ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Marriage: పెళ్లంటే కన్నీళ్లు.. కష్టాలు..!

ABN, Publish Date - Jul 07 , 2024 | 08:48 AM

‘పెళ్లంటే పందిళ్లు.. సందళ్లు.. తప్పెట్లు తాళాలు.. తలంబ్రాలూ.. మూడే ముళ్లు.. ఏడే అడుగులు..’ అని నూరేళ్ల జీవితాన్ని చాలా ఈజీగా చెప్పేశారు ఆత్రేయ..! ఆయన కాలం అట్లుండేది మరి..! కానీ పెళ్లంటే..

Marriage

‘పెళ్లంటే పందిళ్లు.. సందళ్లు.. తప్పెట్లు తాళాలు.. తలంబ్రాలూ.. మూడే ముళ్లు.. ఏడే అడుగులు..’ అని నూరేళ్ల జీవితాన్ని చాలా ఈజీగా చెప్పేశారు ఆత్రేయ..! ఆయన కాలం అట్లుండేది మరి..! కానీ పెళ్లంటే రైతు బిడ్డలకు ఇప్పుడు సినిమా కనిపిస్తోంది. సేద్యం చేసేవారికి పిల్లనిచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో అనంతపురం జిల్లాలో వందలాది మంది యువకులు బ్రహ్మచారులుగా మిగిలిపోతున్నారంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ పిల్లదొరకడం కష్టమని భావించి.. చాలామంది తెలంగాణ, కర్ణాటకలోని మారు మూల ప్రాంతాలకు వెళుతున్నారు. అక్కడ కులం, గోత్రంతో సంబంధం లేకుండా.. చివరకు భాష రాకపోయినా సరే.. ఎదురు కట్నం ఇచ్చి, గుట్టుగా పెళ్లి చేసుకుని మరీ వస్తున్నారు. వ్యవసాయ రంగం దీనస్థితికి అద్దం పడుతోంది ఈ పరిణామం. అన్నదాతలుగా ఖ్యాతి పొందిన రైతుల ఇంట కూతురు పెళ్లి జరుగుతోందేగాని.. కొడుక్కు పెళ్లి చేయడం మాత్రం కష్టంగా మారింది. చిన్నపాటి టీస్టాల్‌ పెట్టుకున్నవారికి, అత్తెసరు జీతంతో బతికే చిరుద్యోగికి సైతం అమ్మాయి దొరుకుతోందిగానీ.. పదుల ఎకరాల భూమి, రూ.కోట్ల ఆస్తి, ట్రాక్టర్లు, ఇతర వాహనాలు ఉన్నా.. సేద్యం చేసేవారికి మాత్రం పిల్ల దొరకడం లేదు. నిత్యం కష్టాలు, నష్టాలమయమైన వ్యవసాయం చేసేవారి వల్ల తమ బిడ్డలు సుఖపడరనే భావన ఆడపిల్లల తల్లిదండ్రుల్లో నెలకొంది. వ్యవసాయదారులకు ఖచ్చితమైన ఆదాయం లేకపోవడమే ఈ దుస్థితికి కారణమని విశ్లేషకులు అంటున్నారు. వ్యవసాయం గిట్టుబాటుగా మారేదాకా ఈ పరిస్థితిలో మార్పు రాదని కూడా స్పష్టంగా చెబుతున్నారు. జిల్లాలో యువరైతులకు సమీప బంధువులేకాదు.. రాయలసీమ ప్రాంతంలో ఏ ఒక్కరూ పిల్లనిచ్చేందుకు ఇష్టపడటం లేదు. చేసేదేమీ లేక చాలామంది పక్కరాష్ట్రాల్లో వధువులను వెతుక్కుంటున్నారు. ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకుంటున్నారు.


