చీఫ్ జస్టిస్ విచారణ సెట్టింగ్ వేసి..
ABN, Publish Date - Oct 02 , 2024 | 02:53 AM
సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. వీడియో కాల్ చేసి.. పోలీసుల్లా మాట్లాడుతూ.. అరెస్టు చేస్తాం అని బెదిరించి డబ్బులు దండుకునే గ్యాంగులకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది.
ఈడీ, సీబీఐ పేరు చెప్పి 7 కోట్లు దోచారు.. సైబర్ నేరగాళ్ల బారిన వర్ధమాన్ సీఎండీ ఎస్.పి.ఓస్వాల్
వీడియోకాల్ చేసి ఆర్థిక అవకతవకల పేరిట బెదిరింపు
డిజిటల్ అరెస్టు చేస్తున్నట్లు వెల్లడి.. ఏకంగా జస్టిస్‌చంద్రచూడ్ విచారణ జరిపినట్లుగా కోర్టు సెట్టింగ్
భయపెట్టి 7 కోట్ల దోపిడీ.. పోలీసులకు ఓస్వాల్ ఫిర్యాదు
రూ.5.25 కోట్ల రికవరి.. గౌహతిలో ఇద్దరి అరెస్టు
సూత్రధారి, ఇతర నిందితుల కోసం గాలింపు
న్యూఢిల్లీ, అక్టోబరు 1: సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. వీడియో కాల్ చేసి.. పోలీసుల్లా మాట్లాడుతూ.. అరెస్టు చేస్తాం అని బెదిరించి డబ్బులు దండుకునే గ్యాంగులకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఈసారి వీరి బారిన ఒక బడా పారిశ్రామికవేత్త పడి.. ఏకంగా రూ.7 కోట్లు పోగొట్టుకున్నారు. జరిగిన మోసం తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. పోయిన సొమ్ములో రూ.5 కోట్లు ఇప్పటి వరకూ దొరికింది. ఆ పారిశ్రామికవేత్త పేరు ఎస్పీ ఓస్వాల్. ప్రముఖ టెక్స్‌టైల్స్ కంపెనీ వర్ధమాన్ గ్రూపు సంస్థల చైర్మన్, ఎండీ. 82 ఏళ్ల వయసున్న ఓస్వాల్‌కు ఆగస్టు 28వ తేదీన ఓ ఫోన్ వచ్చింది. ముంబైలోని కొలాబాలో ఉన్న సీబీఐ ఆఫీసు నుంచి ఫోన్ చేస్తున్నామని అవతలి వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. ‘మీ పేరిట ఉన్న కెనరా బ్యాంకు ఖాతాలో ఆర్థిక అవకతవకలు జరిగాయి.
నరేశ్ గోయల్ పేరుతో
మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన జెట్ ఎయిర్‌వేస్ మాజీ చైర్మన్ నరేశ్ గోయల్ వ్యవహారంతో ఈ ఖాతాకు సంబంధం ఉన్నట్లు తేలింది. కాబట్టి మిమ్మల్ని కూడా ఈ కేసులో నిందితుడిగా చేరుస్తున్నాం’ అని చెప్పాడు. ఓస్వాల్ స్పందిస్తూ.. తనకు కెనరాబ్యాంకులో ఖాతానే లేదని చెప్పారు. దీనికి సైబర్ కేటుగాడు.. ‘మీ ఆధార్‌తోనే ఆ ఖాతాను తెరిచారు’ అని పేర్కొన్నాడు. తనకు నరేశ్ గోయల్ కూడా తెలియదని, కాకపోతే, జెట్ ఎయిర్‌వే్‌సలో ప్రయాణించానని, అప్పుడు ఆధార్ వివరాలు ఇచ్చి ఉంటానని ఓస్వాల్ చెప్పారు. దీంతో ఆ మోసగాడు.
ఆధార్ వివరాలు దుర్వినియోగం అంటూ..
