం పనిచేయడానికి ముందు బారామతిలో 25 ఏళ్లు ఉన్నాను. తర్వాత స్థానిక అధికారాలన్నీ అజిత్ దాదా(అజిత్ పవార్)కు అప్పగించాను. ఆయన కూడా 25-30 ఏళ్లు ఈ ప్రాంతంలో బాగా పనిచేశారనడంలో సందేహం లేదు. నేనెవరినీ తొక్కివేయలేదు’ అని పవార్ అన్నారు.
Updated Date - Nov 06 , 2024 | 04:17 AM