అనంతపురం టౌన్‌/కల్చరల్‌/రాప్తాడు/యాడికి : పల్లెటూరి పిల్లోడికి పెండ్లి సంబంధం అంటే.. పెళ్లికూతురు తరఫు నుంచి బంధువులు చాలామందే వచ్చేవారు. ‘సేద్యంలో మొనగాడేనా..?’ అని ఊళ్లో వాళ్లని ఆరాతీసేవారు. పొలం ఏమాత్రం ఉంది..? దొడ్లో గడ్డి వాములు ఎన్నున్నాయి..? ఎన్నిగాండ్ల ఎద్దులున్నాయి..? దిబ్బలో ఎన్ని బండ్ల ఎరువు ఉంది..? కొట్టిడీలో తిండిగింజలు ఏ మాత్రం ఉన్నాయి..? అని గమనించేవారు. ఇవి ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎగేసుకుని పిల్లనిచ్చేవారు. ఇప్పుడు కాలం మారింది. ఆలోచనా మారింది. ‘సేద్యగాడికి ఇచ్చి మా పాపను కష్టపెడతామా..?’ అని ఆడపిల్ల తల్లిదండ్రులు అయిష్టత చూపుతున్నారు. ఫలితంగా.. యువరైతులు పెళ్లి కాకుండానే నడి వయస్కులు అవుతున్నారు. మరికొందరు కర్ణాటక, తెలంగాణలోని దూర ప్రాంతాలకు వెళ్లి.. ఎదురుకట్నం ఇచ్చి పెళ్లి చేసుకొచ్చుకుంటున్నారు. ఒకప్పుడు కట్నకానుకలు పోసి అల్లుడిని కొనలేక ఇబ్బంది పడేవారు. ఇప్పుడు ఎదురు కట్నం ఇస్తామన్నా కోడలు దొరకడం లేదు. వ్యవసాయ సంక్షోభం కారణంగా తలెత్తిన సామాజిక సంక్షోభం ఇది అని విశ్లేషకులు అంటున్నారు. ఈ రెంటికీ పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే..!

అనంతపురం జిల్లా పామిడి మండలంలో.. 44వ నంబరు జాతీయ రహదారి పక్కనే ఉంటుంది ఓ చిన్న పల్లెటూరు. ఈ ఊరిలోని ఓ యువరైతుకు కర్ణాటక యువతితో వివాహం జరిగింది. వరుడికి కన్నడ రాదు. వధువుకు తెలుగు రాదు. అయినా వారిద్దరికీ పెద్దలు వివాహం జరిపించారు. కారణమేమిటో వేరే చెప్పనవసరం లేదు.


గుత్తి మండలంలోని ఓ గ్రామానికి చెందిన రాముడు అనే రైతుకు 9 ఎకరాల చీనీ తోట ఉంది. ఆయనకు ఉన్నది ఒకే కుమారుడు. పదో తరగతి వరకు చుదుకుని, ఆ తర్వాత వ్యవసాయంలోకి దిగాడు. ఎలాంటి దురలవాట్లు లేవు. కానీ 33 ఏళ్ల వయసొచ్చినా పెళ్లి కాలేదు. మొదట్లో తమ కులం అమ్మాయే కావాలని వెతికారు. ఆ తరువాత ఏ కులమైనా పర్వాలేదు.. అమ్మాయి దొరికితే చాలని అనుకున్నారు. ఇక్కడ సాధ్యం కాక.. కర్ణాటకలోని గుల్బర్గాకు వెళ్లి సంబంధం ఖాయం చేసుకున్నారు. ఎట్టకేలకు ఆ యువరైతు పెళ్లి చేసుకున్నారు.

