Share News

Navya : స్థితప్రజ్ఞత

ABN , Publish Date - Aug 23 , 2024 | 05:27 AM

మనం ఒక పరిస్థితిని, ఒక వ్యక్తిని లేదా ఒక పని తాలూకు ఫలితాన్ని మంచి లేదా చెడుగా విభజిస్తాం. అయితే ఏ అభిప్రాయాన్ని వ్యక్తం చెయ్యని మూడవ స్థితి కూడా సంభవమే.

Navya : స్థితప్రజ్ఞత

మనం ఒక పరిస్థితిని, ఒక వ్యక్తిని లేదా ఒక పని తాలూకు ఫలితాన్ని మంచి లేదా చెడుగా విభజిస్తాం. అయితే ఏ అభిప్రాయాన్ని వ్యక్తం చెయ్యని మూడవ స్థితి కూడా సంభవమే. శ్రీకృష్ణుడు ఆ మూడవ స్థితి గురించి ప్రస్తావిస్తూ ‘‘దేనిపట్లా మమతాసక్తులు లేనివాడు, అనుకూల పరిస్థితుల్లో సంతోషం, ప్రతికూల పరిస్థితుల్లో ద్వేషం లాంటి మనోవికారాలకు లోనుకానివాడు అయిన వ్యక్తిని ‘స్థితప్రజ్ఞుడు’ అంటారు’’ అని చెప్పాడు. స్థిత ప్రజ్ఞుడు తన సొంత అభిప్రాయాలను వదిలేసి, వాస్తవాలను వాస్తవాలుగా తీసుకుంటాడని ఇది సూచిస్తోంది.

ఎందుకంటే ‘మంచి-చెడు’’ అనే విభజన ‘సుఖదుఃఖాలు’ అనే ద్వంద్వాలకు జన్మస్థలం. పరిస్థితులను, వాస్తవాలను తక్షణమే మంచి లేదా చెడు అని వర్గీకరించే మన ధోరణికి విరుద్ధంగా ఈ బోధ నడుస్తుంది.

కాబట్టి ఇది కఠినంగా కనిపిస్తుంది. చెడుగా అనిపించే పరిస్థితిని లేదా వ్యక్తిని ఎదుర్కొన్నప్పుడు వెనువెంటనే అయిష్టత, విరక్తి, ద్వేషం అనేవి వాటంతట అవే కలుగుతాయి. కానీ స్థిత ప్రజ్ఞుడు ఏ పరిస్థితి గురించి అభిప్రాయాన్ని ఏర్పరచుకోడు కాబట్టి అతనిలో ద్వేషం పుట్టడానికి అవకాశమే లేదు. అదే విధంగా మంచి విషయాలకు స్థితప్రజ్ఞుడు పొంగిపోడు.


ఉదాహరణకు మన అందరిలో అందం, ఆకర్షణ కాలక్రమేణా సహజంగా తగ్గిపోతాయి. వృద్ధాప్యం అనే దశకు చేరుకుంటాం. ఇవి కేవలం ప్రాకృతిక వాస్తవాలు. కానీ మనం వాటిని అప్రియంగా లేదా చెడ్డవిగా భావిస్తే... అవి దుఃఖాన్ని తెస్తాయి. గాయం లేదా అనారోగ్యం లాంటి విషయాలలో సరైన చికిత్స వైపు దృష్టి పెట్టకుండా... ప్రస్తుత పరిస్థితులను చెడుగా భావించడమే దుఃఖం. ఒక శస్త్రవైద్యుడు (సర్జన్‌) వివిధ పరీక్షల ద్వారా వెల్లడయిన ఫలితాల ఆధారంగా రోగికి శస్త్రచికిత్స చేస్తాడు.

స్థితప్రజ్ఞుడు కూడా వాస్తవిక దృష్టితో పరిస్థితులను ఎదుర్కొంటాడు. ఒక సూపర్‌ కండక్టర్‌ ఎలాగైతే మొత్తం విద్యుత్తును ఎలాంటి ఆసక్తి లేకుండా... స్వేచ్ఛగా తనలోంచి ప్రవహింపజేస్తుందో... స్థితప్రజ్ఞుడు కూడా అదే విధంగా ఆసక్తి లేకుండా జీవిస్తాడు. మనం పరిస్థితులపట్ల, వ్యక్తులపట్ల, పనులపట్ల ఇష్టంతో కాని, అయిష్టంతో కాని ఉంటాం. ఇష్టం అంటే ఆ అంశాలతో ఏర్పడే అనుబంధం అని అర్థం చేసుకోవడం చాలా సులభం.

కానీ అయిష్టం కూడా ఒక రకమైన అనుబంధమే. కాకపోతే అది ద్వేషంతో ముడిపడిన బంధం. స్థితప్రజ్ఞుడికి మమతాసక్తులు లేవన్నాడు శ్రీకృష్ణుడు. అంటే వారు ఇష్టాలు, అయిష్టాలు... ఈ రెండిటినీ వదిలేస్తారని అర్థం.

కె. శివప్రసాద్‌

ఐఎఎస్‌

Updated Date - Aug 23 , 2024 | 05:27 AM