Supreme Court : : వర్గీకరణకు సై
ABN , Publish Date - Aug 02 , 2024 | 03:15 AM
కొన్ని దశాబ్దాలుగా దేశంలో రగులుతున్న ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ సమస్యకు సుప్రీంకోర్టు తెరవేసింది. షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల ఉప వర్గీకరణ ఆమోద యోగ్యమేనని, ఆయా వర్గాల్లో అత్యంత వెనుకబడిన ఉప వర్గాల వారికి రాష్ట్రాల స్థాయిలో కోటాలో ప్రత్యేక కోటా ...
ఉప కులాలకు కోటా రాజ్యాంగబద్ధమే
ఆ అధికారం రాష్ట్రాలకు ఉంది: సుప్రీంకోర్టు
పక్కా డేటాతోనే వర్గీకరణ చేపట్టాలి
ఎస్సీ, ఎస్టీల్లోనూ క్రీమీలేయర్ అమలు
6-1 మెజారిటీతో తీర్పు వెల్లడి
ఎస్సీలంతా ఒకే స్థాయిలో లేరు
సీజే చంద్రచూడ్ బెంచ్ 565 పేజీల తీర్పు
ఏపీ ఎస్సీ రిజర్వేషన్లపై తీర్పు పునఃసమీక్ష
తీర్పుపై బాలగోపాల్ వ్యాసం ప్రభావం
న్యూఢిల్లీ, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): కొన్ని దశాబ్దాలుగా దేశంలో రగులుతున్న ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ సమస్యకు సుప్రీంకోర్టు తెరవేసింది. షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల ఉప వర్గీకరణ ఆమోద యోగ్యమేనని, ఆయా వర్గాల్లో అత్యంత వెనుకబడిన ఉప వర్గాల వారికి రాష్ట్రాల స్థాయిలో కోటాలో ప్రత్యేక కోటా కేటాయించవచ్చని ఏడుగురు సభ్యుల ధర్మాసనం గురువారం మెజారిటీ తీర్పును వెలువరించింది. ఎస్సీలంతా ఒకే స్థాయిలో లేరని, అందులో సామాజికంగా, విద్యాపరంగా మరింత వెనుబడిన వర్గాలు ఉన్నాయని, వాటిని పైకి తీసుకురావడానికి ఎస్సీ వర్గీకరణ చేయడానికి రాష్ట్రాలకు రాజ్యాంగబద్ధంగానే ఆ అధికారం ఉందని చరిత్రాత్మక తీర్పులో పేర్కొంది.
దాంతో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ఏళ్లుగా వర్గీకరణ కోసం పోరాడుతున్న మాదిగలకు ఎస్సీ రిజర్వేషన్లలో ప్రత్యేక కోటా ఇచ్చేందుకు మార్గం సుగమమైంది. ఇదే డిమాండ్ ఉన్న ఇతర చోట్లా ముందుకు వెళ్లనుంది. పలు రాష్ట్రాల్లో ఎస్టీల వర్గీకరణ కూడా చేపట్టాలని డిమాండ్ ఉంది. సుప్రీం తీర్పు నేపథ్యంలో వాటికి కూడా బలం చేకూరనుంది. వెనుకబాటుతనంపై పూర్తి కసరత్తు తర్వాతే వర్గీకరణ అమలు చేయాలని సుప్రీంకోర్టు 565 పేజీల సుదీర్ఘ తీర్పులో స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉప కులాల ప్రాతినిధ్యంపై, వెనుకబాటుతనంపై పూర్తి శాస్త్రీయమైన, గణాంక వివరాలతో సమాచారాన్ని సిద్ధం చేసుకున్న తర్వాతే వర్గీకరణ చేపట్టాలని తేల్చిచెప్పింది. అయితే, ఒక ఉప కులానికి నూటికి నూరు శాతం రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్రాలు ఇష్టారాజ్యంగా నిర్ణయం తీసుకోవడం కుదరదని స్పష్టం చేసింది.
రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకోరాదని, అలాంటి నిర్ణయాలపై న్యాయ సమీక్ష జరుగుతుందని హెచ్చరించింది. అంతేకాకుండా, ఎస్సీ, ఎస్టీల్లో సంపన్నులను(క్రీమీలేయర్) గుర్తించి వారికి రిజర్వేషన్ వర్తించకుండా చూడాలని స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం 6-1 మెజారిటీతో తీర్పునిచ్చింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చేపట్టి, ఐదేళ్ల పాటు అమలు చేసినఎస్సీ వర్గీకరణను 2004లో సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధమంటూ కొట్టేసింది. రాజ్యాంగంలోని 341 నిబంధన కింద రాష్ట్రపతి జారీ చేసిన ఎస్సీ కులాల జాబితాలోని కులాలన్నీ ఒకే వర్గమని, వాటిని వర్గీకరించడం కుదరదని చెన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో ఇరవై ఏళ్ల క్రితం తీర్పునిచ్చింది.
