Health Secret : ఆకలి పెంచే చాక్లెట్.. ఖాడవం
ABN, Publish Date - Aug 10 , 2024 | 03:15 AM
చాక్లెట్లు పెడితే పిల్లలకు పళ్లు చెడిపోతాయని, కడుపులో ఎలిక పాములు పెరుగుతాయని, ఆకలి చచ్చిపోతుందనీ, తిన్నది వంటపట్టదనీ... ఇలా రకరకాలుగా భయపడతాం.
‘ఖాడవం ముఖవైశద్య కారకం రుచిధారకమ్! హృద్రోగశమనం చేతి ముఖవైరస్యనాశనమ్!’ ఇలా తయారు చేసిన ‘ఖాడవం’ అనే చాక్లెట్‌ను చప్పరిస్తే ఆకలి అమాంతం పెరుగుతుంది. నాలుక మీద జిగురు పోయి, నోటికి రుచి తెలుస్తుంది. గుండెకు మంచిది. ఉసిరికాయ జీవన క్రియల్ని పెంపు చేసే ద్రవ్యం. ఈ విధంగా రోజూ ఉసిరికాయను పిల్లలకు కూడా ఇవ్వటానికి ఈ బిళ్లలు తోడ్పడతాయి. నోటి దుర్వాసన పోతుంది. దంత వ్యాధులు ఉపశమిస్తాయి. ఖాడవం పేగుల్ని శుభ్రపరుస్తుంది. జీర్ణశక్తిని దెబ్బ తీసే దోషాలన్నీ పోగొడుతుంది.
చాక్లెట్లు పెడితే పిల్లలకు పళ్లు చెడిపోతాయని, కడుపులో ఎలిక పాములు పెరుగుతాయని, ఆకలి చచ్చిపోతుందనీ, తిన్నది వంటపట్టదనీ... ఇలా రకరకాలుగా భయపడతాం. కానీ, దంతాలను బాగు చేసి, కడుపులో నులిపురుగుల్ని చంపి, ఆకలిని పెంచి, తిన్నది వంటబట్టేలా చేసే చాక్లెట్ గురించి క్షేమశర్మ తన ‘క్షేమ కుతూహలం’ గ్రంథంలో ఓ అద్భుతమైన ఫార్ములా ఇచ్చాడు. ఈ చాక్లెట్లను మల్టీనేషనల్ కంపెనీలు మాత్రమే తయారు చేసేవి కాదు, మనకు మనమే ఇంట్లో తయారు చేసుకోగలిగేవి. ఆ చాక్లెట్ల పేరే ‘ఖాడవం’.
లోకం గురించి, జనం గురించి ఆలోచించేవాళ్లను ఋషులంటారు. తన గురించి తన వ్యాపార సామ్రాజ్యం గురించి మాత్రమే ఆలోచించేవాళ్లను కాపురుషులంటారు. క్షేమశర్మ... పిల్లలే కాదు, పెద్దలు కూడా తినదగిన, తినాల్సిన చాక్లెట్ లేదా క్యాండీని తయారు చేసుకునే విధానాన్ని ఇలా వివరించాడు:
కోలామలకజం చూర్ణా శుంఠ్యేలాశర్కరాన్వితమ్!
మాతులుంగ రసేనాక్తం శోషితం సూర్యరశ్మిభిః!
ఎండిన ఉసిరికాయలు... వనమూలికలు అమ్మే షాపుల్లో లేదా, పెద్ద పచారీ కొట్లలో దొరుకుతాయి. ఈ కాయల్ని పగలకొట్టి, లోపలి గింజల్ని తీసేయండి. మిగిలిన ఉసిరకను మిక్సీ పట్టి, జల్లించిన మెత్తని పొడిని సిద్ధం చేసుకోండి.
నల్ల మిరియాల పొడిని కూడా ఇలానే చేసి, పక్కన పెట్టుకోండి.
అల్లాన్ని ఎండిస్తే అదే శొంఠి. దీన్ని పైపైన కాల్చి, మిక్సీ పడితే మెత్తని పొడి వస్తుంది. ఈ పొడిని జల్లించగా వచ్చిన పీచుని కూడా ఒకట్రొండుసార్లు మిక్సీ పట్టండి. పీచు పారేయవద్దు. అదే డయటరీ ఫైబర్. పేగులకు బలాన్నిస్తుంది.
ఈ మూడింటికీ ప్రత్యేకంగా కొలతలు చెప్పలేదు. ఉసిరికాయ పొడికి చాలినంత మిరియాలు, శొంఠి, ఏలకుల పొడులు కలపండి. దీనికి పంచదార జత చేసి, అన్నీ బాగా కలిసేలా మరోసారి మిక్సీ పట్టండి.
