Speaker of the Eighteenth Lok Sabha : లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా
ABN, Publish Date - Jun 27 , 2024 | 03:14 AM
పద్దెనిమిదో లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యారు. 48 ఏళ్ల తర్వాత మళ్లీ లోక్‌సభ సభాధ్యక్ష పదవికి ఎన్నిక జరగ్గా.. ఓం బిర్లా మూజువాణి ఓటుతో విజయం సాధించారు.
రాహుల్ ఇలా.. మరి జగన్?
లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికైన ఓంబిర్లాను ప్రధాని మోదీతోపాటు రాహుల్ గాంఽధీ సభాపతి స్థానం వద్దకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు. విపక్షం తరఫున అభ్యర్థిని నిలబెట్టినప్పటికీ... రాహుల్ హుందాగా ప్రవర్తించారు. కానీ.. ఏపీలో జగన్ స్పీకర్ ఎంపిక ప్రక్రియలోనే పాల్గొనలేదు. కనీస సభా మర్యాద పాటించలేదు.
వరుసగా రెండోసారి లోక్‌సభాధ్యక్ష పదవి
మూజువాణి ఓటుతో విజయం
మీ చిరునవ్వుతో లోక్‌సభలో ఆనందం వెల్లివిరుస్తుంది
చరిత్రలోనే స్వర్ణయుగానికి మీరు నేతృత్వం వహిస్తున్నారు
ఓం బిర్లాపై ప్రధాని మోదీ ప్రశంసలు
విపక్షాలకూ అవకాశమివ్వండి
ఓం బిర్లాను కోరిన రాహుల్ గాంధీ
సస్పెన్షన్ల పర్వం కూడదన్న విపక్షాలు
మోదీ, రాహుల్ పరస్పర కరచాలనం
ఎమర్జెన్సీ, ఇందిరపై స్పీకర్ విమర్శలు
భగ్గుమన్న కాంగ్రెస్, ప్రతిపక్షాలు
సభ వెలుపల బీజేపీ ఆందోళనలు
న్యూఢిల్లీ, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): పద్దెనిమిదో లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యారు. 48 ఏళ్ల తర్వాత మళ్లీ లోక్‌సభ సభాధ్యక్ష పదవికి ఎన్నిక జరగ్గా.. ఓం బిర్లా మూజువాణి ఓటుతో విజయం సాధించారు. దీంతో వరుసగా రెండోసారి సభాధ్యక్షులుగా ఎన్నికైన ఐదో స్పీకర్‌గా ఓం బిర్లా గుర్తింపు పొందారు. బుధవారం ఉద యం 11 గంటలకు సభ ప్రారంభమయ్యాక.. ఓంబిర్లా పేరును ప్రతిపాదిస్తూ ప్రధాని మోదీ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తోపాటు.. కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్‌నాయుడు,
టీడీపీపీనేత లావు శ్రీకృష్ణదేవరాయలు, పలువురు ఎన్డీ యే ఎంపీలు ఈ తీర్మానాన్ని బలపరిచారు. ఇండియా కూటమి తరఫున కె.సురేశ్ పేరును ప్రతిపాదిస్తూ శివసేన(ఉద్ధవ్ వర్గం) ఎంపీ అరవింద్ సావంత్ తీర్మానాన్ని తీసుకురాగా.. విపక్ష కూటమి ఎంపీలు బలపరిచారు. అనంతరం మూజువాణి ఓటుతో ఓం బిర్లా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్ ప్రకటించారు. ఆ వెంటనే ప్రధాని మోదీ లేచి.. ఓం బిర్లా వద్దకు వెళ్లి, ఆయనకు అభినందనలు తెలిపారు. ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఓం బి ర్లా వద్దకు వెళ్తుండగా.. మోదీ ఆయనను రమ్మంటూ ఆహ్వానించారు. వీరిద్దరూ కలిసి ఓం బిర్లాకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మోదీ,
రాహుల్ కరచాలనం చేసుకున్నారు. ఆ తర్వాత పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు వీరిద్దరితో కలిసి ఓం బిర్లాను స్పీకర్ స్థానం వద్దకు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఓం బిర్లా మాట్లాడుతూ సభలో సంప్రదాయాలు, విలువలను కాపాడతానన్నారు. సభలో భిన్నాభిప్రాయాలు, విమర్శలు ఉండొచ్చని, అయితే.. లోక్‌సభ కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకాలను ఏర్పరచకూడదని కోరారు. సభను అడ్డంకులు లేకుం డా నడపాలన్నదే తన అభిమతమన్నారు.