యువరైతులకు దొరకని పెళ్లి కూతుళ్లు

అనంతపురం జిల్లా యువరైతులు గడిచిన రెండేళ్లలో సుమారు 650 మంది కులమతాల పట్టింపులు వదిలేసి.. సుదూర ప్రాంతాల యువతులను పెళ్లి చేసుకున్నట్లు అంచనా. మన రాష్ట్రంలోని శ్రీకాకుళం, తెలంగాణలోని ఆదిలాబాద్‌, వరంగల్‌, కర్ణాటకలోని గుబ్బర్గా, మంగళూరు తదితర ప్రాంతాల అమ్మాయిలు వందలమంది అనంతపురం జిల్లా కోడళ్లు అయ్యారు. ఇవేమీ ఆషామాషీగా జరిగిన వివాహాలు కాదు. బ్రోకర్లకు లక్షలాది రూపాయలు ముట్టజెప్పి మరీ చేసుకున్న పెళ్లిళ్లు..! ఇక ఎదురుకట్నం మొత్తంగా రూ.కోట్లలో చెల్లించి ఉంటారు. రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఇలాఒంటి వివాహాలు వేల సంఖ్యలో జరుగుతున్నాయని చెబుతున్నారు. ఇలాంటి దూరాభార పెళ్లిళ్లు జరిగేందుకు ముందు రెండు కుటుంబాల మధ్య ఆర్థిక ఒప్పందాలతోపాటు బంధాలకు సంబంధించిన ఒప్పందాలను కుదుర్చుకుంటున్నారు. ‘చూడప్పా.. మేము పిల్లనిస్తున్నాం. మీరు డబ్బులు ఇస్తున్నారు. ఒకసారి మా పాపను మీ ఇంటికి పంపిన తరువాత ఇంక మాకు సంబంధం లేదు. మాటి మాటికీ అంతదూరం వచ్చిపోవాలంటే మాకు కుదరదు. ఏ కష్టం వచ్చినా మీరే చూసుకోవాలి..’ అని అమ్మాయి తరపువారు తెగేసి చెబుతున్నారట. సాధారణంగా వివాహం జరిగిన తరువాత కూడా అమ్మాయి తరఫువారికి ఖర్చులు భారీగానే ఉంటాయి. తిరిగింపులు మరిగింపులు.. సారె, తొలి కాన్పునకు పుట్టింటికి తీసుకెళ్లడం వంటివి ఇందులో భాగం. కానీ ఇలాంటివేవీ తమకు సంబంధం లేదని వరుడి తరఫువారికి వధువు కుటుంబ సభ్యులు ఆదిలోనే చెబుతున్నారని సమాచారం. అక్కడి పేదరికం అమ్మాయిలకు, ఇక్కడి వ్యవసాయ సంక్షోభం యువ రైతులకు ఇలా శాపంగా మారుతోంది.


రెండేళ్లలో 650 వివాహాలు

పొరుగు రాష్ట్రాలు, ఇతర జిల్లాలకు వెళ్లి పెళ్లికూతుళ్లను తెచ్చుకుంటున్న యువ రైతుల్లో ఎక్కువశాతం అగ్రవర్ణాలవారే ఉన్నారు. వీరిలో చాలామంది మధ్యలోనే చదువు మానేసి.. వ్యవసాయం చేసుకుంటున్నవారు ఉన్నారు. గ్రామీణ కుటుంబాలు కావడం, కుల కట్టుబాట్లు, పూర్వం నుంచి వారసత్వంగా వచ్చిన పెత్తందారీ లక్షణాల కారణంగా సాధ్యమైనంత వరకూ సొంత కులాల అమ్మాయిలను పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అన్ని ప్ర యత్నాలు విఫలమయ్యాక.. వయసు పెరిగి, ఇక పెళ్లి జరగదేమో అనే సందిగ్ధంలో పడినవారు కులాంతర వివాహాలకు సిద్ధపడుతున్నారు. కానీ తమ ప్రాంతంలోని దిగువ కులాల అమ్మాయిలను చేసుకునేందుకు కులం, హోదాలు అడ్డొస్తున్నాయి. అందుకే దూర ప్రాంతాల అమ్మాయిలను చేసుకుంటున్నారు.

యాడికి పట్టణానికి చెందిన ఓ రైతుకు రూ.కోట్ల విలువజేసే నాలుగు ఎకరాల పొలం ఉంది. రూ.80 లక్షల వరకు బ్యాంకు బ్యాలెన్సు ఉంది. తనది రెడ్డి సామాజికవర్గం. పదో తరగతి వరకు మాత్రమే చదివాడు. వ్యవసాయంలో దిట్ట. కానీ పెళ్లి కాలేదు. 25 ఏళ్ల నుంచి పెళ్లి కూతురు కోసం వెతుకుతూనే ఉన్నారు. ఇప్పుడు అతని వయసు 52 ఏళ్లు..! పిల్ల దొరక్కపోవడానికి ఒకే ఒక్క కారణం.. వ్యవసాయం..! ఎన్నో సంబంధాలను చూశారు. ఇంటి వరకూ చాలా సంబంధాలు వచ్చాయి. కానీ.. ‘సేద్యమొకటేనా..? వేరే ఏమీ చేయడా..?’ అని ప్రశ్నించి వెళ్లిపోయారు.