ఆ తర్వాత వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన ఎస్సీ వర్గీకరణలను 2004 సుప్రీం తీర్పు ఆధారంగా హైకోర్టులు కొట్టేశాయు. హైకోర్టులిచ్చిన తీర్పులపై సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలు అయ్యాయి. 2004 నాటి తీర్పును పునస్సమీక్షిస్తూ, ఇతర అప్పీళ్లను పరిష్కరిస్తూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గురువారం తాజాగా తీర్పునిచ్చింది. రాజ్యాంగ ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ బేల ఎం.త్రివేదీ, జస్టిస్ పంకజ్ మిథాల్, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ సతీశ్ చంద్రశర్మ సభ్యులుగా ఉన్నారు. ఈ ఏడాది ఆరంభంలో మూడు రోజులపాటు వాదనలు విని, ఫిబ్రవరి 8న తీర్పును రిజర్వు చేశారు. గురువారం తీర్పును వెలువరించింది. న్యాయమూర్తి జస్టిస్ బేల ఎం.త్రివేదీ మాత్రం వర్గీకరణను వ్యతిరేకిస్తూ విడిగా తీర్పునిచ్చారు.
2004 తీర్పులో ఏం చెప్పారు?
ఈవీ చిన్నయ్య కేసులో సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్ ఎన్.సంతోష్ హెగ్డే, జస్టిస్ ఎస్.ఎన్.వరియవా, జస్టిస్ బి.పి.సింగ్, జస్టిస్ హెచ్.కె. సీమా, జస్టిస్ ఎస్.బి.సిన్హాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 341లో పేర్కొన్న కులాల జాబితాను రాష్ట్రాలు మార్చలేవని స్పష్టం చేశారు. రాష్ట్రపతి మాత్రమే ఆర్టికల్ 341 కింద ఏ రాష్ట్రానికైనా కొన్ని వర్గాలను షెడ్యూల్డు కులాలుగా నిర్ణయించగలరని, గవర్నర్‌తో సంప్రదించి ఆయా
రాష్ట్రాలకు ఎస్సీల నోటిఫై చేయాలని తెలిపారు. 1997లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాదిగల ఉద్యమం ఊపందుకోవడంతో అప్పటి ప్రభుత్వం జస్టిస్ రామచంద్ర రాజు కమిషన్‌ని నియమించి, ఆ కమిషన్ సిఫారసుల మేరకు షెడ్యూల్డు కులాలను ఏబీసీడీలుగా వర్గీకరిస్తూ 2000 సంవత్సరంలో చట్టం చేసింది. ఈ చట్టాన్ని ఏపీ హైకోర్టులో సవాలు చేసినపుడు ఈ చట్టం సరైనదే నంటూ ఏపీ హైకోర్టు అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం మెజారిటీ తీర్పును ప్రకటించింది.
దాన్ని ఈవీ చిన్నయ్య సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో జస్టిస్ సంతోష్ హెగ్డే నేతృత్వంలోని ధర్మాసనం హైకోర్టు తీర్పును కొట్టేసింది. దాంతో నాలుగేళ్లుగా మాదిగలు అనుభవిస్తున్న వర్గీకరణ ఫలాలకు తెరపడింది. ఈవీ చిన్నయ్య కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా పంజాబ్, హర్యానా హైకోర్టు కూడా 2010లో పంజాబ్‌లో ఎస్సీ వర్గీకరణను కొట్టివేసింది.
ఎస్సీ కోటాలో సగం ఖాళీలను వాల్మీకులు, మఝబీ సిక్కులకు కేటాయిస్తూ పంజాబ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టేసింది. దవీందర్ సింగ్ వర్సెస్ పంజాబ్ ప్రభుత్వం పేరుతో ఈ కేసు సుప్రీంకోర్టుకు వచ్చినపుడు 2020లో ఐదుగురు సభ్యుల ధర్మాసనం దాన్ని రాజ్యాంగ ధర్మాసనం పరిశీలించాలని సిఫార్సు చేసింది. ఉప వర్గీరకణ ఆమోద యోగ్యం కాదంటూ ఈవీ చిన్నయ్య కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని ఈ ధర్మాసనం కోరింది. ఆ మేరకు జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలో విస్తృత రాజ్యాంగ ధర్మాసనం సుదీర్ఘంగా విచారణ జరిపిన తర్వాత గురువారం తన నిర్ణయాన్ని ప్రకటించింది.
