ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కోర్టు మారినా.. విషయం మారదు కదా?

ABN, Publish Date - Sep 03 , 2024 | 03:47 AM

‘‘కేసును విచారించే కోర్టు మారినా.. విషయం మారదు కదా?’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఓటుకు నోటు కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ దాఖలైన వ్యాజ్యంపై అత్యున్నత న్యాయస్థానం పైవిధంగా స్పందించింది.

  • ఓటుకు నోటు కేసు.. బదిలీ పిటిషన్‌పై సుప్రీంకోర్టు వ్యాఖ్య

  • కవితకు బెయిల్‌ వ్యాఖ్యలపై పిటిషనర్ల ఐఏ దాఖలు

  • 2 వారాల్లో జవాబు చెప్పాలి.. సీఎం రేవంత్‌కు బెంచ్‌ ఆదేశాలు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ‘‘కేసును విచారించే కోర్టు మారినా.. విషయం మారదు కదా?’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఓటుకు నోటు కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ దాఖలైన వ్యాజ్యంపై అత్యున్నత న్యాయస్థానం పైవిధంగా స్పందించింది. ఓటుకు నోటు కేసును తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలని కోరుతూ జనవరి 31న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు జగదీశ్‌ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్‌, మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్‌, మహమూద్‌ అలీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై సోమవారం జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది.

తెలంగాణ ప్రభుత్వం తరపున ముకుల్‌ రోహత్గి, సిద్దార్థ లూథ్ర, మేనకా గురుస్వామీ.. పిటిషనర్ల తరఫున ఆర్యమ సుందరం, దామా శేషాద్రినాయుడు, మోహిత్‌రావు వాదనలను వినిపించారు. తొలుత పిటిషనర్ల తరఫున ఆర్యమ సుందరం వాదనలను వినిపిస్తూ.. కవితకు సుప్రీంకోర్టు బెయిల్‌ ఇవ్వడంపై తెలంగాణ కాంగ్రెస్‌ అధికారిక సోషల్‌ మీడియా ద్వారా జరిగిన ప్రచారంపై ఇంటర్‌లోకేటరీ అప్లికేషన్‌(ఐఏ) దాఖలు చేశామని, దానిని ఒకసారి పరిశీలించాలని కోరారు. తెలంగాణ కాంగ్రెస్‌ అధికారిక ఎక్స్‌ ఖాతా ద్వారా న్యాయవాదులు, న్యాయమూర్తుల ప్రతిష్ఠను దెబ్బతీసేలా ప్రచారం చేశారని వివరించారు. అందుకు సంబంధించిన ఫొటో కాపీలను ఐఏలో పొందుపరిచామని స్పష్టంచేశారు. ఐఏపై జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ స్పందిస్తూ.. ‘‘కోర్టులు, న్యాయమూర్తులను రాజకీయాల్లోకి ఎందుకు లాగుతున్నారు?’’ అంటూ తెలంగాణ ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాదులను ఉద్దేశించి ప్రశ్నించారు.


  • రేవంత్‌ రెడ్డి వద్దే హోంశాఖ

ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్‌ రెడ్డి వద్దే హోం శాఖ ఉందని న్యాయవాది ఆర్యమ సుందరం మరోసారి ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. కేసులో దర్యాప్తు చేస్తున్న ఏసీబీ సైతం హోంశాఖ పరిధిలోకి వస్తుందని, అధికారులు కూడా సీఎంకే నివేదించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ.. కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేసినా.. అధికారులు మాత్రం ఆయనకు చెప్పిన తర్వాతే కోర్టుకు నివేదిస్తారు కదా? అని ప్రశ్నించింది.


  • పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌దే బాధ్యత!

ప్రభుత్వం తరఫున న్యాయవాదులపై ధర్మాసనం మరోసారి అసంతృప్తిని వ్యక్తం చేసింది. న్యాయస్థానం, న్యాయవాదులపై బహిరంగంగా పోస్టులు చేశారంటూ అసహనం వ్యక్తం చేసింది. పిటిషనర్లు దాఖలు చేసిన ఐఏలోని పాయింట్లను ధర్మాసనం ప్రస్తావించింది. ‘‘కబ్జాకోరులకు ఒక రూల్‌.. సర్కారుకు ఒక రూల్‌.. వాట్‌ ఈజ్‌ దిస్‌ అధ్యక్షా!? బెయిల్‌ వచ్చిందా? ఇచ్చారా? ఈ రెండింట్లో ఏది కరెక్టు?’’ అంటూ సోషల్‌ మీడియాలో కాంగ్రెస్‌ చేసిన ప్రచారంపై జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఇంతలో తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ లూథ్ర కలుగజేసుకుని.. ఆ ప్రచారంలో రేవంత్‌ రెడ్డి పాత్రలేదని ధర్మాసనానికి తెలిపారు. పిటిషన్ల తరఫున న్యాయవాది ఆర్యమ సుందరం దానికి అభ్యంతరం తెలిపారు. ప్రస్తుతం టీపీసీసీకి అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డే ఉన్నారని, ఆ పార్టీ రాష్ట్ర అధికారిక సోషల్‌ మీడియా చేసే ప్రచారానికి ఆయనదే బాధ్యత అవుతుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ స్పందిస్తూ.. ఐఏపై సమాధానం చెప్పాలని సీఎంను ఆదేశిస్తూ.. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు.


  • న్యాయవ్యవస్థ గౌరవాన్ని కాపాడాలి

ధర్మాసనంలోని మరో న్యాయమూర్తి జస్టిస్‌ విశ్వనాథన్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం తెలంగాణలో భారీ వరదలున్నాయని, ఆ విధుల్లో ప్రభుత్వం నిమగ్నమై ఉన్నదని గుర్తుచేశారు. తాము ప్రతి సున్నితమైన అంశాలపై దృష్టి సారిస్తామని తెలిపారు. రాజకీయ నేతలు మాత్రం తమను రాజకీయాల్లోకి లాగుతున్నారని, కోర్టులను, జడ్జిలను సోషల్‌ మీడియాలోకి తీసుకొస్తున్నారని వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు సరికాదన్నారు. న్యాయవ్యవస్థ గౌరవాన్ని కాపాడాలన్నారు. గౌరవప్రదమైన స్థానాల్లో ఉండే వ్యక్తులు అందరి స్వేచ్ఛ, హక్కులను కాపాడేలా వ్యవహరించాలని హితబోధ చేశారు.

Updated Date - Sep 03 , 2024 | 03:47 AM

Advertising
Advertising