UP Bypolls: ఈసీ కొరడా...ఏడుగురు పోలీసుల సస్పెండ్
ABN, Publish Date - Nov 20 , 2024 | 03:33 PM
ఎన్నికల స్వేచ్ఛగా, సజావుగా జరిగేలా చూడాలని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి, ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులను ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఆదేశించారు. ఫిర్యాదులు అందిన తక్షణమే చర్యలు తీసుకోవాలని, తీసుకున్న చర్యలను ఫిర్యాదుదారుని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో తెలియజేయాలని కూడా ఆయన ఆదేశాలు ఇచ్చారు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో (UP Bypolls) ఓటర్ గుర్తింపు కార్డుల తనిఖీలకు సంబంధించి బుధవారంనాడు తలెత్తిన వివాదంపై ఎన్నికల కమిషన్ కొరడా ఝళిపించింది. సమాజ్‌వాదీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఓటర్ గైడ్‌లైన్స్ ఉల్లంఘనకు పాల్పడిన ఏడుగురు పోలీసులను (Cops) తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్టు ఆదేశాలిచ్చింది. సస్పెండైన వారిలో కాన్పూర్, ముజఫర్‌నగర్ జిల్లాలకు చెందిన చెరో ఇద్దరు అధికారులు, మొరాదాబాద్ నుంచి ముగ్గురు అధికారులు ఉన్నారు.
P Chidambaram: ఎయిర్‌సెల్-మాక్సిస్ కేసులో చిదంబరానికి ఊరట
"అర్హత కలిగిన ఓ ఒక్కరిని ఓటు వేయకుండా అడ్డుకోరాదు. ఓటింగ్ సమయంలో ఎలాంటి వివక్షను సహించేది లేదు. ఫిర్యాదు అందితే వెంటనే విచారణ ఉంటుంది. దోషిగా తేలితే వారిపై కఠిన చర్యలు ఉంటాయి'' అని ఎన్నికల కమిషన్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఎన్నికల స్వేచ్ఛగా, సజావుగా జరిగేలా చూడాలని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి, ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులను ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఆదేశించారు. ఫిర్యాదులు అందిన తక్షణమే చర్యలు తీసుకోవాలని, తీసుకున్న చర్యలను ఫిర్యాదుదారుని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో తెలియజేయాలని కూడా ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్, కతెహారి, ఖైర్, కుందర్కి, కర్హాల్, మజవాన్, మీరాపూర్, ఫుల్పూర్, సిషామౌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బుధవారం ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతోంది.
అఖిలేష్ ఫిర్యాదు
పోలీసు అధికారులు చట్టవిరుద్ధంగా ఓటర్ కార్డులు, ఆథార్ కార్డులు తనిఖీ చేస్తున్నారని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఈసీకి ఫిర్యాదు చేశారు. కొన్ని కమ్యూనిటీలను ఓటు వేయకుండా నిరోధిస్తున్నారని, దీనిపై ఈసీ చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం అఖిలేష్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ, చాలాచోట్ల తాము ఫిర్యాదులు చేశామని, ఏమి చేసైనా సరే నెగ్గాలని బీజేపీ కోరుకుంటోందని, అధికార యంత్రాగంపై ఒత్తిడి తెస్తోందని ఆరోపించారు.
ఇవి కూడా చదవండి...
Former Minister: నటుడు విజయ్ పార్టీతో పొత్తుకోసం ఇంకా చర్చించలేదు
TVK: టీవీకే పార్టీపై ఇంటెలిజెన్స్ నిఘా..
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Nov 20 , 2024 | 05:28 PM