తల్లిదండ్రులకు నరకం

బెళుగుప్ప మండల కేంద్రానికి చుట్టుపక్కల నాలుగైదు కిలోమీటర్ల పరిధిలో మూడు గ్రామాలు ఉంటాయి. ఒక ఊరిలో సుమారు 500 కుటుంబాలు ఉంటాయి. అందరూ కమ్మ సామాజికవర్గం వారే. పూర్వం నుంచి వీరివి పెద్ద పెద్ద భూస్వామ్య కుటుంబాలు. ఉమ్మడి కుటుంబాలు విడిపోవడంతో కుటుంబాల భూముల విస్తీర్ణం తగ్గింది. అయినా.. ఒక్కొక్కరికి కనీసం 30 నుంచి 40 ఎకరాల పొలం ఉంటుంది. కొందరు చదువుకుని ఉద్యోగాలకు వెళ్లిపోయారు. మరికొందరు ఇతర ప్రాంతాలకు వెళ్లి వ్యాపారాలు చేస్తున్నారు. ఇలాంటివారికి ఏ సమస్యా లేదు. కానీ ఊళ్లోనే ఉండి.. వ్యవసాయం చేస్తున్నవారికి మాత్రం పెళ్లి కావడం లేదు. వ్యవసాయం చేస్తున్న కొడుకులకు పెళ్లి చేయడం తల్లిదండ్రులకు నరకప్రాయంగా మారింది. చాలామంది సంబంధాలు చూసి చూసి.. విసిగిపోయారు. చివరకు ఇతర ప్రాంతాలకు వెళ్లి కులం, గోత్రంతో సంబంధం లేకుండా ఆడబిడ్డను కొనుగోలు చేసి మరీ పెళ్లి చేస్తున్నారు. ఆ ఊరికి చెందిన ఇద్దరు రైతులు బ్రోకర్ల సాయంతో కర్ణాటకకు వెళ్లి.. ఆడబిడ్డ తల్లిదండ్రులకు డబ్బులిచ్చి పెళ్లి కూతుళ్లను తెచ్చుకున్నారు. ముగ్గురి వయసు 40 ఏళ్లు దాటింది. ఇప్పటికీ పెళ్లి కాలేదని ఆ ఊరి జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే మండలంలోని మరో పల్లెలో 40 ఎకరాల పొలం ఉన్నా.. కొడుక్కు పెళ్లి కాలేదన్న మనోవేదనతో కుంగిపోయి ఓ తండ్రి ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పటికీ ఆ రైతు బిడ్డ బ్రహ్మచారిగానే మిగిలిపోయాడు.

పిల్లనిచ్చేవారు కరువయ్యారు..

మేము వయసులో ఉన్నప్పుడు భూములున్న యువ రైతులకు ఏరికోరి పిల్లనిచ్చేవారు. ఉద్యోగులకు పిల్లనిచ్చేందుకు ఇష్టపడేవారు కాదు. ‘వాడు జీతగాడు..’ అన్నట్లు తేలిగ్గా చూసేవారు. ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయి. ఒకరి కింద పనిచేసేటోళ్లకే చక చకా పెళ్లిళ్లు అవుతున్నాయి. పదుల ఎకరాల భూములున్నా, వ్యవసాయం బాగా చేస్తున్నా.. పెళ్లి కూతురు దొరకడం లేదు. చాలా మంది యువ రైతులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఎదురుకట్నం ఇచ్చి పెళ్లి చేసుకొని వస్తున్నారు. మా మండలంలో చాలామంది కర్ణాటకలోని గుల్బార్గా, తెలంగాణ ప్రాంతాలకు వెళ్లి అక్కడి అమ్మాయిలను పెళ్లి చేసుకొని వస్తున్నారు. మా ఊర్లో పెళ్లికాని యువ రైతులు పదిమందిదాకా ఉన్నారు. - నరసింహులు, నగరూరు, యాడికి మండలం.


