మీరు అమాయకులేం కాదు
ABN , Publish Date - Apr 17 , 2024 | 02:54 AM
పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకుడు రాందేవ్ బాబా, ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు మంగళవారం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. వారు గత ఉత్తర్వుల్లో కోర్టు ఏం చెప్పిందో తెలుసుకోలేనంత అమాయకులేం కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. వారం రోజుల్లోగా బహిరంగ క్షమాపణలు
వారం రోజుల్లో బహిరంగ క్షమాపణలు చెప్పండి
అలాగని ఇప్పుడే మిమ్మల్ని వదిలిపెట్టినట్టు కాదు
రాందేవ్‌బాబా, బాలకృష్ణపై సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకుడు రాందేవ్ బాబా, ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు మంగళవారం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. వారు గత ఉత్తర్వుల్లో కోర్టు ఏం చెప్పిందో తెలుసుకోలేనంత అమాయకులేం కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. వారం రోజుల్లోగా బహిరంగ క్షమాపణలు చెబుతూ ప్రకటన ఇవ్వాలని వారిని ఆదేశించింది. అల్లోపతి వైద్య విధానాల గురించి పతంజలి సంస్థ తప్పుదోవ పట్టించేలా మీడియా ప్రకటనలు చేసిందంటూ గత ఏడాది నవంబరులో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై అప్పుడే పతంజలి సంస్థను కోర్టు మందలించింది. ఆ తర్వాతా పతంజలి సంస్థ కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడంతో ఇద్దరూ కోర్టులో హాజరుకావాలని ఆదేశించింది. ఏప్రిల్ 2న రాందేవ్ బాబా, బాలకృష్ణ కోర్టులో హాజరయ్యారు. ఈ క్రమంలో రాందేవ్ బాబా క్షమాపణలు చెప్పగా అంగీకరించబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఏప్రిల్ 10న మళ్లీ హాజరై క్షమాపణలు చెప్పినా అంగీకరించలేదు. ఈ కేసుపై మంగళవారం జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లా ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘కోర్టు ఆదేశాలను అగౌరవపర్చాలన్నది మా ఉద్దేశం కాదు. మేం చేసిన తప్పునకు బేషరతుగా క్షమాపణలు చెబుతున్నామ’ని ధర్మాసనం ముందు రాందేవ్ బాబా, బాలకృష్ణ తెలిపారు. దీనికి ధర్మాసనం అంగీకరించలేదు. ‘సమాజంలో మీకు చాలా గౌరవం ఉంది. మీరు చేసే ప్రతి పనిని ప్రజలు గమనిస్తూ ఉంటారు. మన సంస్కృతిలో వివిధ వైద్య విధానాలు ఉన్నాయి. ప్రజలు అన్ని పద్ధతులూ పాటిస్తారు. అలాంటప్పుడు వేరే పద్ధతి సరికాదని మీరెలా చెబుతారు.. నయం చేయలేని వ్యాధులపై ప్రకటనలు ఇవ్వకూడదని మీకు తెలియదా? మీది బాధ్యతారాహిత్యం. మీరు చెప్పిన క్షమాపణలను పరిశీలిస్తాం. అయితే ఇప్పుడే మిమ్మల్ని వదిలిపెట్టినట్లు కాదు. ఈ వ్యవహారంలో తప్పును అంగీకరిస్తూ వారం రోజుల్లోగా బహిరంగ క్షమాపణలు చెబుతూ ప్రకటన ఇవ్వండి’’ అని ధర్మాసనం రాందేవ్, బాలకృష్ణను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 23న చేపడతామని తెలిపింది.