రైతు సమస్యలపై సుప్రీం కోర్టు కమిటీ
ABN , Publish Date - Sep 03 , 2024 | 03:14 AM
పంట ఉత్పత్తుల మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలన్న ప్రధాన డిమాండ్‌తో శంభూ సరిహద్దులో ఏడాది కాలంగా ఆందోళనలు నిర్వహిస్తున్న రైతులతో చర్చల కోసం సుప్రీంకోర్టు ఉన్నతస్థాయి కమిటీని నియమించింది.
న్యూఢిల్లీ, సెప్టెంబరు 2: పంట ఉత్పత్తుల మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలన్న ప్రధాన డిమాండ్‌తో శంభూ సరిహద్దులో ఏడాది కాలంగా ఆందోళనలు నిర్వహిస్తున్న రైతులతో చర్చల కోసం సుప్రీంకోర్టు ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. పంజాబ్-హరియాణా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ నవాబ్ సింగ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ వారం రోజుల్లోగా శంభూలోని రైతులతో సమావేశం కావాలని ఆదేశించింది.
రైతులతో చర్చించి వారు హైవేపై అడ్డుగా పెట్టిన ట్రాక్టర్లు, ట్రాలీలను తొలగించేలా ఒప్పించాలని సూచించింది. రైతులు రాజకీయాల నుంచి దూరంగా ఉండాలని, నిరసన ప్రదర్శనలను రాజకీయం చేయవద్దని వ్యాఖ్యానించింది. కమిటీలో రిటైర్ట్ ఐపీఎస్ ఆఫీసర్ బీఎస్ సంధూ, ప్రొఫెసర్ రంజిత్ సింగ్, పంజాబ్ వ్యవసాయ వర్సిటీ ఆర్థికవేత్త సుఖ్‌పాల్ సింగ్, మొహాలీకి చెందిన ప్రొఫెసర్ దేవీందర్ శర్మ ఉన్నారు. హరియాణా అగ్రికల్చర్ వర్సిటీ వీసీ కాంబోజ్‌ను ప్రత్యేక ఆహ్వానితుడిగా పరిగణిస్తూ అవసరమైతే ఆయన సూచనలు కూడా తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.