Share News

Rakshabandhan : సోదర బంధానికి రక్ష! రక్ష!

ABN , Publish Date - Aug 19 , 2024 | 02:06 AM

శ్రావణం ఐశ్వర్యప్రదమైన మాసం. దీని విశిష్టతను పరమశివుడు పార్వతికి వివరిస్తూ ‘‘అస్మిన్‌ మాసే కృతం యద్యత్తదనంతాయ కల్పతే... ఈ మాసంలో ఆచరించే క్రతువులు అనంతమైన ఫలాలను ఇస్తాయి’’ అని చెప్పాడు.

Rakshabandhan : సోదర బంధానికి రక్ష! రక్ష!

పర్వదినం

  • నేడు రాఖీ పౌర్ణమి

శ్రావణం ఐశ్వర్యప్రదమైన మాసం. దీని విశిష్టతను పరమశివుడు పార్వతికి వివరిస్తూ ‘‘అస్మిన్‌ మాసే కృతం యద్యత్తదనంతాయ కల్పతే... ఈ మాసంలో ఆచరించే క్రతువులు అనంతమైన ఫలాలను ఇస్తాయి’’ అని చెప్పాడు.

ఎంతో మహిమాన్వితమైన ఈ నెలలో... పౌర్ణమి మరింత ప్రత్యేకమైనది. హయగ్రీవుడిగా శ్రీమహావిష్ణువు అవతరించినది శ్రావణ పౌర్ణమి నాడే. హయగ్రీవ వృత్తాంతం భాగవతంలోను, మహాభారతంలోను కనిపిస్తుంది.

వేదాలను అపహరించిన రాక్షసుల సంహారం కోసం ఆవిర్భవించిన హయగ్రీవుణ్ణి జ్ఞాన ప్రదాతగా ఆరాధిస్తారు.


ఇదే రోజును ‘రక్షా బంధన దినోత్సవం’గా, ‘రాఖీ పౌర్ణమి’గా నిర్వహించే సంప్రదాయం భారతదేశమంతటా ఉంది. సోదరీ సోదరుల మధ్య జీవితాంతం ఉండవలసిన అనురాగ బంధం గురించి చాటి చెప్పే పర్వదినం రాఖీ పౌర్ణమి. సోదరుల ఉన్నతిని ఆకాంక్షిస్తూ, తనకు రక్షగా ఉండాలని కోరుతూ అక్కలు, చెల్లెళ్ళు రాఖీలను కడతారు. ధర్మ రక్షణ, దేశ రక్షణ, పరస్పర రక్షణ భావనలు రక్షాబంధనంలో ఇమిడి ఉన్నాయి. ఇది అనాది సంప్రదాయమని భవిష్యోత్తర, బ్రహ్మాండ, అగ్ని పురాణాల్లో, ఇతిహాసాల్లో, చరిత్రలో కనిపించే ప్రస్తావనలు రుజువు చేస్తున్నాయి.


యమధర్మరాజుకు ఆయన సోదరి యమున రక్షను కట్టగా... ఆమెను యముడు ఆశీర్వదిస్తూ, ‘‘ఈ రోజు సోదరులకు రక్షను కట్టిన మహిళలకు సర్వ శుభాలు కలుగుతాయి’’ అని వరమిచ్చాడని, దేవ దానవ యుద్ధ సమయంలో ఇంద్రుడి విజయం కోసం శచీదేవి రక్ష కట్టిందని పురాణ కథలు ఉన్నాయి. చిత్తోడ్‌ రాజ్యం మీద బహదూర్‌షా దండయాత్రకు సిద్ధపడినప్పుడు, సాయం కోరుతూ మొఘల్‌ చక్రవర్తి హుమయూన్‌కు రాణి కర్ణావతి రాఖీ పంపిందనీ, ఆమెను సోదరిగా భావించిన హుమయూన్‌ తన సేనను పంపించి బహదూర్‌షాను ఓడించాడనీ చరిత్ర కథనం.


రాజపుత్ర వనితలు యుద్ధ సమయాల్లో తమ భర్తలకు రక్ష కట్టేవారట. తుల్జా భవానీని ఆరాధించి, ఆమె కటాక్షంతో ఖడ్గాన్ని, రక్షా కంకణాన్ని ఛత్రపతి శివాజీ పొందాడనే కథ కూడా ప్రాచుర్యంలో ఉంది.

దేశంలోని అన్ని ప్రాంతాల్లో... తమ తమ ఆచారానుసారం పలు పద్ధతుల్లో, వివిధ పేర్లతో ఈ పర్వదినాన్ని ప్రజలు జరుపుకొంటారు. శ్రావణ పౌర్ణమిని ‘జంధ్యాల పౌర్ణమి’ అని కూడా అంటారు. ఉపనయన సంస్కారం పొందినవారు ఈ రోజున కొత్త యజ్ఞోపవీతాలను ధరించి, గాయత్రీ దేవిని పూజిస్తారు. గురుముఖంగా వేదాధ్యయనం చేయడానికి శ్రావణ పౌర్ణమిని ఉత్తమమైన రోజుగా పండితులు పరిగణిస్తారు.


యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః

తేనత్వామభిబధ్నామి రక్షే మాచలమాచల

బలి చక్రవర్తి అభిమానానికి మెచ్చిన మహావిష్ణువు... అతని వద్దనే చిక్కుకుపోయాడట. విష్ణుమూర్తిని విడిపించడం కోసం బలి చక్రవర్తికి శ్రీ మహాలక్ష్మి రక్షను కట్టిందనే కథ ‘భవిష్య పురాణం’లో కనిపిస్తుంది. ‘‘మహా బలశాలి అయిన బలి చక్రవర్తినే బద్ధుణ్ణి చేసిన, మహా శక్తిమంతమైన రక్షను నీకు కడుతున్నాను. దీని శక్తితో నువ్వు చల్లగా వర్థిల్లుతూ ఉండాలి’’ అని ఈ శ్లోకానికి అర్థం. ఈ శ్లోకం చదువుతూ సోదరులకు రక్షను కట్టడం శుభప్రదమనేది శాస్త్రవచనం.

- ఆయపిళ్ళ రాజపాప

Updated Date - Aug 19 , 2024 | 06:37 AM