Navya : ఒకప్పటి హైదరాబాద్ క్రికెట్
ABN, Publish Date - Jul 28 , 2024 | 05:01 AM
క్రికెట్ ఇప్పుడు మన ‘జాతీయ క్రీడ’లాగా మారిపోయింది కానీ ఒకప్పుడు దీనిని రాజకుటుంబీకులు మాత్రమే ఆడేవారు. హైదరాబాద్‌లో క్రికెట్ ప్రాచుర్యంలోకి రావటానికి మా నాన్న రాజా ధన్‌రాజ్‌గిర్, నవాబ్ మొయిన్ ఉద్ దౌలా కారణం.
అలనాటి కథ
క్రికెట్ ఇప్పుడు మన ‘జాతీయ క్రీడ’లాగా మారిపోయింది కానీ ఒకప్పుడు దీనిని రాజకుటుంబీకులు మాత్రమే ఆడేవారు. హైదరాబాద్‌లో క్రికెట్ ప్రాచుర్యంలోకి రావటానికి మా నాన్న రాజా ధన్‌రాజ్‌గిర్, నవాబ్ మొయిన్ ఉద్ దౌలా కారణం. స్వాతంత్య్రం రాకముందు వీరు క్రికెట్‌కు ఇచ్చిన ప్రోత్సాహం ఆ తర్వాతి కాలంలో అనేక మంది గొప్ప క్రీడాకారులు తయారవటానికి కారణమయింది.
క్రికెట్ ఆంగ్లేయుల ఆట. బ్రిటిష్ మిలటరీ రెజిమెంట్స్ ఉన్న ప్రాంతాల్లో ఆర్మీ అధికారులు క్రికెట్ ఆడుతూ ఉండేవారు. ఫుట్‌బాల్, వాలీబాల్ మాదిరిగా దీనిని రెజిమెంట్స్ ఉన్న ప్రాంతాల్లో ఆడటానికి వీలుండదు కాబట్టి కొన్ని కాలేజీ గ్రౌండ్స్‌ను, పెరేడ్ గ్రౌండ్స్‌ను ఎంపిక చేసుకొని వాటిలో ఆడేవారు.
ఇలా సికింద్రాబాద్‌లోని పెరేడ్ గ్రౌండ్స్, జింఖానా క్లబ్ గ్రౌండ్స్ మొదలైన వాటిని ఎంపిక చేసుకున్నారు. అయితే క్రికెట్ ఖరీదైన ఆట. బ్యాట్స్, ప్యాడ్స్, గ్లౌవ్స్, ఆట మధ్యలో డ్రింక్స్, స్నాక్స్, ఆటగాళ్లకు రవాణా సదుపాయాలు... ఇలా ఎంతో ఖర్చుతో కూడుకున్నది. అందువల్ల కొందరు అధికారులు రాజ కుటుంబీకులను విరాళాల కోసం సంప్రదించారు.
అప్పటికి పోలో ఒకటే రాజకుటుంబీకులు ఆడే ఆటగా ఉండేది. క్రికెట్‌లో ఉన్న ఆకర్షణను గుర్తించిన నాన్న ధన్‌రాజ్‌గిర్ వంటి వారు క్రికెట్ టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఈ టీమ్‌లలో దేశంలోని అనేక మంది యువరాజులు, ప్రముఖ క్రికెటర్లు ఆడేవారు. నాన్న ఏర్పాటు చేసిన ‘ధన్‌రాజ్‌గిర్ ఎలెవన్’ టీమ్‌లో పాటియాలా యువరాజు ముస్తాక్, సి.కె.నాయుడు, దేవదర్, విజయనగరం యువరాజు వంటి వారు ఆడేవారు. టీమ్‌లు మధ్య పోటీ కోసం నవాబ్ మొయిన్ ఉద్ దౌలా... ‘బషీర్‌బాగ్ కప్’ నిర్వహించారు.
ఈ కప్‌ను పూర్తి బంగారంతో తయారు చేసేవారు. మూడుసార్లు గెలిచిన టీమ్ ఈ కప్‌ను తమ వద్దే ఉంచుకోవచ్చు. దీనితో ఆటగాళ్లు ప్రతిష్టాత్మకమైన ఈ కప్పును పొందటానికి ప్రయత్నించేవారు. ధన్‌రాజ్ ఎలెవన్ మూడుసార్లు వరుసగా ఈ కప్పు గెలుచుకుంది. మ్యాచ్‌లు పోటాపోటీగా జరుగుతూ ఉండటంతో ప్రేక్షకులు రావటం మొదలుపెట్టారు. దాంతో హైదరాబాద్‌లో క్రికెట్ సందడి బాగా పెరిగింది.
ఒక దశలో ఇతర ప్రాంతాల నుంచి ముఖ్యమైన ఆటగాళ్లు వచ్చి ఆడుతున్నప్పుడు, అప్పటి ప్రభుత్వం సెలవు కూడా ప్రకటించేది. ఇక ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఆటగాళ్లతో జ్ఞాన్‌భాగ్ ప్యాలెస్ కూడా కళకళలాడుతూ ఉండేది.
టైగర్ పటౌడి, సి.కె.నాయుడు వంటివారు నాన్నకు మంచి స్నేహితులు. సి.కె.నాయుడు మా ఇంటికి వచ్చినప్పుడు సరదాగా నాతో షటిల్ బ్యాట్‌తో క్రికెట్ ఆడేవారు. ఆ తర్వాతి కాలంలో హైదరాబాద్... క్రికెట్‌కు ఒక ముఖ్యమైన కేంద్రంగా మారిపోయింది. క్రికెట్‌కు కావాల్సిన గ్రౌండ్స్, ఆఫీసులు వెలిసాయి. ఫతేమైదాన్ వద్ద ఉన్న క్రికెట్ అసోషియేషన్ ఆఫీసు ఎప్పుడూ సందడిగా ఉండేది. ఇప్పటితో పోలిస్తే అప్పటి క్రీడాకారులకు ఎక్కువ డబ్బులు వచ్చేవి కావు. కానీ ఇప్పటి లాగే అప్పుడు కూడా వారి పట్ల ప్రజల్లో క్రేజ్ మాత్రం ఉండేది.
- రాజకుమారి ఇందిరాదేవి ధన్‌రాజ్‌గిర్
Updated Date - Jul 28 , 2024 | 05:20 AM