ప్రతిపక్షాలు ఇచ్చే నిర్మాణాత్మక సూచనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘ఒక పార్టీ నుంచి ఒకేఒక్క సభ్యుడున్నా.. అతనికి కూడా మాట్లాడే సమయం దక్కాలి. ప్రతి ఒక్కరూ పార్లమెంటరీ సంప్రదాయాలను పాటించాలి. అలా జరగని పక్షంలో.. కొన్నిసార్లు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. నేనెప్పుడూ ఏ సభ్యుడికి వ్యతిరేకంగా ప్రవర్తించాలని కోరుకోను’’ అని స్పష్టం చేశారు. అనంతరం లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా రాహుల్‌గాంధీ నియామకాన్ని ఆమోదిస్తూ పార్లమెం ట్ వ్యవహారాల శాఖ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. పార్లమెంట్ చట్టం-1977 ప్రకారం ఆయనకు అన్ని రకాల వసతులను కల్పించనున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది.
ప్రధాని మోదీ ప్రశంసలు
ఓం బిర్లా రెండోసారి స్పీకర్‌గా ఎన్నికవ్వడంతో ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మీ చిరునవ్వుతో సభలో ఆనందం వెల్లివిరుస్తుంది. మీ చిరునవ్వు సభను ఎల్లప్పుడూ సంతోషకర వాతావరణంలో ఉంచుతుంది. కొన్ని దశాబ్దాలుగా సభాపతిగా పనిచేసిన వారంతా ఎటువంటి పోటీని ఎదుర్కోలేదు. కానీ మీరు ఎన్నికల్లో గెలిచి, చరిత్ర సృష్టించారు. చరిత్రలోనే స్వర్ణయుగానికి మీరు నేతృత్వం వహిస్తున్నారు.
కొత్తగా లోక్‌సభకు ఎన్నికైన వారికి మీ పనితీరు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆశిస్తున్నాను’’ అని వ్యాఖ్యానించారు. ‘‘గత ఐదేళ్లలో స్పీకర్‌గా మీ హయాంలో సభ 97ు ఉత్పాదకతను సాధించింది. పాతికేళ్లలోనే ఇది అత్యధికం. ఇది ఒక భవనం.. నాలుగు గోడలే కాదు. 140 కోట్ల ప్రజల ఆశాకిరణం. వచ్చే ఐదేళ్లు మీరు సభ్యులందరి కీ మార్గదర్శనం చేస్తారని విశ్వసిస్తున్నాను’’ అని మోదీ అన్నారు.
విపక్షాలకు అవకాశం ఇవ్వాలన్న రాహుల్
ప్రజావాణిని బలంగా వినిపించేందుకు విపక్షాలకు అవకాశం ఇవ్వాలని లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పీకర్‌ను కోరారు. ఓం బిర్లాకు ఇండియా కూటమి తరఫున శుభాకాంక్షలు చెప్పారు. లోక్‌సభ భారతదేశ ప్రజల స్వరాన్ని వినిపించాలని ఆకాంక్షించారు. ‘‘ప్రభుత్వానికి రాజకీయంగా బలం ఉండొచ్చు. విపక్షాలు ప్రజావాణికి ప్రాతినిధ్యం వహిస్తాయి.
సభ సజావుగా సాగడానికి ప్రతిపక్షం సహకరిస్తుంది. గతంతో పోలిస్తే.. ఈ సారి మంచి వాతావరణంలో సభ నడుస్తుందని ఆశిస్తున్నాను. సభను ఎంత సమర్థంగా నడుపుతున్నామనేది ముఖ్యం కా దు. ఈ సభలో దేశ ప్రజల స్వరాన్ని ఎంతవరకు వినిపిచేందుకు అవకాశం ఇస్తున్నామనేది ముఖ్యం. ప్రజా సమస్యలను బలంగా వినిపించేందుకు విపక్షాలకు అవకాశం ఇస్తారని ఆశిస్తున్నాను’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు.
నేడు రాష్ట్రపతి ప్రసంగం
న్యూఢిల్లీ, జూన్ 26: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం పార్లమెంట్ ఉభయసభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. గత సోమవారం లోక్‌సభ తొలి సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. గురువారం రాజ్యసభ 264వ సెషన్ ప్రారంభం కానుంది. గురువారం రాష్ట్రపతి భవన్ నుంచి రాష్ట్రపతి ముర్ము పార్లమెంట్‌కు చేరుకుంటారు. పార్లమెంట్ బిల్డింగ్ గజ ద్వారం వద్ద ఆమెకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు లోక్‌సభ, రాజ్యసభల ప్రిసైడింగ్ అధికారులు స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి ఆమెను సాంప్రదాయ రాజదండం ‘సెంగోల్’తో లోక్‌సభ చాంబర్‌కు తీసుకువెళతారు. కాగా, జూలై 2-3 తేదీల్లో ప్రధాని మోదీ.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మాణంపై చర్చ సందర్భంగా మాట్లాడే అవకాశం ఉంది.
Updated Date - Jun 27 , 2024 | 05:39 AM