సుప్రీంతీర్పును ప్రభావితం చేసిన బాలగోపాల్ వ్యాసం
పంజాబ్ ప్రభుత్వం తరఫున వాదించిన ప్రముఖ న్యాయవాది కపిల్ సిబాల్ తన వాదనలో 2005లో ఎకనమిక్స్ అండ్ పొలిటికల్ వీక్లీలో ప్రమఖ తెలుగు రచయిత, మేధావి బాలగోపాల్ వ్యాసాన్ని విస్తృతంగా ఉటంకించారు. న్యాయ కోవిదుడైన బాలగోపాల్ ఆర్టికల్ 341కు వర్గీకరణ ఏ విధంగా విరుద్ధం కాదో స్పష్టంగా వివరించారని కపిల్ సిబాల్ వాదించారు. ఉప వర్గీకరణ రాజ్యాంగ వ్యతిరేకం కాదని బాలగోపాల్ చేసిన వాదనను ఉటంకిస్తూ ఆయన బాలగోపాల్ రాసిన వ్యాసాన్ని తన పిటిషన్‌కు అనుబంధంగా చేర్చారు.
స్వజాతి వర్గమైన షెడ్యూల్డు కులాలను విభజించే అధికారం రాజ్యాంగంలోని 341 కింద శాసనసభకు లేదు అన్నపుడు ఆ అధికారం పార్లమెంటుకు మాత్రం ఎందుకు ఉంటుందని బాలగోపాల్ ‘దళితుల్లో దళితులకు న్యాయం’ అన్న పేరుతో రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. ఈవీ చిన్నయ్య కేసులో జస్టిస్ సంతోష్ హెగ్డే బెంచ్ ఇచ్చిన తీర్పు సామాజిక వాస్తవికతలకు దూరంగా ఉన్నదని బాలగోపాల్ విమర్శించారు.
విద్య, సామాజిక సంక్షేమం, ఉపాధి కల్పనకు సంబంధించి రాష్ట్రాలకు అధికారాలు ఉన్నపుడు షెడ్యూల్డు కులాల్లో ఒక ఉప కులానికి జరుగుతున్న అన్యాయాన్ని అవి ఎందుకు సరి చేయలేవని ఆయన ప్రశ్నించారు. మాదిగలకు చిరకాలంగా జరుగుతున్న అన్యాయాన్ని వివరించిన బాలగోపాల్ రాజ్యాంగాన్ని స్వేచ్ఛగా, విశాలంగా మారుతున్న కాలం, సామాజిక అవసరాలకు అనుగుణంగా అన్వయింప చేయాలని అభిప్రాయ పడ్డారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మాటలను జస్టిస్ సంతోష్ హెగ్డే ధర్మాసనం ఎలా తప్పుగా అన్వయించిందో ఆయన వివరించారు.
వర్గీకరణ రాజ్యాంగ ఉల్లంఘన కాదు: జస్టిస్ చంద్రచూడ్
చారిత్రక ఆధారాలు పరిశీలిస్తే ఎస్సీ వర్గంలో ఉన్న వారంతా నిజానికి ఒకే వర్గం కాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ జస్టిస్ మిశ్రాతో కలిసి స్వయంగా రాసిన తీర్పులో పేర్కొన్నారు. కులాలను వర్గీకరించడం రాజ్యాంగంలోని 14వ అధికరణలో పేర్కొన్న సమానత్వ హక్కును ఉల్లంఘించినట్లు కాదని చెప్పారు.
ఎస్సీ కులాల్లో కొత్తగా ఏదైనా కులాన్ని చేర్చే హక్కు పార్లమెంటుకు ఉంటుందని చెప్పే ఆర్టికల్ 341(2)కు ఎస్సీ కులాల వర్గీకరణ విరుద్ధం కాదని అన్నారు. రాష్ట్రాలకు ఆర్టికల్ 15(వివక్ష లేని), ఆర్టికల్ 16(సమాన అవకాశాలు) కింద ఆయావర్గాల వెనుకబాటుతనాన్ని గుర్తించి రిజర్వేషన్లను కల్పించే అధికారం ఉందన్నారు. ఆర్టికల్ 341లో పేర్కొన్న కులాలను వేరు చేసి చూడటానికి హేతుబద్ధమైన సూత్రం ఉన్నపుడు, ఆ సూత్రం వర్గీకరణ లక్ష్యంతో సంబంధం కలిగి ఉన్నపుడు వర్గీకరణ చేపట్టవచ్చని చెప్పారు.