భూమి ఉండల్ల.. కానీ సేద్యం చెయ్యకూడదంట..

అప్పట్లో గడ్డివాములు, పేడ దిబ్బలు, ఇంట్లో గింజలు, భూమిని చూసి పిల్లనిచ్చేవారు. ఇవన్నీ ఎక్కువగా ఉంటే వెంటనే మంచి మాట చేసుకునేవాళ్లు. సేద్యం చేసే యువకులకు ఇట్లనే పిల్ల దొరికేది. బంగారు, డబ్బులు కట్నంగా ఇచ్చి.. ఇంటికాడ ఘనంగా పెండ్లి చేసి ఆత్తారింటికి సాగనంపేవాళ్లు. ఇప్పుడు భూమి ఉండల్ల... కాని సేద్యం చేయకూడదట. భూమి ఉండి.. ఉద్యోగం చేసే యువకుడికైతే పిల్లనిస్తాండారు. సేద్యం మాత్రమే చేస్తున్నాడంటే.. ‘మా బిడ్డ పొలానికి యాడ పోతాది...? ఎండ, గాలికి సేద్యం పని యాడ చేస్తాది..?’ అని ఆడపిల్ల తల్లిదండ్రులు అంటాండారు. సేద్యం కాకుండా చిన్న ప్రైవేటు ఉద్యోగమైనా కానీలే.. అని ప్రైవేటు ఉద్యోగం చేసేవాళ్లకే పిల్లనిస్తుండారు. - ఎర్రిస్వామి, రాప్తాడు

గడ్డివాములు, ఎరువు దిబ్బలు చూసి పిల్లనిచ్చేవారు..

అప్పట్లో పెద్దోళ్లు పెళ్లి సంబంధాలు చూడటానికి వస్తే.. ఎన్నెకరాల భూమి ఉంది..? దొడ్లో గడ్డివాములు ఎన్ను న్నాయి..? అని చూసేవారు. ఎరువు దిబ్బలు, ఇంట్లో తిండి గింజలు, కొట్టంలో ఎద్దులను పరిశీలించేవారు. భూమి ఎంత ఎక్కువ ఉంటే అంత ప్రాధాన్యం ఉండేది. అట్లాంటి కుటుంబాలకు పిల్లనిచ్చేకి ఎగబడేవారు. వరకట్నం ఇచ్చి ఘనంగా పెళ్లి చేసి అత్తారింటికి పంపేవారు. అప్పటికీ ఇప్పటికీ కాలం మారింది. ప్రస్తుతం వ్యవసాయం చేసే యువకులకు పిల్లనివ్వడం కష్టంగా మారింది. కొన్ని సామాజికవర్గాలలో వ్యవసాయం చేసే యువ రైతులకు పిల్లనివ్వం అని తెగేసి చెబుతున్నారు. దీంతో వారు దూర ప్రాంతాల వెళ్లి వేరే కులాల యువతులకు బంగారం పెట్టి, ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుని వస్తున్నారు.


యాడికి మండలంలోని ఓ పల్లెకు చెందిన కమ్మోళ్ల పిల్లోడిది ఇంకో కథ. తనకు పదెకరాల పొలం ఉంది. వేరుశనగ, మొక్కజొన్న, ఉల్లి తదితర పంటలు సాగుచేస్తుంటాడు. ఏడాదికి రూ.10 లక్షలకు పైగా పంటల దిగుబడి తీస్తాడు. తనకు 25 ఏళ్ల వయసు వచ్చినప్పటి నుంచి పెళ్లి సంబంధాలను చూడటం మొదలు పెట్టారు. ‘సేద్యగాడికి పిల్లనెలా ఇచ్చేది..?’ అని అటువైపు వారు అనేవారు. అలా ఓ పదేళ్లు గడిచాయి. ఆ యువకుడి వయసు 35 ఏళ్లకు చేరింది. ఇక్కడే వెతికితే అయ్యేపని కాదని అనుకున్నారు. కులం.. ప్రాంతం పట్టింపులు లేకుండా.. దూర ప్రాంతాల్లో సంబంధాలు వెతకడం ప్రారంభించారు. తెలంగాణలో ఓ అమ్మాయి దొరికింది. ఆరు తులాల బంగారం, రూ.2 లక్షల నగదు ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకున్నాడు. అంటే.. గురజాడ కాలంనాటి కన్యాశుల్కం అన్నమాట..!