ఒక మట్టి ముంతలోకి ఈ పొడిని తీసుకుని, అది మునిగే దాకా మాదీఫల రసం కానీ, నిమ్మ రసం కానీ పొయ్యండి. మూతపెట్టి ఒక రోజంతా నాననివ్వండి.
మర్నాడు ఉదయం ఆ రసంతో సహా మిశ్రమాన్ని ఒక మూకుడులోకి తీసుకుని, మంచి ఎండలో ఎండనివ్వండి.
రాత్రికి మళ్లీ అందులో నిమ్మ రసం కలిపి, రాత్రంతా నాననిచ్చి, మర్నాడు మళ్లీ ఎండలో పెట్టండి.
ఏవంతు బహుశోభ్యక్తం శోషితంచ పునః పునః!
ఈషల్లవణ సంయుక్తం చూర్ణా ఖాడవముచ్యతే!
ఈ విధంగా నిమ్మ రసంలో నానబెట్టి, ఎండబెట్టడంవల్ల నిమ్మలోని సారం అంతా ఉసిరి, మిరియాలు, శొంఠి పొడికి పట్టుకుంటుంది. దీన్ని ‘భావన చేయటం’ అంటారు. ‘భావన’ అంటే ‘వాసన పట్టటం’ అని నిఘంటువు అర్థం. ఏదైనా ద్రవంలో నాననివ్వటాన్ని ‘భావన చేయటం’ అంటారు. శొంఠి పొడి, కరక్కాయ, జీలకర్ర, వాము, లేదా సోంపును ఇలా భావన చేసి... భావన జీలకర్ర/ భావనశొంఠి లాంటివి తయారు చేస్తారు. ఏదైనా ఒక ద్రవ్యాన్ని అల్లం రసంలో ఏడుసార్లు భావన చేస్తే... అది శుద్ధి అవుతుంది. ఆయుర్వేద పద్ధతిలో ఇలా దోషాలు లేకుండా వనమూలికలు, లోహాలను భావన చేస్తారు.
ఇప్పుడు మనం ఉసిరికాయ, మిరియాలు, శొంఠి... ఈ మూడు గొప్ప వనమూలికలను నిమ్మ రసంలో భావన చేశాం. కనీసంలో కనీసం ఏడు రోజులు భావన చేయటంవల్ల ఈ మూడు ద్రవ్యాలూ నిమ్మ రసంతో శక్తిమంతమవుతాయి. తద్వారా కొన్ని అదనపు ఔషధ గుణాలను పొందుతాయి. బాగా ఎండిన తరువాత దీన్ని మరొకసారి మిక్సీ పట్టండి. ఇందులో తగినంత ఉప్పు కూడా కలపమన్నాడు క్షేమశర్మ. అందువల్ల ఇది తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు రుచుల్ని కలిగి, ఆరు రసాల సమన్వితం అవుతుంది. ఈ పొడిని ‘ఖాడవ’ అంటారని వివరించాడు క్షేమశర్మ. ఆప్టే సంస్కృత నిఘంటువు ‘ఖాడవ’ అంటే ‘క్యాండీ’ అనే అర్థాన్నిచ్చింది.
ఈ పొడిని మన చాక్లెట్‌గా మలచుకోవాలి. దీని కోసం పంచదార లేత పాకం పట్టి, అందులో ఈ పొడిని కలపండి. తడిపిన తెల్లని వస్త్రాన్ని పరిచి, దానిమీద చెంచాతో చిన్నచిన్న బిళ్లల్లా లేదా వడియాల్లా పెట్టి ఆరనిస్తే అందరూ ఇష్టంగా తినే క్యాండీలు తయారవుతాయి. ఒక్కో బిళ్లని బుగ్గన పెట్టుకుని చప్పరించటమే!
విషపూరితమైన రంగులు, రసాయనాలు, ప్రిజర్వేటివ్స్, కృత్రిమ తీపి పదార్థాల్లాంటివి కలిపి తయారు చేసే చాక్లెట్లు, బిళ్లలే గొప్ప అనుకొంటున్నాం. అవేవి అవసరం లేని అద్భుతమైన క్యాండీని ‘ఖాడవం’గా పరిచయం చేశాడు క్షేమశర్మ. దీన్ని ఇంట్లోనే చేసుకోవచ్చు.
- గంగరాజు అరుణాదేవి
Updated Date - Aug 10 , 2024 | 03:15 AM