నిజమైన సమానత్వాన్ని సాధించడానికి ఉప వర్గీకరణ మార్గం అయినపుడు వర్గీకరణ రాజ్యాంగ బద్ధమే అవుతుందన్నారు. లభిస్తున్న డేటాను బట్టి చూస్తే ఎస్సీ కులాల మధ్య కూడా అసమానతలు ఉన్నాయని, ఆ కులాలు వర్గంగా అవతరించిన ఒకేరకమైన కులాలు కాదని చెప్పారు.
ఎస్సీ కులాలను ఆర్టికల్ 341 ద్వారా కలిపినంత మాత్రాన విభజించడం కుదరనంత ఏకరూప వర్గంగా అవి ఏర్పడవని అన్నారు. కేవలం చట్టపరంగా ఇతర కులాలతో వేరు చేసి చూపడమనే పరిమిత లక్ష్యంతోనే ఎస్సీ కులాలను ఆర్టికల్ 341 రూపంలో ఒకచోట కలిపారని వివరించారు. వెనుకబాటుతనం, ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం విషయంలో గణించదగ్గ, విశ్వసనీయమైన సమాచారం ఆధారంగానే వర్గీకరణ చేయవచ్చని చెప్పారు.
ఇప్పటికే ఎస్సీ కులాల జాబితాలో ఉన్న ఏ కులానికైనా ఎస్సీ కులాలకు వర్తించే లబ్ధి చేకూరకుండా వర్గీకరణ చేపడితే రాజ్యాంగ విరుద్ధం అవుతుందని స్పష్టం చేశారు. బాగా వెనుకబడిన కులాలకు అధిక ప్రాధాన్యం లభించేట్లు చూడాల్సిన రాష్ట్ర ప్రభుత్వాలదేనని జస్టిస్ గవాయ్ అన్నారు. ఎస్సీ, ఎస్టీల్లో కొంతమంది వ్యక్తులే రిజర్వేషన్ ఫలాలను అనుభవిస్తున్నారని వ్యాఖ్యానించారు.
వందల ఏళ్ల అణచివేతను ఎదుర్కొన్న ఎస్సీ, ఎస్టీ కులాల్లోనూ అంతరాలు ఉన్నాయని, క్షేత్ర స్థాయిలో కనిపిస్తున్న వాస్తవాలను కాదనలేమని చెప్పారు. రిజర్వేషన్లకు రాజ్యాంగంలోని 341 అధికరణే ప్రాతిపదిక అని ఈవీ చిన్నయ్య కేసులో సుప్రీంకోర్టు భావించడమే మౌలిక లోపమని జస్టిస్ గవాయి వ్యాఖ్యానించారు. రిజర్వేషన్ల కోసం కులాలను గుర్తించే పని మాత్రమే ఆర్టికల్ 341 చేస్తుందని చెప్పారు. ఒక పెద్ద వర్గంలో భాగమైన మరో ఉపవర్గం వివక్షను ఎదుర్కొంటున్నందుకే ఉప వర్గీకరణ చేయాల్సి వస్తోందని తెలిపారు.
లేని అధికారాన్ని కట్టబెడుతున్నారు: జస్టిస్ త్రివేదీ
రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ప్రకారం రాష్ట్రపతి జారీ చేసిన కులాల జాబితాను మార్చడానికి వీల్లేదని జస్టిస్ బేల ఎం.త్రివేదీ విడిగా ఇచ్చిన తన అసమ్మతి తీర్పులో పేర్కొన్నారు. పార్లమెంటు చట్టం ద్వారా అందులో కులాలను చేర్చడం, తీసివేయడానికి మాత్రమే అధికారం ఉందని చెప్పారు.
వర్గీకరణ చేయడమంటే రాష్ట్రపతి జాబితాకు మార్పులు చేర్పులు చేయడమేనని అన్నారు. ఎస్సీ, ఎస్టీల జాబితాను రాజకీయ కారణాలతో ఇష్టం వచ్చినట్లు మార్చకుండా చూడటానికే రాజ్యాంగంలో 341 నిబంధనను చేర్చారని చెప్పారు.
అధికరణానికి స్పష్టమైన అర్థం ఉన్నపుడు దాన్నే తీసుకోవాలని సూచించారు. రాష్ట్రపతి జాబితాలో ఉన్న ఒక వర్గంలో ఉప వర్గానికి అధిక ప్రాధాన్యమిచ్చినపుడు అదే వర్గంలోని ఇతర కులాలకు అన్యాయం జరుగుతుందని జస్టిస్ బేల ఎం.త్రివేదీ వ్యాఖ్యానించారు.
