Share News

అదే హోలీ సందేశం

ABN , Publish Date - Mar 14 , 2025 | 03:02 AM

ఆధ్యాత్మికతకు, ఆరాధనాతత్త్వానికి సమన్వయ స్వరూపమే హోలీ మహోత్సవ అంతరార్థం. ఊరూవాడా, చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకొనే పండుగ హోలీ. సర్వమానవ...

అదే హోలీ సందేశం

పర్వదినం

ఆధ్యాత్మికతకు, ఆరాధనాతత్త్వానికి సమన్వయ స్వరూపమే హోలీ మహోత్సవ అంతరార్థం. ఊరూవాడా, చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకొనే పండుగ హోలీ. సర్వమానవ సౌభ్రాతృత్వానికి నిదర్శనంగా నిలిచే పర్వదినం. ఫాల్గుణ పూర్ణిమను హోలీ పూర్ణిమగా వ్యవహరిస్తారు. అలాగే ‘కాముని పున్నమి’, ‘కామదహనం’, ‘ఫాల్గుణోత్సవం’ అని కూడా పిలుస్తారు. ఈ పండుగ ప్రస్తావన వివిధ పురాణాలతో పాటు హలుడి ‘గాథా సప్తశతి’, వాత్సాయనుడి ‘కామసూత్రాలు’, కాళిదాసు ‘మాళవికాగ్నిమిత్రం’, దండి ‘దశకుమార చరిత్రం’ తదితర కావ్యాల్లో విస్తారంగా ఉంది. విదేశీ యాత్రికులైన అల్‌ బిరూనీ, నికోలో కాంటే... భారతదేశంలో ప్రజలు ఆనందోత్సాహలతో చేసుకొనే హోలీ వేడుకను ‘వసంతోత్సవం’గా వర్ణించారు.


హోలీ అనగానే మనలో ముందుగా మెదిలేది రాధా మాధవుల జీవాత్మ-పరమాత్మల సంయోగమే. బృందావనంలో వారిరువురి ప్రణయ జీవనాన్నీ కథలు కథలుగా చెప్పుకొంటున్నాం. వాటిలో హోలీ వైభవమంతా గోచరించి, మనల్ని తన్మయత్వంలో ముంచుతుంది. హిందువుల సంస్కృతీ సంప్రదాయాలకు, ధార్మికతకు, ఆధ్యాత్మిక వైభవానికి నిలువెత్తు దర్పణం.... హోలీ. వసంతకాల ఆగమనం, కొత్త పంటల రాక, శీతగాలులు తొలగి వెచ్చని కిరణాల సోయగంతో భానుడి ప్రకాశం, పున్నవి పవిత్రత, రంగుల విశిష్టత, అందరిమధ్యా సౌభ్రాతృత్వం వెల్లి విరియడం... ఇవన్నీ హోలీ పర్వంలో చూడగలం. హోలీ... వెలుగుకు మేలుకొలుపు. ఇది వ్యక్తిగత ఆకాంక్షలకు, ఆశయాలకు, సర్వ చైతన్య భావస్ఫూర్తికి ప్రతిబింబంగా గోచరిస్తుంది.

హోళికా పూర్ణిమకు సంబంధించిన ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. తారకాసుర సంహారానికి కుమారస్వామి జన్మించడానికి వెనుక మన్మధుణ్ణి శివుడు దహించాడు. రతీదేవి ప్రార్థనకు చలించిన శివుడు ఆమెకు వరాన్ని ప్రసాదించాడు. ఆ రోజు ఫాల్గుణ పూర్ణిమ. మరో కథ ప్రకారం... హోలిక అనే రాక్షసి మరణించిన రోజును హోలీగా పున్నమిగా నిర్వహించుకుంటున్నాం. ఆమె హిరణ్యకశిపుడి సోదరి అని కూడా కొన్ని గ్రంథాలు పేర్కొన్నాయి. ఇలా ఎన్నో కథలు ఉన్నపఁటికీ... ప్రధానంగా శ్రీకృష్ణుడితోనే హోలీ ఎక్కువగా ముడిపడి ఉంది. ఈ రోజున చిన్ని కృష్ణుణ్ణి ఊయలలో ఉంచి, ఉత్సవం నిర్వహిస్తారు. ఉత్కళ, వంగ రాష్ట్రాల్లో దీన్ని డోలోత్సవంగా జరుపుకొంటారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకూర్మంలో కూడా ఈ ఉత్సవం వైభవంగా జరుగుతుంది.


హోలీ రంగులు మనిషి ధార్మిక జీవనానికి మార్గదర్శులు. సప్తవర్ణాల సమ్మేళనమే తెలుపు. ఇది శాంతికి, సౌజన్యానికి ప్రతీక. కాంతిని పెంచేది ఎరుపు, భాగ్యాన్ని అందించేది పసుపు. వీటి విలక్షణతను అవగాహన చేసుకొని, జగమంతా ‘రంగులమయం, రసమయం’ అనే భావాన్ని అందిపుచ్చుకోవాలి. ప్రకృతిలో సహజంగా ఉన్న అన్ని వర్ణాల సౌందర్యాన్ని ఆస్వాదించాలి. అదే హోలీ ఉత్సవంలోని సందేశం.

ఆయపిళ్ళ రాజపాప

ఈ వార్తలు కూడా చదవండి:

MLC Elections: తెలుగు రాష్ట్రాల్లో ఏకగ్రీవమైన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు..

Fish and Mutton prices: బర్డ్ ఫ్లూ దెబ్బకు కొండెక్కిన మటన్, చేపల రేట్లు.. పరిస్థితి ఎలా ఉందంటే..

Updated Date - Mar 14 , 2025 | 03:03 AM