పరిష్కారం కనుగొనాలి..

వ్యవసాయ సంక్షోభం నుంచి రైతులను కాపాడేందుకు ఎంఎస్‌ స్వామినాథన్‌ చేసిన సిఫారసులు ఇప్పటికీ అమలు కాకపోవడం నేటి ఈ దుస్థితికి కారణం. వ్యవసాయదారులకు పెళ్లిళ్లు జరగడమే సమస్యగా మారడం సామాజిక సంక్షోభానికి దారితీస్తుంది. ఇప్పటికే రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలకు తోడుగా సామాజిక అభద్రత ఏర్పడితే అది అశాంతికి దారితీస్తుంది. కాబట్టి ప్రభుత్వాలు వ్యవసాయ సంక్షోభంతోపాటు సామాజిక సమస్యలకు పరిష్కారాలను కనుగొనాలి.


చిన్నదైనా సరే.. ప్రైవేటు ఉద్యోగం చూసుకోవాలట..!

రాప్తాడు మండలంలో ఓ పల్లెటూరి రైతుకు ఒక్కడే కొడుకు. రెడ్డోళ్ల పిల్లోడు..! చూడ చక్కని రూపం. వారికి 15 ఎకరాల పొలం ఉంది. సొంత ఇల్లు, ట్రాక్టర్‌ ఉన్నాయి. మంచి కుటుంబం అన్న పేరుంది. వేరుశనగ, టమోటా, బెండ, వరి తదితర పంటలను సాగు చేస్తాడు. ఏడాదికి కనీసం రూ.10 లక్షలు సంపాదిస్తాడు. రాజకీయాల్లోనూ చురుగ్గా ఉంటాడు. కానీ ఏం లాభం..? ఎవ్వరూ పిల్లనివ్వడం లేదు. సొంత సామాజిక వర్గం అమ్మాయి దొరికితే.. ఎదురు కట్నం ఇచ్చేందుకూ తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నారు. ‘ఆడపిల్లకు బంగారం పెడతాం. వాళ్ల అమ్మానాయనకు డబ్బులు ఇస్తాం. పెళ్లి ఖర్చు ఎంతైనా మేమే పెట్టుకుంటాం. మా వాడికి పిల్లను చూడండి..’ అని బంధువులకు, తెలిసినవారికి చెబుతు న్నారు. ‘సేద్యం చేస్తున్నాడంటే పిల్లను ఎవరిస్తారు..? యాదో ఒకటి.. చిన్న ప్రైవేటు ఉద్యోగమైనా చూసుకోమ నండి...’ అని తేలిపోతున్నారట అందరూ..! ఇప్పుడు ఆ యువ రైతు వయసు 30 ఏళ్లు.

యాడికి మండల కేంద్రానికి సమీపంలో ఉంటుంది ఆ ఊరు. కమ్మ సామాజికవర్గానికి చెందిన ఓ రైతు బిడ్డ డిగ్రీ వరకు చదివాడు. ఐదెకరాల పొలం ఉంది. ఎటువంటి అప్పులు లేవు. రూ.20 లక్షలకు పైగా నగదులో ఉన్నాడు. వ్యవసాయం మాత్రమే చేస్తాడు. తన కాళ్లపై తాను నిలబడ్డాడు. కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి 26 ఏళ్ల వయసు వచ్చినప్పటి నుంచి పెళ్లి సంబంధాలను చూశారు. దాదాపు 14 ఏళ్లపాటు సంబంధాలను చూశారు. వ్యవసాయం చేస్తున్న కారణంగా అతనికి పిల్లనిచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో విసుగొచ్చి.. 40 ఏళ్లు దాటిన తరువాత వివాహ ప్రయత్నాలను మానేశాడు. ఇప్పుడు అతని వయస్సు 54 సంవత్సరాలు.


ఆలోచనలు మారాయి..

