Himachal crisis: అనర్హతకు గురైన ఎమ్మెల్యేలతో మంత్రి విక్రమాదిత్య సింగ్ భేటీ
ABN, Publish Date - Mar 01 , 2024 | 10:36 AM
హిమాచల్ ప్రదేశ్ రాజకీయాలు తీవ్ర ఉత్కంఠ రేపుతోన్నాయి. రాజ్యసభ ఎన్నికల్లో విప్ ఉల్లంఘించి బీజేపీకి ఓటేసిన ఆరుగురు ఎమ్మెల్యేలపై స్పీకర్ కుల్దీప్ సింగ్ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. ఆ ఎమ్మెల్యేలతో మంత్రి విక్రమాదిత్య చర్చలు జరుపుతున్నారని తెలిసింది.
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) రాజకీయాలు తీవ్ర ఉత్కంఠ రేపుతోన్నాయి. రాజ్యసభ ఎన్నికల్లో (Rajya Sabha Elections) విప్ ఉల్లంఘించి బీజేపీకి ఓటేసిన ఆరుగురు ఎమ్మెల్యేలపై స్పీకర్ కుల్దీప్ సింగ్ (Kuldeep Singh) అనర్హత వేటు వేశారు. దీంతో సభలో సభ్యుల సంఖ్య 68 నుంచి 62కి తగ్గింది. కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 40 నుంచి 34కి చేరింది. ప్రతిపక్ష బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.
సుఖు ప్రభుత్వం సేఫ్
రాజ్యసభ (Rajya Sabha) క్రాస్ ఓటింగ్‌కు సంబంధించి మంత్రి విక్రమాదిత్యపై ఆరోపణలు వచ్చాయి. పదవీకి ఆయన రాజీనామా చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దిగింది. డీకే శివకుమార్‌ను హిమాచల్ ప్రదేశ్ పంపించింది. విక్రమాదిత్యతో రాజీనామా వెనక్కి తీసుకునేలా చేసింది. రాజ్యసభలో క్రాస్ ఓటింగ్‌కు సీఎం సుఖ్వీందర్ బాధ్యత వహిస్తారని డీకే శివ కుమార్ ప్రకటన చేశారు. పరిస్థితి సద్దుమణిగేలా చేశారు. కాంగ్రెస్ సభ్యులపై అనర్హత వేటు పడినప్పటికీ హిమాచల్ ప్రదేశ్‌లో ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమి లేదు. తగిన మెజార్టీ ఉంది. 62 మంది సభ్యుల్లో 32 మంది సభ్యుల మద్దతు ఉంటే సరిపోతుంది. హస్తం పార్టీకి 34 మంది సభ్యుల సపోర్ట్ ఉంది.
ఇది కూడా చదవండి: Himachal Political Crisis: ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
ఎమ్మెల్యేలతో విక్రమాదిత్య మంతనాలు
అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలను తిరిగి సొంతగూటికి తెచ్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ (Congress) భావిస్తోంది. సుధీర్ శర్మ, రవి ఠాకూర్, రాజిందర్ రాణా, ఇందర్ దత్, చేతన్య శర్మ, దేవిందర్ కుమార్‌తో చర్చలు జరిపే బాధ్యతను మంత్రి విక్రమాదిత్యకు అప్పగించింది. ఎమ్మెల్యేలతో విక్రమాదిత్య చర్చలు జరుపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. తిరిగి పార్టీలోకి వచ్చేలా ఒప్పిస్తున్నారని తెలుస్తోంది. పార్టీలోకి వచ్చే అవకాశం ఉంటే.. అనర్హత వేటు వెనక్కి తీసుకుంటామని హామీ ఇస్తున్నారని హిమాచల్ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Mar 01 , 2024 | 10:36 AM