మదర్సాలకు సుప్రీం ఊరట
ABN, Publish Date - Nov 06 , 2024 | 03:02 AM
మదర్సాల్లో నాణ్యమైన విద్యను బోధించేలా, అర్హులైన ఉపాధ్యాయులను నియమించేలా, పరీక్షలు నిర్వహించేలా చూసేందుకు యూపీ సర్కారు 2004లో రూపొందించిన ‘ఉత్తరప్రదేశ్ బోర్డ్ ఆఫ్ మదర్సా ఎడ్యుకేషన్ యాక్ట్ 2004’ రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు మంగళవారం తీర్పునిచ్చింది.
యూపీ మదర్సా చట్టం రాజ్యాంగబద్ధమే
17 లక్షల మందిని బడుల్లో చేర్చాలన్న అలహాబాద్ హైకోర్టు తీర్పు కొట్టివేత
ఫాజిల్, కామిల్ డిగ్రీలు యూజీసీ చట్టం, రాజ్యాంగానికి విరుద్ధం: ధర్మాసనం
న్యూఢిల్లీ, నవంబరు 5: మదర్సాల్లో నాణ్యమైన విద్యను బోధించేలా, అర్హులైన ఉపాధ్యాయులను నియమించేలా, పరీక్షలు నిర్వహించేలా చూసేందుకు యూపీ సర్కారు 2004లో రూపొందించిన ‘ఉత్తరప్రదేశ్ బోర్డ్ ఆఫ్ మదర్సా ఎడ్యుకేషన్ యాక్ట్ 2004’ రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. రాజ్యాంగంలోని 14, 21ఏ అధికరణలకు, లౌకిక సూత్రాలకు విరుద్ధమని పేర్కొంటూ గతంలో అలహాబాద్ హైకోర్టు ఈ చట్టాన్ని కొట్టేస్తూ ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. విద్య నాణ్యతను నియంత్రించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని.. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్‌మిశ్రాతో కూడిన ధర్మాసనం తేల్చిచెప్పింది. ఈ చట్టం రాష్ట్రప్రభుత్వ శాసనాధికార పరిధిలోనే ఉందని స్పష్టం చేసింది. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల ఉమ్మడి జాబితాలోని అంశాల్లో 25వది విద్య అని గుర్తుచేసింది. అయితే.. మదర్సాల్లో ఉన్నతవిద్యకు సంబంధించి ఇచ్చే ‘ఫాజిల్(డిగ్రీతో సమానం)’, ‘కామిల్ (పీజీతో సమానం)’ మాత్రం యూజీసీ చట్టానికి, కేంద్ర జాబితాలోని 66వ అంశానికి విరుద్ధమని, కాబట్టి వాటిని రాజ్యాంగ విరుద్ధంగా పరిగణించవచ్చని వ్యాఖ్యానించింది. 2004లో యూపీ సర్కారు చేసిన ఈ చట్టం కింద.. ఉత్తరప్రదేశ్‌లోని ఒక మదర్సాలో పార్ట్‌టైమ్ అసిస్టెంట్ టీచర్‌గా చేరిన మహ్మద్ జావేద్ అనే వ్యక్తి.. తన సర్వీసును క్రమబద్ధీకరించాలంటూ 2019లో అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాడు. అతడి పిటిషన్‌ను విచారించిన సింగిల్ జడ్జి.. లౌకిక రాజ్యాంగాన్ని అనుసరిస్తున్న దేశంలో, విద్య కోసం ఏర్పాటు చేసిన బోర్డులో ఒక నిర్ణీత మతానికి చెందిన వ్యక్తులను మాత్రమే నియమించడమేమిటనే ప్రశ్న లేవనెత్తి, ఈ పిటిషన్‌ను విస్తృత ధర్మాసనానికి రిఫర్ చేశారు.
దీనిపై అలహాబాద్ హైకోర్టు సీజే ఇద్దరు సభ్యుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమయంలోనే.. అసలు ఈ మదర్సా చట్టమే రాజ్యాంగ విరుద్ధమంటూ అన్షుమాన్ సింగ్ రాథోడ్ అనే అడ్వొకేట్ హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఆ పిటిషన్లన్నింటినీ కలిపి విచారించిన ద్విసభ్య ధర్మాసనం.. మదర్సా చట్టం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ దాన్ని కొట్టేసింది. ‘‘మతపరమైన విద్య కోసం (లేదా) ఒక ప్రత్యేకమైన మతం/విధానానికి సంబంధించిన పాఠశాల విద్య కోసం బోర్డును ఏర్పాటు చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదు’’ అని తీర్పులో పేర్కొంది.
రాష్ట్రంలోని 16 వేలకు పైగా మదర్సాల్లో విద్యాభ్యాసం చేస్తున్న 17 లక్షల మంది విద్యార్థులను సాధారణ పాఠశాలల్లో చేర్చాలని సూచించింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ పలువురు వ్యక్తులు, పలు సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. కాగా.. మదర్సా చట్టాన్ని వ్యతిరేకిస్తూ ‘జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్)’ కూడా ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యింది. నాణ్యమైన విద్యను మదర్సా ఎడ్యుకేషన్ తిరస్కరిస్తోందని వాదించింది. మతపరమైన విద్యను అభ్యసించే హక్కు ఎవరికైనా ఉందని.. కానీ, ఆ విద్యను ప్రధాన స్రవంతి విద్యకు ప్రత్యామ్నాయంగా మాత్రం అంగీకరించకూడదని పేర్కొంది. ఇక.. సుప్రీం తీర్పును ముస్లిం మత సంస్థలకు చెందిన పెద్దలు, బీఎస్పీ అధినేత్రి మాయావతి, సమాజ్‌వాదీ పార్టీ నేతలు స్వాగతించారు.
Updated Date - Nov 06 , 2024 | 03:02 AM