Cyclone Fengal: వరద నీటిలో కొట్టుకు పోయిన బస్సులు, కార్లు.. ఎక్కడంటే..
ABN, Publish Date - Dec 02 , 2024 | 04:32 PM
తమిళనాడు, పుదుచ్చేరి సమీపంలో ఫెంగల్ తుఫాన్ తీరం దాటింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలు భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. కృష్ణగిరి జిల్లాలో గత 14 గంటల్లో రికార్డు స్థాయిలో వర్ష పాతం నమోదు అయింది.
ఫెంగల్ తుపాన్.. తమిళనాడు, కేంద పాలిత ప్రాంతం పుదుచ్చేరి సమీపంలో తీరాన్ని తాకింది. అనంతరం తీవ్ర అల్పపీడనంగా బలహీన పడింది. ఈ నేపథ్యంలో తమిళనాడు, పుదుచ్చేరిలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలు జలమయమైనాయి. కృష్ణగిరి జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు వర్షపు నీటిలో చిక్కకు పోయాయి. ఆ క్రమంలో కృష్ణగిరిలోని ఉత్తాన్‌గిరి బస్టాండ్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దాంతో పలు బస్సులు, చిన్న కారులు వరద నీటిలో కొట్టుకు పోయాయి. అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Also Read: పవన్‌ని చూస్తే.. గబ్బర్ సింగ్ 3 గుర్తుకు వస్తుంది
కృష్ణగిరితోపాటు ఉత్తాన్‌గిరిలో రికార్డు స్థాయిలో వర్ష పాతం నమోదు అయిందని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇక తమిళనాడు, పుదుచ్చేరిలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన పౌరులను తరలించేందుకు ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పుదుచ్చేరిలో వరద నీటిలో చిక్కుకు పోయిన ఓ ఇంట్లోని పసికందును భారత సైన్యం సోమవారం తెల్లవారుజామున రక్షించింది.
తమిళనాడులోని తిరువణ్ణమలై జిల్లాలోని కొండ చరియల కింద ఓ కుటుంబం చిక్కుకు పోయింది. ఐఐటీ మద్రాస్‌కు చెందిన పలువురు విద్యార్థులు వారిని రక్షించారు. అలాగే కడలూరు జిల్లాలోని తుఫాన్ ప్రభావ ప్రాంతంలో చిక్కుకు పోయిన వారిని జాతీయ విపత్తు నిర్వహణ దళం పడవల సహాయంతో రక్షణ చర్యలు చేపట్టింది.
అలాగే తమిళనాడులోని పలు జిల్లాలు.. నీలగిరి, ఈరోడ్, కోయింబత్తురు, తిర్పూర్, కృష్ణగిరి, సేలం, నమక్కల్, తిరుచ్చి, కరూర్, మధురై, తేని జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
మరోవైపు తమిళనాడులోని కర్ణాటక సరిహద్దుగా ఉన్న జిల్లాల్లో వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మంగళవారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశముంది. దాంతో ఆరంజ్ అలర్ట్‌ను భారత వాతావరణ కేంద్రం జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో తమిళానాడులోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు సోమవారం సెలవు ప్రకటించింది.
వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న 7 వేల మందికిపైగా ప్రజలను 147 పునరావాస కేంద్రాలకు తరలించినట్లు తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ వెల్లడించారు. పుదుచ్చేరిలోని కృష్ణ నగర్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఆయా ప్రాంతంలోని దాదాపు 100 మందిని పునరావాస కేంద్రాలకు భారత సైన్యం తరలించింది.
For National news And Telugu News
Updated Date - Dec 02 , 2024 | 04:32 PM