అందరు ఎస్సీలకు వర్తించే రిజర్వేషన్ ఫలాలను కొన్ని ఉప కులాలకు కేటాయించే అధికారం రాష్ట్రాలకు లేదని చెప్పారు. రిజర్వేషన్లకు సంబంధించి ఎలాంటి కార్యనిర్వాహక, చట్టపరమైన అధికారాలు రాష్ట్ర ప్రభుత్వాలకు లేవన్నారు. అలా చేసేందుకు రాష్ట్రాలను అనుమతించడం.. లేని అధికారాన్ని కట్టబెట్టడం అవుతుందని చెప్పారు.
ఎస్సీ, ఎస్టీల్లోనూ క్రీమీలేయర్: జస్టిస్ గవాయ్
సకారాత్మక కార్యాచరణలో భాగంగా ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన రిజర్వేషన్ల ప్రయోజనాల నుంచి సంపన్నులను తప్పించాలని జస్టిస్ గవాయ్ స్పష్టం చేశారు. నిజమైన సమానత్వం సాధనకు అదే మార్గమని చెప్పారు.
వర్గీకరణ చేసే క్రమంలో క్రీమీలేయర్ వాళ్లను తప్పించినపుడే నిజమైన సమానత్వం జరుగుతుందని, క్రీమీలేయర్‌లను గుర్తించేందుకు ప్రభుత్వం ఒక విధానం ఏర్పర్చుకోవాలని సూచించారు.
జస్టిస్ విక్రమ్‌నాథ్ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓబీసీలకు వర్తింపజేస్తున్న క్రీమీలేయర్ ఎస్సీలకూ వర్తింపజేయాలన్నారు. రిజర్వేషన్లు ఒక తరానికి మాత్రమే వర్తింపజేయాలని జస్టిస్ పంకజ్ మిథాల్ సూచించారు. మొదటితరం రిజర్వేషన్లతో ఉన్నత స్థానాన్ని అందుకుంటే తర్వాతి తరానికి రిజర్వేషన్లు వర్తింపజేయొద్దని చెప్పారు. జస్టిస్ సతీశ్ చంద్ర కూడా క్రీమీలేయర్‌ను సమర్థించారు.
ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచే కోరుతున్నా: వెంకయ్య
ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో మరింత వెనుకబడిన కులాల వారికి కోటా కల్పించడానికి వీలుగా ఉప వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉందని సుప్రీం కోర్టు గురువారం ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకం. రిజర్వేషన్ల విధానంలో మరో ముందడుగు పడింది.
ఎస్సీ, ఎస్టీ కులాల వారిలో మరింత అణగారిన వర్గాలకు రిజర్వేషన్ల ఫలాలు అందాలంటే ఉప వర్గీకరణ ఉండాలని శాసన సభ్యుడిగా ఉన్నప్పటి నుంచి కోరుతూనే ఉన్నా. వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా పోరాడుతున్న మందకృష్ణకు అభినందనలు. ఆయన ఉద్యమ కల సాకారమైంది.
వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి: దండోరా
పార్లమెంటులో బిల్లు పెట్టి రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని మాదిగ హక్కుల దండోరా డిమాండ్ చేసింది. గురువారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో దండోరా జాతీయ, రాష్ట్ర అధ్యక్షుడు దండు సురేందర్ మాదిగ, కొంగరి శంకర్ మాదిగ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. సుప్రీం కోర్టు తీర్పుతో మాదిగల బతుకుల్లో వెలుగులు వచ్చాయని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేశ్ మాదిగ అన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పు వల్ల తెలంగాణ మాదిగలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మాదిగ జేఏసీ వ్యవస్థాపకుడు డాక్టర్ పిడమర్తి రవి అన్నారు. జనాభా దామాషా ప్రకారం మాదిగ రిజర్వేషన్లను 12 శాతానికి పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.
అగ్రకుల రాజకీయ పార్టీల కుట్ర ::: మాల మహానాడు
ఎస్సీ వర్గీకరణ అగ్రకుల రాజకీయ పార్టీల కుట్ర అని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు మన్నె శ్రీధర్ రావు, మాల ప్రజా సంఘాల జేఏసీ వర్కింగ్ చైర్మన్ గోపోజు రమేశ్ బాబు మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ తీర్పుపై త్వరలోనే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.