మీ ఆధార్ వివరాలను దుర్వినియోగం చేసినట్లుందని పేర్కొంటూ.. అయినప్పటికీ, ఈ కేసులో మీరు నిందితుడిగా ఉన్నారు కాబట్టి, డిజిటల్ కస్టడీలోకి తీసుకుంటున్నామని చెప్పాడు. అనంతరం మరొకడు వీడియోకాల్ చేశాడు. తన పేరు రాహుల్ గుప్తా అని, తాను చీఫ్ ఇన్వెస్టింగ్ ఆఫీసర్‌నని చెప్పాడు. సైబర్ అరెస్టుకు సంబంధించిన నిబంధనలను వాట్సప్ ద్వారా పంపించాడు. ఆ తర్వాత మరికొందరు అధికారుల పేర్లతో వీడియోకాల్స్ చేసి ఓస్వాల్ బాల్యం, విద్యాభ్యాసం, వ్యాపారంలోకి ప్రవేశం, ఆస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
జాతీయ రహస్యాల చట్టం అంటూ
ఆయన స్టేట్‌మెంట్ ‘రికార్డు’ చేసుకున్నారు. ఆ తర్వాత.. ‘మీరు వీడియో నిఘా కింద ఉన్నారు. మీరు మీ గది నుంచి బయటకెళ్తే మాకు చెప్పాలి. ఫోన్ మీ వెంటే ఉంచుకోవాలి. ఈ కేసు ‘జాతీయ రహస్యాల చట్టం’ కింద నమోదైంది కాబట్టి.. ఎవరికీ దీని గురించి చెప్పవద్దు. ఎవరితో మాట్లాడినా మీతోపాటు వాళ్లు కూడా 3-5 ఏళ్లు జైలుపాలైతారు’ అని ఓస్వాల్‌ను బెదిరించారు. ఈ వీడియోకాల్స్ కొనసాగుతూ వచ్చాయి. ఒకదశలో వీడియోలోనే కోర్టు విచారణ జరిపారు. ఏకంగా సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ఈ కేసు విచారిస్తున్నట్లు సెట్టింగు వేశారు. కేసు విచారణ జరిపిన ‘జస్టిస్ చంద్రచూడ్’ ఓస్వాల్‌కు ఆదేశాలు జారీ చేశారు.
సుప్రీంకోర్టు లోగోతో, రెవెన్యూ స్టాంపులతో కూడిన ఆ ఆదేశాలను ఓస్వాల్‌కు వాట్సా్‌పలో జారీ చేశారు. అనంతరం.. ఈడీ, ముంబై పోలీసుల లోగోలతో కూడిన అరెస్టు వారెంటు వాట్సా్‌పలో పంపించారు. దాని మీద ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ నీరజ్ కుమార్ పేరుతో ఓ సంతకం ఉంది. వీటన్నింటి తర్వాత, మరికొందరు కేటుగాళ్లు ఈడీ, సీబీఐ అధికార్ల పేరుతో ఫోన్ చేసి మాట్లాడుతూ.. మిమ్మల్ని రక్షిస్తాం..
రూ.7 కోట్లు పంపించండి అని చెప్పటంతో.. వారు సూచించిన వేర్వేరు బ్యాంకు ఖాతాలకు రూ.7 కోట్లు ఓస్వాల్ పంపించారు. ఇదంతా ఆగస్టు 28, 29 తేదీల్లో జరిగింది. తొలుత బెదిరిపోయి డబ్బులు పంపించిన ఓస్వాల్.. తర్వాత.. జరిగిన మోసం గుర్తించి పోలీసులకు అదే నెల 31వ తేదీన ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఓస్వాల్ డబ్బులు పంపిన 3 ఖాతాలను స్తంభింపజేశారు. తద్వారా రూ.5.25 కోట్లను తిరిగి ఓస్వాల్‌కు అప్పగించారు.
అంతరాష్ట్ర ముఠా
దీని వెనుక ఓ అంతరాష్ట్ర ముఠా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అస్సాం గౌహతిలో అతనుచౌదరి, ఆనంద్‌కుమార్ అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఈ భారీ దోపిడీ వెనుక ఉన్న అసలు సూత్రధారి ఓ మాజీ బ్యాంకు ఉద్యోగి అని, ఆ వ్యక్తి పేరు రుమి కలితా అని పోలీసులు గుర్తించారు. నిందితులకోసం గాలిస్తున్నారు.
డిజిటల్ అరెస్టు అనేదే లేదు!
ఈ ఘటనపై ముంబై పోలీసులు స్పందిస్తూ.. చట్టప్రకారం డిజిటల్ అరెస్టు అనేదే లేదని, వరుస వీడియోకాల్స్ చేసి బెదిరించటానికి మోసగాళ్లు వేస్తున్న ఎత్తుగడ ఇదని తెలిపారు. ఇటువంటి కాల్ రాగానే పోలీసులకు ఫోన్ చేసి తెలియజేయాలని సూచించారు.
Updated Date - Oct 02 , 2024 | 07:25 AM