అందరూ కాలం మారిందటున్నారు. కాలం కాదు.. మనషుల ఆలోచనలు మారాయి. పూర్వం భూములు ఎంత ఎక్కువ ఉండి, కష్టపడి పనిచేసుకునే కుటుంబాలవారికి ఆడపిల్లలను ఇచ్చి పెళ్లి చేసేవాళ్లం. ఇపుడు అంతా రివర్స్‌ అయింది. భూములు ఉండాలి. ఎక్కడో ఏదో ఉద్యోగం చేయాలి. అక్కడ తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు ఉండకూడదు. అల్లుడు, బిడ్డ మాత్రమే ఉండాలి. ఇదీ.. ఆడపిల్లల తల్లిదండ్రుల ఆలోచన. ఆడపిల్లలకు కూడా ఇలాగే ఆలోచిస్తున్నారు. ‘వ్యవసాయం చేసేవారికి పిల్లనిస్తే మన కూతురు నిత్యం కష్టపడాలికదా?’ అని.. రైతుకు పిల్లనివ్వడం లేదు. అందుకే సేద్యం చేసుకుని బతికే మగపిల్లలకు పెళ్లిళ్లు కాక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కొందరు ఎలాంటి సంబంధంలేని ప్రాంతాలకు వెళ్లి... అక్కడ కులం, గోత్రం ఏదీ చూడకుండా.. ఆడపిల్లల తల్లిదండ్రులకు కొంత డబ్బు ఇచ్చి పెళ్లి చేసుకొని వస్తున్నారు. అలా వచ్చిన ఆడపిల్లలు కూడా నచ్చితేనే ఉంటున్నారు. లేకపోతే వెళ్లి పోతున్నారు. రాకెట్లలో ఒక అమ్మాయిని ఇలాగే చేసుకొని వచ్చారు. ఆమె ఇక్కడ ఉండలేక వెళ్లిపోయింది. ఇప్పటికీ కులం, గోత్రం, సంప్రదాయం అనుకునేవారు పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండి పోతున్నారు. రైతులు ఉండే ఒక్కో గ్రామంలో కనీసం నలుగురైదుగురు పెళ్లి కాని వారు ఉంటారు. రైతుకు ఇలాంటి కష్టాలు వస్తాయని కలలో కూడా అనుకోలేదు. - మాలపాటి ఎర్రిస్వామి, ఎర్రగుడి కొట్టాల, బెళుగుప్ప మండలం

మా పాప పొలానికి వెళ్లలేదు..

రాప్తాడు మండలంలోని ఓ పల్లెలో కమ్మ, రెడ్డి సామాజికవర్గం యువకులు పది మందికి పైగా పెళ్లీడుకొచ్చారు. ఎకరాలకు ఎకరాలు భూములు, సొంతిళ్లు, ట్రాక్టర్లు, ఇతర వాహనాలు ఉన్నాయి. ఏటా పంటలు బాగా పండిస్తారు. ఆర్థికంగా ఏ ఇబ్బందులూ లేవు. అయినా ఎవరికీ పిల్ల దొరకడం లేదు. ఎంత ఆస్తి ఉన్నా.. సేద్యగాడికి పిల్లనివ్వడం అంటేనే తల్లిదండ్రులు భయపడుతున్నారు. ‘పంటలు సరిగా పండవు. గిట్టుబాటు ధరలు ఉండవు. పైగా మా పాప పొలానికి వెళ్లలేదు. రైతులకు ఇచ్చి కష్టపెడతామా ఏంది..?’ అని ఆడపిల్లల తల్లిదండ్రులు అంటున్నారట..! ఇట్లయితే పెళ్లి కావడం కష్టమేనని భావించి.. చాలామంది దళారులను ఆశ్రయిస్తున్నారు. కర్ణాటక, తెలంగాణలోని మారుమూల ప్రాంతాలకు చెందిన వేరే కులాల అమ్మాయిలకు బంగారు పెట్టి, ఎదురు క ట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకుని వస్తున్నారు. దళారులకు వేలాది రూపాయలు ముట్టజెప్పుతున్నారు.

Updated Date - Jul 07 , 2024 | 09:55 AM

Advertising
Advertising
<