Bandi Sanjay: నాగాలాండ్ అభివృద్ధిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సమీక్ష..
ABN, Publish Date - Nov 18 , 2024 | 08:09 PM
నాగాలాండ్ రాష్ట్రంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పర్యటిస్తున్నారు. నాగాలాండ్‌లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అమలవుతున్న కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను అధికారులతో కలిసి బండి సంజయ్ సమీక్షించారు.
కోహిమా: నాగాలాండ్ రాష్ట్రంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పర్యటిస్తున్నారు. నాగాలాండ్‌లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అమలవుతున్న కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను అధికారులతో కలిసి బండి సంజయ్ సమీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు ఇవాళ (సోమవారం) ఉదయం ఢిల్లీ నుంచి దిమాపూర్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని అక్కడ్నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో నాగాలాండ్ రాజధాని కోహిమాకు బండి చేరుకున్నారు. అనంతరం ఆ రాష్ట్ర సచివాలయానికి వెళ్లి చీఫ్ సెక్రటరీ జాన్ ఎ.ఆలంతో కలిసి వివిధ శాఖల ఉన్నతాధికారులతో కేంద్ర మంత్రి సమావేశం అయ్యారు.
విద్య, వైద్యం, వ్యవసాయం, విద్యుత్, సంక్షేమం, రవాణా, జల్ శక్తి రంగాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రత్యేకంగా సమీక్షించారు. 20 లక్షల జనాభా కలిగిన నాగాలాండ్ రాష్ట్రంలో వివిధ కార్యక్రమాల అమలు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించిన నిధుల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. జాతీయ రహదారుల నిర్మాణం, రోడ్ కనెక్టివిటీ విషయంలో ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీశారు. రాష్ట్రంలో ఒకే ఒక్క మెడికల్ కాలేజీ ఉందని, దీన్ని ఎయిమ్స్ ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేసి కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించాలని అధికారులు బండి సంజయ్‌ను కోరారు. నాగాలాండ్‌లో ఎన్ఐటీ మినహా ఒక్క ఇంజినీరింగ్ కాలేజీ కూడా లేదని అధికారులు ఆయన చెప్పారు. కొహిమా నుంచి దిమాపూర్ వరకూ ఉన్న రహదారికి ప్రత్యామ్నాంగా మరో రహదారి అవసరముందని అధికారులు ప్రతిపాదించారు. పీఎం విశ్వకర్మ పథకం పట్ల ప్రజల్లో అవగాహన కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని అధికారులు కోరారు. స్కిల్ డెవలెప్మెంట్, సంక్షేమ పథకాల అమలుపైనా అధికారుల నుంచి కేంద్ర మంత్రి పలు వివరాలు సేకరించారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని అన్నారు. ఏటా రూ.2.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. నిధుల వినియోగం, కార్యక్రమాల అమలు తీరుపై 15 రోజులకు ఓసారి ఆయా రాష్ట్రాల్లో సమీక్ష నిర్వహిస్తోందని బండి సంజయ్ చెప్పారు. అందులో భాగంగానే తానూ వచ్చినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. కేంద్ర మంత్రిత్వ శాఖలు ఖర్చు చేసే మొత్తం బడ్జెట్‌లో 10 శాతం మేరకు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికే కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇతర రాష్ట్రాలతో సమానంగా నాగాలాండ్ సహా ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి చెందాలన్నదే మోదీ అభిమతమని చెప్పారు. మారుమూల అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రతి ఒక్కరికీ విద్య, వైద్యం, వ్యవసాయం, రవాణా సేవలన్నీ అందించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.
అలాగే కనీస మౌలిక సదుపాయాలన్నీ అందుబాటులోకి తేవడంతోపాటు మారుమూల అటవీ, కొండ ప్రాంతాల్లో నివసించే ప్రతి కుటుంబానికీ జల్ జీవన్ మిషన్ కింద తాగునీటిని అందించాలని అధికారులను కేంద్ర మంత్రి ఆదేశించారు. అలాగే సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్‌లో భాగంగా నాగాలాండ్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపైనా కేంద్ర మంత్రి సంజయ్ ఆరా తీశారు. నాగాలాండ్ విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం సంక్షేమ ఫలాలను క్షేత్రస్థాయి దాకా తీసుకెళ్లే విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులపై లోతుగా ఆరా తీశారు. కేంద్రం నుంచి ఏ రకమైన సహాయ సహకారాలు స్థానిక ప్రజలు ఆశిస్తున్నారనే అంశంపైనా ఫీడ్ బ్యాక్ అడిగి తెలుసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Yogi Adityanath: బుల్డోజర్ సిద్ధంగా ఉంది.. యోగి నోట మళ్లీ అదేమాట
Amit Shah: మణిపూర్‌కు మరో 50 సీఆర్‌పీఎఫ్ కంపెనీలు.. అమిత్‌షా సమీక్ష
Updated Date - Nov 18 , 2024 | 08:10 PM